రూ.7 కోట్లు హాంఫట్
ABN , Publish Date - Feb 21 , 2026 | 01:04 AM
ఎట్టకేలకు గోకవరం పీఏసీఎస్‌లో అవినీతి లెక్క తేలింది. కోటి కాదు రెండు కోట్లు కాదు ఏకంగా ఏడు కోట్ల రూపాయలను పక్కదారి పట్టించారు. వీటిలో సెక్రటరీ రూ.5 కోట్లు దుర్వినియోగం చేస్తే, సొసైటీ అధ్యక్షుడు రూ.1.20 కోట్లు వాడేసుకున్నాడు. మిగిలిన నగదు దుర్వినియోగంలో డైరెక్టర్ల, ఇతర అధికారుల పాత్ర ఉంది. 51 విచారణ చేపట్టిన అధికారులు ఈ అక్రమాలను ఆధారాలతో సహా నిగ్గుతేల్చారు. కేడీసీసీబీ సీఈవోకు దీనిపై సమగ్ర నివేదిక సమర్పించారు.
- గోకవరం పీఏసీఎస్‌లో తేలిన అవినీతి లెక్క
- రూ.5 కోట్లు పక్కదారి పట్టించిన సెక్రటరీ
- రూ.1.20 కోట్లు వాడుకున్న సొసైటీ అధ్యక్షుడు
- 51 విచారణలో అక్రమాల నిగ్గుతేల్చిన అధికారులు
- నిందితుల ఆస్తుల అటాచ్‌మెంట్‌కు సిఫార్సు
- 24న పీఏసీఎస్ సర్వసభ్య సమావేశం
ఎట్టకేలకు గోకవరం పీఏసీఎస్‌లో అవినీతి లెక్క తేలింది. కోటి కాదు రెండు కోట్లు కాదు ఏకంగా ఏడు కోట్ల రూపాయలను పక్కదారి పట్టించారు. వీటిలో సెక్రటరీ రూ.5 కోట్లు దుర్వినియోగం చేస్తే, సొసైటీ అధ్యక్షుడు రూ.1.20 కోట్లు వాడేసుకున్నాడు. మిగిలిన నగదు దుర్వినియోగంలో డైరెక్టర్ల, ఇతర అధికారుల పాత్ర ఉంది. 51 విచారణ చేపట్టిన అధికారులు ఈ అక్రమాలను ఆధారాలతో సహా నిగ్గుతేల్చారు. కేడీసీసీబీ సీఈవోకు దీనిపై సమగ్ర నివేదిక సమర్పించారు.
ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం :
మచిలీపట్నం మండలం గోకవరం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (పీఏసీఎస్)లో రూ.7 కోట్ల వరకు నిధులు పక్కదారి పట్టాయి. అక్రమాలపై సహకారశాఖ మచిలీపట్నం డివిజనల్ కో-ఆపరేటివ్ అధికారి 51 విచారణ చేపట్టి నిజాలు నిగ్గుతేల్చారు. నిధుల దుర్వినియోగం 41 అంశాలలో జరిగినట్లుగా నిర్ధారించారు. నిధులు పక్కదారి పట్టిన తీరును వివరిస్తూ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (కేడీసీసీబీ) సీఈవోకు నివేదికను ఇచ్చారు. ఈ నివేదికపై గోకవరం పీఏసీఎస్‌లో సర్వసభ్య సమావేశం నిర్వహించాలని ఈ నెల 2వ తేదీన కేడీసీసీబీ సీఈవో ప్రస్తుతం ఉన్న పీఏసీఎస్ పర్సన్ ఇన్‌చార్జికి లేఖ రాశారు. దీంతో ఈ నెల 24వ తేదీన పీఏసీఎస్ సర్వసభ్య సమావేశం నిర్వహించి, అక్రమాలను సభ్యులకు వివరించి, తదుపరి చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధమైంది.
