ఆర్టీఈ రెండో విడతలో 10,453 సీట్లు కేటాయింపు
ABN , Publish Date - May 06 , 2026 | 06:05 AM
విద్యాహక్కు చట్టం రెండో విడత లాటరీలో 10,453 మంది విద్యార్థులకు అడ్మిషన్లు లభించాయి.
విద్యార్థులను చేర్చుకోకపోతే చర్యలు: సమగ్రశిక్ష
అమరావతి, మే 5(ఆంధ్రజ్యోతి): విద్యాహక్కు చట్టం రెండో విడత లాటరీలో 10,453 మంది విద్యార్థులకు అడ్మిషన్లు లభించాయి. దీనిపై సమగ్రశిక్ష స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ బి.శ్రీనివాసరావు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఆర్టీఈ అడ్మిషన్లకు మొత్తం 54,647 మంది దరఖాస్తు చేసుకోగా, 54,016 మందిని అర్హులుగా గుర్తించారు. మొదటి విడత లాటరీలో ఒక కిలోమీటరు పరిధిలో 30,075 మందికి అడ్మిషన్లు లభించాయి. 1 నుంచి 5 కిలోమీటర్ల పరిధిలో పాఠశాలలకు రెండో విడతలో ఇప్పుడు నిర్వహించిన లాటరీలో 10,453 మందికి అవకాశం లభించింది. తల్లిదండ్రుల ఫోన్లకు అడ్మిషన్ల సమాచారం పంపారు. విద్యార్థి, తల్లి లేదా తండ్రి ఆధార్ కార్డులు, ఆదాయ, కుల, పుట్టిన రోజు ధృవీకరణ పత్రాలు, రేషన్ కార్డు వివరాలతో ఈనెల 6 నుంచి 17లోపు సంబంధిత పాఠశాలల్లో ప్రవేశాలను నిర్ధారించుకోవాలని సమగ్రశిక్ష సూచించింది. ఇతర వివరాలకు 18004258599 టోల్‌ఫ్రీ నంబరును ఏర్పాటు చేసింది.