Share News

బ్యాంకు ఖాతా నుంచి రూ.8లక్షలు మాయం

ABN , Publish Date - Jan 14 , 2026 | 11:19 PM

బ్యాంకులో భద్రంగా దాచుకున్న సొమ్ము మాయమవడంతో ఓ ఖాతాదారుడు లబోదిబోమంటున్నాడు.

   బ్యాంకు ఖాతా నుంచి రూ.8లక్షలు మాయం

విచారణ జరుపుతామన్న డీఎస్పీ

ఆదోని, జనవరి 14 (ఆంధ్రజ్యోతి): బ్యాంకులో భద్రంగా దాచుకున్న సొమ్ము మాయమవడంతో ఓ ఖాతాదారుడు లబోదిబోమంటున్నాడు. తన ఖాతా నుంచి రూ.8లక్షలు మాయం కావడానికి బ్యాంకు అధికారుల నిర్లక్ష్యమే కారణమని బాధితుడు తిక్కస్వామి ఆరోపిస్తున్నాడు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదోని మండలం బైచిగేరికి చెందిన తిక్కస్వామి తన తల్లి పొలం అమ్మగా వచ్చిన రూ.8లక్షలను ఆదోనిలోని కరూర్‌ వైశ్యా బ్యాంకులో గత ఏడాది ఆగస్టు 20న డిపాజిట్‌ చేశారు. ఆగస్టు 28న తన పాసుబుక్‌ ప్రింట్‌ తీయించుకోగా అందులో కేవలం రూ.8వేలు మాత్రమే ఉన్నాయని బ్యాంకు అధికారులు చెప్పగా షాక్‌కు గురయ్యాడు. ఇటీవల అవసరాల నిమిత్తం మళ్లీ బ్యాంకుకు వెళ్లి విచారించగా ఖాతాలో డబ్బులు లేవని బ్యాంకు అధికారులు స్పష్టం చేయడంతో బాధితుడు ఆందోళనకు గురయ్యాడు. తనకు ఎటువంటి ఓటీపీ రాలేదని, ఫోన్‌పే వంటి ఆన్‌లైన్‌ సేవలు కూడా వాడడంలేదని, కేవలం బ్యాంకు అధికారుల ఫ్రాడ్‌ వల్లే తన డబ్బు పోయిందని ఆయన ఆరోపిస్తున్నారు. దీనిపై న్యాయం చేయాలని కోరుతూ బాధితుడు తిక్కస్వామి బుధవారం ఆదోని డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. విచారణ జరిపి న్యాయం చేస్తామని ఆమె అన్నారు.

Updated Date - Jan 14 , 2026 | 11:19 PM