Transport Department: ‘ప్రైవేటు’ బాదుడుపై ఆర్టీఏ కొరడా
ABN , Publish Date - Jan 14 , 2026 | 05:22 AM
సంక్రాంతి పండగకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల నుంచి టికెట్ చార్జీల రూపంలో వేలాది రూపాయలు వసూలు చేసిన ప్రైవేటు ట్రావెల్స్‌పై రవాణా శాఖ కొరడా ఝుళిపించింది.
సంక్రాంతి స్పెషల్ డ్రైవ్‌లో పలు ప్రైవేటు బస్సులపై చర్యలు
అదనపు చార్జీల వసూలుపై 209 కేసులు, రూ.21 లక్షల ఫైన్
అమరావతి, జనవరి 13(ఆంధ్రజ్యోతి): సంక్రాంతి పండగకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల నుంచి టికెట్ చార్జీల రూపంలో వేలాది రూపాయలు వసూలు చేసిన ప్రైవేటు ట్రావెల్స్‌పై రవాణా శాఖ కొరడా ఝుళిపించింది. పొరుగు రాష్ట్రాల నుంచి కోస్తా, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు వచ్చే ప్రయాణికుల రద్దీని గమనించి.. ప్రైవేటు బస్సుల యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా చార్జీలను పెంచేశాయి. ఇవి.. సాధారణ రోజుల్లో విమాన చార్జీలకు దాదాపు సమానంగా ఉన్నాయంటూ రవాణా శాఖ అధికారులకు ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యం లో రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఆర్టీఏ అధికారులతో రవాణా శాఖ కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా సమావేశమై, ప్రైవేటు ట్రావెల్స్ అదనపు బాదుడుపై చర్యలకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మూడు రోజుల పాటు తనిఖీలు చేపట్టిన ఎంవీఐలు.. అదనపు చార్జీలకు సంబంధించి 209 బస్సులపై కేసులు నమోదు చేసి, రూ.21.04 లక్షల జరిమానా విధించారు. మరోవైపు పన్ను, పర్మిట్ తదితర నిబంధనల ఉల్లంఘనపై 678 బస్సులపై కేసులు పెట్టి, రూ.36.86 లక్షల జరిమానా వసూలు చేశారు.
అదనపు చార్జీలపై పశ్చిమగోదావరి జిల్లాలో అత్యధికంగా 54 కేసులు నమోదు చేసి, రూ.5.40 లక్షల ఫైన్ విధించినట్లు కమిషనర్ ఎం.కే.సిన్హా తెలిపారు. కోనసీమ జిల్లాలో 39 కేసుల్లో రూ.3.90 లక్షలు, చిత్తూరులో 30 కేసుల్లో రూ.3 లక్షలు జరిమానా వసూలు చేసినట్టు చెప్పారు. ఇతర ఉల్లంఘనలపై అత్యధికంగా నెల్లూరు జిల్లాలో 61 కేసులు పెట్టి, రూ.9.76 లక్షల ఫైన్ వేశామని, ఎన్టీఆర్ జిల్లాలో 92 కేసులు, పల్నాడులో 39 కేసులు నమోదు చేసి జరిమానా విధించినట్లు వెల్లడించారు. ప్రభుత్వం గరిష్ఠంగా అనుమతించిన మేరకు 50 శాతం అదనంగా చార్జీలు తీసుకున్న బస్సులు మినహా.. అంతకు మించి వసూలు చేసిన వాటిపై చర్యలు తీసుకున్నట్లు వివరించారు. తిరుగు ప్రయాణంలో కూడా ప్రయాణికుల నుంచి అధిక చార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పండగలైనా, సాధారణ రోజులైనా నిబంధనలు పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. ఉల్లంఘించే ట్రావెల్స్ వివరాలను ఆధారాలతో సహా 9281607001 నెంబర్‌కు తెలియ జేయాలని సిన్హా సూచించారు.