రుషికొండకు మోక్షమెప్పుడు.?
ABN , Publish Date - Jun 14 , 2026 | 04:20 AM
రుషికొండ ప్యాలెస్‌ను ఏం చేద్దాం..? రెండేళ్లుగా ఉన్నతస్థాయిలో ఇదే ప్రశ్న నడుస్తోంది. కూటమి ప్రభుత్వం వచ్చాక కాలయాపన జరుగుతోంది తప్ప ఆ ప్యాలెస్ మాత్రం వినియోగంలోకి రావడంలేదు.
ప్యాలెస్ వినియోగంపై అదే తర్జనభర్జన
రెండేళ్లయినా వాడకంలోకి రాని భవనాలు
నిర్ణయం కోసం మంత్రుల కమిటీ నియామకం
ఐదుసార్లు భేటీ అయినా తేలని ఫలితం
నిర్వహణ కోసం టెండర్లు పిలిచిన ఏపీటీడీసీ
ప్యాలెస్‌లో మార్పులు చేయాలన్న సంస్థలు
భవనాల నిర్వహణకు నెలకు 25 లక్షల ఖర్చు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
రుషికొండ ప్యాలెస్‌ను ఏం చేద్దాం..? రెండేళ్లుగా ఉన్నతస్థాయిలో ఇదే ప్రశ్న నడుస్తోంది. కూటమి ప్రభుత్వం వచ్చాక కాలయాపన జరుగుతోంది తప్ప ఆ ప్యాలెస్ మాత్రం వినియోగంలోకి రావడంలేదు. దీనిని ఎలా వినియోగించాలన్న విషయంలో ఇప్పటికీ తర్జనభర్జన పడుతున్నారు. విశాఖపట్నంలోని రుషికొండపై వైసీపీ ప్రభుత్వ హయాంలో రూ.453 కోట్లతో పర్యాటక శాఖ ఆప్యాలెస్‌ను నిర్మించింది. 2024 ఫిబ్రవరి నెలలో దానిని నాటి పర్యాటక శాఖ మంత్రి రోజా ప్రారంభించారు. పైకి మాత్రం పర్యాటకుల కోసమేనని చెప్పినా, అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి కుటుంబంతో కలసి నివాసం ఉండడానికి, సమావేశాలకు అనుగుణంగా దానిని నిర్మించారు. పరిపాలనా రాజధానిలో అనువైన కార్యాలయంగా ఎంపిక చేస్తే జగన్ దానిని ఉపయోగించుకుంటారని నాడు రోజా ప్రకటించారు. దానికి కమిటీని కూడా వేశారు. ఆ తరువాత ఎన్నికలు వచ్చి వైసీపీ ఓటమి చెందడంతో ప్రజాధనంతో నిర్మించిన ఆ ప్యాలెస్‌ను ఉపయోగంలోకి తేవలసిన బాధ్యత కూటమి ప్రభుత్వంపై పడింది. గత ఏడాది ఆగస్టులో ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ రుషికొండ ప్యాలెస్‌ను సందర్శించారు. కొన్నిచోట్ల సీలింగ్ ఊడి పెచ్చులు కిందపడడం, వర్షపు నీరు నిల్వ ఉండిపోవడంతో తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. శీతాకాలంలోగా దానిని వినియోగంలోకి తేవాలని ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. దీనిపై నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం మంత్రులతో కమిటీ వేసింది. నిర్వహణ కోసం ఏపీటీడీసీ కూడా టెండర్లను ఆహ్వానించింది. భవనంతో పాటు అక్కడ ఖాళీగా ఉన్న తొమ్మిది ఎకరాల భూమిని కూడా ఇస్తామని ప్రకటించింది. దాంతో పెద్ద పెద్ద సంస్థలే ముందుకువచ్చాయి. తాజ్ గ్రూపు, విశాఖలో కొండపై బేపార్క్ నిర్వహిస్తున్న ఫెమా గ్రూపు, అట్మాస్పియర్ కోర్ వంటి సంస్థలు బిడ్లు వేశాయి.

సీఆర్‌జెడ్ పరిధిలో ఏడు ఎకరాలు
ప్యాలెస్ ముందు తొమ్మిది ఎకరాలు ఇస్తామని ఏపీటీడీసీ ప్రకటించగా, అందులో ఏడు ఎకరాలు కోస్తా నియంత్రణ జోన్ (సీఆర్‌జెడ్) పరిధిలో ఉందని తేల్చారు. అందులో నిర్మాణాలు చేపట్టడానికి నిబంధనలు అడ్డువస్తాయి. మిగిలిన రెండు ఎకరాలే ఉపయోగించుకోవలసి ఉంది. ఆ భూమి సరిపోదని, ఇంకా కావాలని ఆయా సంస్థలు కోరుతున్నాయి. అదనంగా భూమి ఏమైనా ఇవ్వగలమా? అని ప్రభుత్వం కూడా ఆలోచన చేస్తోంది. దీనిపై మంత్రుల సబ్ కమిటీ ఇప్పటికే ఐదుసార్లు సమావేశమైంది. ఆఖరి సమావేశం ఏప్రిల్ మొదటి వారంలో జరిగింది. కమిటీ నివేదికను క్యాబినెట్‌కు సమర్పిస్తామని, దానిపై సీఎం నిర్ణయం తీసుకుంటారని పర్యాటక మంత్రి కందుల దుర్గేశ్ ఇటీవల విశాఖపట్నం వచ్చినప్పుడు వెల్లడించారు. అయితే భవనంతో పాటు అదనపు భూములు కేటాయిస్తే ప్రభుత్వంపై విమర్శలు వచ్చే పరిస్థితి ఉంది.
మార్పులు చేస్తేనే..
రుషికొండ ప్యాలెస్‌ను పర్యాటక అవసరాలకు యథాతథంగా వినియోగించడం కష్టం. పర్యాటకులకు అనుగుణంగా దానిని నిర్మించలేదు. నివాసం, సమావేశాల కోసమే నిర్మించారు. అందువల్ల తగిన మార్పులు చేస్తేనే పర్యాటక అవసరాలకు అనుకూలంగా ఉంటుంది. ఇదే విషయాన్ని ఆయా సంస్థలు కూడా స్పష్టం చేశాయి. భవనంపై మరో రెండు అంతస్థులు కూడా వేసుకోవలసి ఉంటుందని, అప్పుడే సరైన ఆదాయం వస్తుందని కొన్ని పేర్కొన్నాయి. ఆ మార్పులకు నిధులు ఎవరు సమకూర్చాలనే దానిపై చర్చలు జరిగాయి.
నిర్ణయంపై అనుమానమే..
రుషికొండ ప్యాలెస్‌ను అందుబాటులోకి తెచ్చే విషయంలో ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ చెప్పిన శీతాకాలం సీజన్ పోయి, వేసవి కూడా ముగిసి, మళ్లీ వర్షాకాలం వస్తోంది. ఇప్పుడైనా దీనిపై నిర్ణయం తీసుకుంటారా? లేదా? అనే అనుమానం ప్రజల్లో ఉంది. ఈ భవనం నిర్వహణకు నెలకు రూ. 25 లక్షల వరకు ఖర్చు అవుతోంది. ఇందులో రెండు బ్లాకులను ప్రజలకు ఉపయోగపడేలా అందుబాటులో ఉంచి, మిగిలినవి పెద్ద పెద్ద సంస్థలకు ఇవ్వాలని కమిటీ సిఫారసు చేసినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ప్యాలెస్ పై త్వరగా నిర్ణయం తీసుకోవలసి ఉంది.