’రిషికొండ భవనాలు ఎవరికీ కేటాయించలేదు
ABN , Publish Date - Jul 09 , 2026 | 04:39 AM
రిషికొండపై అనుమతులు లేకుండా చేసిన నిర్మాణాలు, ఖాళీ స్థలాలను థర్డ్ పార్టీలకు లీజుకి ఇవ్వకుండా పర్యాటకశాఖ అధికారులను ఆదేశించాలని కోరుతూ..
పర్యాటకంగా వినియోగానికి ప్రతిపాదనలు కోరాం
అమరావతి/విశాఖపట్నం, జూలై 8(ఆంధ్రజ్యోతి): రిషికొండపై అనుమతులు లేకుండా చేసిన నిర్మాణాలు, ఖాళీ స్థలాలను థర్డ్ పార్టీలకు లీజుకి ఇవ్వకుండా పర్యాటకశాఖ అధికారులను ఆదేశించాలని కోరుతూ జనసేన కార్పోరేటర్ పీవీఎన్‌ఎన్ మూర్తి యాదవ్ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అంతకుముందు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) ఎస్.ప్రణతి వాదనలు వినిపించారు. రిషికొండపై నిర్మించిన భవనాలను పర్యాటకపరంగా వినియోగించేందుకు ఆసక్తిగల సంస్థల నుంచి ప్రతిపాదనలు ఆహ్వానిస్తూ ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ ఈ ఏడాది జూన్ 24న నోటీసు ఇచ్చిందని ఎస్‌జీపీ న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. ప్రతిపాదనలు వచ్చిన తరువాత మంత్రి ఉపసంఘం భవనాల వినియోగంపై నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఇప్పటి వరకు భవనాలను ఏ సంస్థకూ కేటాయించలేదని ధర్మాసనానికి నివేదించారు. ఈ వివరాలను నమోదు చేసిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసాగిల్, జస్టిస్ చల్లా గుణరంజన్‌తో కూడిన ధర్మాసనం పిటిషనర్ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో విశాఖలోని రిషికొండపై పర్యావరణ అనుమతులు లేకుండా, సీఆర్‌జెడ్ నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు జరుపుతున్నారంటూ విశాఖ తూర్పు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, విశాఖ నగరవాసి జనసేన నాయకుడు పీవీఎన్‌ఎన్ మూర్తి యాదవ్ వేర్వేరుగా 2021లో హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యలు దాఖలు చేసిన విషయం తెలిసిందే. రిషికొండ పై ఉన్న భవనాలు, ఖాళీ స్థలాలను థర్డ్ పార్టీలకు లీజుకివ్వకుండా ఏపీటీడీసీని అడ్డుకోవాలని, ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్ర్‌స్ట(ఈవోఐ)పేరుతో పర్యాటక సంస్థ ఈ ఏడాది జూన్ 24న ఇచ్చిన నోటీసును సస్పెండ్ చేయాలని కోరుతూ మూర్తి యాదవ్ అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లు బుధవారం మరోసారి విచారణకు రాగా... మూర్తి యాదవ్ తరఫున సీనియర్ న్యాయవాది కేఎస్ మూర్తి వాదనలు వినిపించారు. కేంద్ర ప్రభుత్వం తరఫున అడిషనల్ సొలిసిటర్ జనరల్ ధనంజయ వాదనలు వినిపిస్తూ... పర్యావరణ అనుమతులకు సంబంధించి ఎంవోఈఎఫ్ వద్ద ఎలాంటి ఫైలూ పెండింగ్‌లో లేదన్నారు.