Share News

10 నెలల్లో రూ.8.50 కోట్లు

ABN , Publish Date - Feb 26 , 2026 | 12:51 AM

యనమలకుదురులోని షెల్టర్‌ నుంచి నడిచిన మ్యూల్‌ కథలో ఎట్టకేలకు లెక్క తేలింది. బాధితులు ఖాతాల్లో మొత్తం రూ.8.50 కోట్లను జమ చేశారు. ఈ మొత్తాన్ని చెన్నైలోని వెంకట సుబ్రమణికి పంపారు. మ్యూల్‌ ఖాతాలను తెరిచిన కేసులో రాయపాటి రవికుమార్‌, అతడి అన్నయ్య స్టీవెన్‌, బాజీ, ఇండియన్‌ బ్యాంక్‌ అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగి దుర్గాప్రసాద్‌ పోలీస్‌ కస్టడీ బుధవారంతో ముగిసింది.

10 నెలల్లో రూ.8.50 కోట్లు

తేలిన ‘మ్యూల్‌’ లెక్క

ముగిసిన నిందితుల కస్టడీ

(ఆంధ్రజ్యోతి - విజయవాడ):

యనమలకుదురులోని షెల్టర్‌ నుంచి నడిచిన మ్యూల్‌ కథలో ఎట్టకేలకు లెక్క తేలింది. బాధితులు ఖాతాల్లో మొత్తం రూ.8.50 కోట్లను జమ చేశారు. ఈ మొత్తాన్ని చెన్నైలోని వెంకట సుబ్రమణికి పంపారు. మ్యూల్‌ ఖాతాలను తెరిచిన కేసులో రాయపాటి రవికుమార్‌, అతడి అన్నయ్య స్టీవెన్‌, బాజీ, ఇండియన్‌ బ్యాంక్‌ అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగి దుర్గాప్రసాద్‌ పోలీస్‌ కస్టడీ బుధవారంతో ముగిసింది. మనుగడలో ఉన్న 13 బ్యాంక్‌ ఖాతాల నుంచి ఈ మొత్తాన్ని చెన్నైకు పంపారు. ఈ ఖాతాలు, వాటిలో జమయ్యే డబ్బులు, ఓటీపీల కోసం రెండు ఫోన్లతో కమ్యూనికేషన్‌ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. ఈ రెండు ఫోన్లను రవికుమార్‌ నిర్వహించేవాడు. వాటిని సమకూర్చింది మాత్రం సుబ్రమణి అని నిర్ధారించారు. మొదటి ఫోన్‌ను ఈ గ్యాంగ్‌ ఎక్కువగా ఉపయోగించినట్టు పోలీసులు గుర్తించారు. రెండో ఫోన్‌ను మాత్రం బ్యాంక్‌ లావాదేవీల కోసం ఉపయోగించారు.

రవికుమార్‌కు టచ్‌లో ఆకాష్‌

మ్యూల్‌ కేసులో తిరువట్టువయూర్‌కు చెందిన వెంకట సుబ్రమణితో పాటు ఆకాష్‌ అనే వ్యక్తి ఉన్నట్టు పోలీసులు గుర్తించిన విషయం తెలిసిందే. అతడు పలుమార్లు ప్రధాన నిందితుడు రవికుమార్‌కు టచ్‌లోకి వచ్చినట్టు తెలుస్తోంది. ఆకాష్‌ సైబర్‌ నేరగాళ్లలో ఒకడన్న అనుమానం వ్యక్తమవుతోంది. సాధారణంగా సైబర్‌ నేరగాళ్లు వేసే వలలో ఇరుక్కున్న బాధితులు డబ్బులు వారు చెప్పిన ఖాతాల్లో జమ చేస్తారు. తర్వాత జమ చేశామన్న విషయాన్ని వారికి స్ర్కీన్‌షాట్‌ పంపి తెలియజేస్తారు. అనంతరం నేరగాళ్లు ఇదే విషయాన్ని తమ కింద మ్యూల్‌ ఖాతాలు నిర్వహించేవారికి చెప్తారు. ఈ కేసులో ఇదే జరిగిందన్న అనుమానం వ్యక్తమవుతుంది. ఆకాష్‌ పలుమార్లు రవికుమార్‌కు ఫోన్‌ చేసి ఖాతాలో డబ్బులు జమయ్యాయి చూడమని చెప్పేవాడు. ఈ మాటలను తమిళంలో చేరవేసేవాడు. రవికుమార్‌కు తమిళంపై పూర్తి పట్టు ఉంది. ఆ ఖాతాను పరిశీలించి డబ్బులు జమ అయ్యాయా లేదా అన్న విషయాన్ని తిరిగి ఆకాష్‌కు చెప్పేవాడు. ఆకాశ్‌ ఈ నేరగాళ్లలో ఒకడా లేక అతడి పైన ఇంకా గ్యాంగ్‌ ఉందా అన్నది అతడు చిక్కితేనే తేలుతుంది.

Updated Date - Feb 26 , 2026 | 12:51 AM