Share News

జ్ఞానేశ్వరి కేసులో ‘బొమ్మల’ మిస్టరీకి తెర

ABN , Publish Date - Jun 17 , 2026 | 04:40 AM

కాకినాడ జిల్లా తుని మండలం సీహెచ్‌ అగ్రహారంలో అదృశ్యమైన చిన్నా రి జ్ఞానేశ్వరి కేసులో రబ్బరు బొమ్మల ఏర్పాటు చర్చకు దారితీసింది.

జ్ఞానేశ్వరి కేసులో ‘బొమ్మల’ మిస్టరీకి తెర

  • పోలీసు దర్యాప్తులో భాగంగానే ఏర్పాటు: డీఎస్పీ

తుని రూరల్‌, జూన్‌ 16(ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా తుని మండలం సీహెచ్‌ అగ్రహారంలో అదృశ్యమైన చిన్నా రి జ్ఞానేశ్వరి కేసులో రబ్బరు బొమ్మల ఏర్పాటు చర్చకు దారితీసింది. పాప అదృశ్యమైన ప్రాంతానికి సమీపంలో తీగలకు వేలాడదీసిన రబ్బరు బొమ్మలు ప్రత్యక్షం కావడం స్థానికంగా సంచలనం రేపింది. దీంతో పెద్దాపురం డీఎస్పీ ఏబీజీ తిలక్‌ మంగళవారం అగ్రహారం చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తీగలకు వేలాడదీసిన రబ్బరు బొమ్మలు పోలీసుల దర్యాప్తులో భాగంగా ఏర్పాటు చేసినవేనని స్పష్టం చేశారు. చిన్నారి అదృశ్యమైన ప్రాంతానికి సమీపంలో అడవి జంతువుల కదలికలు ఉన్నాయా లేదా అన్న కోణంలో విచారణ కొనసాగుతోందన్నారు. ఈనేపథ్యంలో చిన్నారి ఆకారాన్ని పోలిన రబ్బరు బొమ్మల్లో మాంసం ముద్దలను అమర్చి చెట్లకు తోట రక్షణ కంచెలకు వేలాడదీశామని వివరించారు. బొమ్మల వైపు ఏవైనా మృగాలు లేదా అడవి జంతువులు ఆకర్షితమైతే వాటి కదలికలను గుర్తించేందుకు ప్రత్యేకంగా కెమెరాలు, నైట్‌ విజన్‌ కెమెరాలు, థర్మల్‌ డ్రోన్లు, ఇతర సాంకేతిక పరికరాలను వినియోగిస్తున్నామని వెల్లడించారు. చేతబడులు, క్షుద్రపూజల కథనాల్లో ఎలాంటి నిజం లేదని డీఎస్పీ స్పష్టం చేశారు. ప్రజ లు కట్టు కథలను నమ్మవద్దని, దర్యాప్తు పూర్తిగా శాస్త్రీయ, సాంకేతిక ఆధారాలపై కొనసాగుతోందని తెలిపారు.

Updated Date - Jun 17 , 2026 | 04:41 AM