ఆదాయ వనరుగా రుషికొండ ప్యాలెస్
ABN , Publish Date - Apr 08 , 2026 | 04:13 AM
విశాఖలోని రుషికొండ ప్యాలె్‌సను ప్రజల సందర్శనకు అనుమతించడంతో పాటు ప్రభుత్వానికి ఆదాయ వనరుగా మార్చనున్నట్లు పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ వెల్లడించారు.
త్వరలో సీఎం చంద్రబాబుకు నివేదిక
పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్
అమరావతి, ఏప్రిల్ 7(ఆంధ్రజ్యోతి): విశాఖలోని రుషికొండ ప్యాలె్‌సను ప్రజల సందర్శనకు అనుమతించడంతో పాటు ప్రభుత్వానికి ఆదాయ వనరుగా మార్చనున్నట్లు పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ వెల్లడించారు. రుషికొండ భవనాల సద్వినియోగంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం 5వ సమావేశం మంగళవారం ఉదయం సచివాలయంలో జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు పయ్యావుల కేశవ్, డోలా బాలవీరాంజనేయస్వామి వర్చువల్‌గా పాల్గొన్నారు. మంత్రి దుర్గేశ్ మాట్లాడుతూ రుషికొండ భవనాలను కేవలం ప్రభుత్వ ఆస్తిగా ఉంచకుండా ప్రజల సందర్శనకు అనుమతించి తద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూరే మార్గాలను అన్వేషిస్తున్నట్లు తెలిపారు. సీఆర్‌జెడ్ నిబంధనల ప్రకారం హిల్‌టా్‌పపై 2,400 చ.మీ, కొండ కింద మరో 2,400 చ.మీ కలిపి మొత్తం 4,800 చదరపు మీటర్ల భూమి అందుబాటులో ఉందని కమిటీ ప్రాథమికంగా గుర్తించిందని చెప్పారు. దీని ఆధారంగా భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తామని పేర్కొన్నారు. ఈ భవనల నిర్వహణకు తాజ్, ఎట్మాస్ఫియర్ కోర్, లీలా, ఫెమా వంటి ప్రఖ్యాత అంతర్జాతీయ హోటల్ గ్రూపులు ఆసక్తి కనబరిచాయని తెలిపారు. గత ప్రభుత్వ ఆనాలోచిత నిర్ణయాలతో నిర్మించిన ఈ ప్యాలెస్ నిర్వహణ, విద్యుత్ చార్జీల కోసమే నెలకు రూ.25 లక్షల ప్రజాధనం ఖర్చవుతోందని మంత్రి పేర్కొన్నారు. ఇప్పటి వరకూ జరిగిన భేటీల సారాంశంతో కూడిన తుది నివేదికను త్వరలోనే సీఎం చంద్రబాబుకు అందజేస్తాని మంత్రి తెలిపారు. సీఎం ఆదేశాల మేరకు ఈ అంశాన్ని క్యాబినెట్ ముందు ఉంచి తుది నిర్ణయం తీసుకోనున్నట్లు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో పర్యాటక శాఖ స్పెషల్ సీఎస్ అజయ్ జైన్, ఈడీ పద్మావతి, శేషగిరి పాల్గొన్నారు.