ఆదాయం కొంతే!
ABN , Publish Date - Aug 24 , 2026 | 03:25 AM
దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రజల ఆర్థిక పరిస్థితి మందగమనంలో సాగుతోంది. ఆదాయం తగ్గడం, పొదుపులు క్షీణించడం, మూలధన పెట్టుబడులు పడిపోవడం, ఉపాధిపై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లడం వంటి అంశాలు గ్రామాల్లో కనిపిస్తున్నాయి.
మందగమనంలో దేశ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ
సగం మంది ఆదాయార్జనలో స్తబ్ధత
ఆదాయం ఏ మాత్రం పెరగలేదన్న 52 శాతం గ్రామీణ కుటుంబాలు
అనధికార అప్పులతో 23 శాతం కుటుంబాల అవస్థలు
మెరుగవుతున్న మౌలిక సదుపాయాలు
నాబార్డ్ సర్వేలో స్పష్టమైన గ్రామీణ భారత్ ముఖచిత్రం
అమరావతి, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రజల ఆర్థిక పరిస్థితి మందగమనంలో సాగుతోంది. ఆదాయం తగ్గడం, పొదుపులు క్షీణించడం, మూలధన పెట్టుబడులు పడిపోవడం, ఉపాధిపై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లడం వంటి అంశాలు గ్రామాల్లో కనిపిస్తున్నాయి. నాబార్డ్ తాజాగా విడుదల చేసిన రూరల్ ఎకనమిక్ కండిషన్స్ అండ్ సెంటిమెంట్స్ సర్వే(ఆర్‌ఈసీఎ్‌సఎస్) నివేదిక గ్రామీణ భారత ఆర్థిక ముఖ చిత్రాన్ని విశ్లేషించింది. పల్లె ప్రాంతాలు ఎలాంటి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాయో స్పష్టంగా వివరించింది. అయితే గ్రామీణ మౌలిక సదుపాయాలపై ప్రజల్లో సానుకూల అభిప్రాయం కొనసాగడం కొంత ఊరటనిచ్చే అంశంగా పేర్కొంది. గతేడాదితో పోలిస్తే తమ ఆదాయంలో ఏమాత్రం మార్పులేకుండా ఉందని 52.6 శాతం కుటుంబాలు వెల్లడించాయి. ఇక తమ కుటుంబ ఆదాయం పెరిగిందని చెప్పినవి మాత్రం 27.7శాతం ఉన్నాయి. అయితే ఇది 2024లో నాబార్డ్ ఈ సర్వే మొదలు పెట్టినప్పటి నుంచి అతి తక్కువ శాతం కావడం విశేషం. 19.8 శాతం కుటుంబాలు తమ ఆదాయం తగ్గిందని స్పష్టం చేశాయి. దీంతో గ్రామీణ కుటుంబాల కొనుగోలు శక్తి తగ్గుతోందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. గ్రామీణ ప్రజల వినియోగ వ్యయం స్వల్పంగా మందగించింది. పొదుపు పెరిగిందని చెప్పిన కుటుంబాల శాతం 17.8 మాత్రమే. సర్వే చరిత్రలో ఇదే అత్యల్పం.
గత సర్వేతో పోలిస్తే కొత్తగా అప్పులు పెరిగాయని తెలిపిన కుటుంబాలు 4 శాతం తగ్గి 28.7కి చేరాయి. ఇదే సమయంలో వ్యవసాయం, వ్యాపారం, పశుపోషణ వంటి రంగాల్లో మూలధన పెట్టుబడులు పెట్టలేకపోతున్న కుటుంబాల శాతం పెరిగింది. ఇది భవిష్యత్ ఉత్పాదకతపై ప్రభావం చూపే అవకాశం ఉందని నివేదిక హెచ్చరించింది. ఇక కుటుంబ ఆదాయంలో ప్రభుత్వ సబ్సిడీలు, నగదు బదిలీల వాటా 8.11 శాతంగా నమోదైంది. జనవరి-2025లో నమోదైన 10.28 శాతం గరిష్ఠ స్థాయి నుంచి ఇది తగ్గింది. ఎలాంటి ప్రభుత్వ బదిలీలు అందని కుటుంబాల శాతం 16.2కు పెరగడం గమనార్హం. ఇది ఇతర ఆదాయ వనరులపై ఆధారపడే పరిస్థితి పెరుగుతున్నట్లు సూచిస్తోంది. రాబోయే మూడు నెలల్లో ఆదాయం పెరుగుతుందని భావించిన కుటుంబాల శాతం గత సర్వేలతో పోలిస్తే కనిష్ఠానికి చేరింది. ఉద్యోగ అవకాశాలపైనా ఇదే ధోరణి కనిపించింది. వర్షాభావం, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు, వ్యవసాయ అనిశ్చితి కారణంగా ప్రజల్లో భవిష్యత్తుపై ఆశావాదం తగ్గిందని నివేదిక పేర్కొంది.
నిత్యావసరాలకే ఎక్కువ ఖర్చు
గ్రామాల్లో రహదారులు, విద్య, తాగునీటి వంటి మౌలిక వసతులు మెరుగుపడ్డాయని 76.8 శాతం కుటుంబాలు అభిప్రాయపడ్డాయి. గ్రామీణులు భావిస్తున్న ప్రస్తుత ద్రవోల్బణం 4.5 శాతానికి పెరిగింది. రాబోయే ఏడాదిలో ద్రవ్యోల్బణం 5.8 శాతానికి చేరవచ్చని సర్వేలో పాల్గొన్న కుటుంబాలు అంచనా వేశాయి. అయినప్పటికీ అధిక శాతం కుటుంబాలు ద్రవ్యోల్బణం 5 శాతం లోపే ఉంటుందని భావిస్తున్నాయి. గ్రామీణ కుటుంబాల మొత్తం వినియోగ వ్యయంలో సగటున 54.6 శాతం ఆహారానికే వెచ్చిస్తున్నారు. ఆహారంపై ఖర్చు వాటాలో పెద్ద మార్పులు కనిపించకపోయినా, అధిక భాగం కుటుంబాలు తమ ఆదాయంలో పెద్ద మొత్తాన్ని నిత్యావసరాలకే వినియోగిస్తున్నాయి. సర్వే ప్రకారం 51 శాతం కుటుంబాలు బ్యాంకుల వంటి అధికారిక వనరుల నుంచే రుణాలు తీసుకుంటున్నప్పటికీ, 23.6 శాతం కుటుంబాలు పూర్తిగా అనధికార వనరులపై ఆధారపడుతున్నాయి. వారిలో ఎక్కువ మంది స్నేహితులు, బంధువుల నుంచి అప్పులు తీసుకుంటున్నారు. అనధికార రుణాలపై సగటు వడ్డీ 17.77 శాతంగా నమోదైంది.