పీఏసీఎస్ సీఈవో చేతివాటం
గోకవరం పీఏసీఎస్ సీఈవోగా పనిచేసి, ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్న మట్టా భాస్కరబాబు రూ.5కోట్లకుపైగా నగదును దుర్వినియోగం చేసినట్టు సహకారశాఖ అధికారులు తమ విచారణలో తేల్చారు. పీఏసీఎస్ అధ్యక్షుడిగా పనిచేసిన పెదవెంకయ్య రూ.1.20 కోట్ల నిధులను వాడుకున్నట్టు విచారణ అధికారులు ఇచ్చిన నివేదికలో స్పష్టం చేశారు. ఈ ఇద్దరితో పాటు పీఏసీఎస్‌లో గతంలో డైరెక్టర్లుగా పనిచేసిన ఇద్దరితోపాటు, ఇటీవల కాలంలో పీఏసీఎస్ ఇన్‌చార్జి సీఈవో కూడా అక్రమాలకు తనవంతుగా సహకరించినట్లుగా అధికారుల విచారణలో తేటతెల్లమైంది. వీరికి కేడీసీసీబీ మచిలీపట్నం బ్రాంచ్‌లోని కొందరు అధికారులు తమవంతుగా సహకారం అందించినట్లుగా విచారణ అధికారులు గుర్తించారు.
మోసం చేసింది ఇలా..
గోకవరం పీఏసీఎస్‌లో 2022-23 ఆర్థిక సంవత్సరంలో రైతులకు రూ.11 కోట్లకుపైగా పంట రుణాలు, లాంగ్‌టర్మ్ రుణాలు ఇచ్చారు. రైతులు సకాలంలో పంట రుణాలను చెల్లించారు. కానీ పీఏసీఎస్ సీఈవో కేవలం రూ.9 లక్షలు మాత్రమే రుణాల రికవరీ అయినట్లుగా చూపాడు. రైతులు చెల్లించిన రుణాల మొత్తాలను తన సొంత ఖాతాలకు మళ్లించుకున్నాడు. పీఏసీఎస్‌లో తాను సొంతంగా ముద్రించుకున్న రసీదు బుక్‌లో రైతులు రుణాలు చెల్లించినట్లుగా చూపి, క్యాష్‌బుక్, ఇతరత్రా రికార్డులలో రైతులు రుణాలు చెల్లించనట్లుగానే చూపినట్లు అధికారుల విచారణలో వెల్లడైంది. గోకవరం పీఏసీఎస్‌లో సభ్యులుగా ఉండి మరణించిన రైతుల పేరున కూడా పంట రుణాలు మంజూరు చేసినట్లుగాను విచారణ అధికారులు నిర్థారించారు. భూములకు సంబంధించిన పత్రాలు, ఇతరత్రాలు సక్రమంగా లేకున్నా పంట రుణాలు, లాంగ్‌టర్మ్ రుణాలు ఇచ్చి, వాటిని వసూలు చేయకుండా పీఏసీఎస్ సీఈవో జాప్యం చేశారనే అంశంపైనా పలు ఆధారాలను సేకరించారు. ఈ తరహా రుణాలకు రైతు నేస్తం వంటి పథకాల ద్వారా వచ్చిన నగదును కూడా తీసుకున్నట్లు అధికారుల విచారణలో వెల్లడైంది. రైతులు రుణాలు చెల్లించిన సమయంలో రైతులకు మాత్రం నకిలీ రసీదులు ఇచ్చాడు. రైతులు చెల్లించిన రుణాలకు సంబంధించిన వివరాలను పీఏసీఎస్‌లో రోజువారీ నగదు నిల్వలలో చూపలేదని అదికారుల విచారణలో తేలింది. భూమి పత్రాలు సక్రమంగా లేకున్నా రైతులు సమర్పించిన డిక్లరేషన్ బాండ్‌లను ఆధారంగా చేసుకుని సంబంధిత నగదును చెల్లించినట్లుగా, ఈ వివరాలను పీఏసీఎస్‌లో, కేడీసీసీబీ బ్రాంచ్‌లో చూపలేదని అధికారులు గుర్తించారు. భూమి పత్రాలు సక్రమంగా లేకున్నా గతంలో రైతులు ఇచ్చిన డిక్లరేషన్ పత్రాలను చూపి సీఈవో రైతుల పేరున పంట రుణాలు మంజూరు చేసినట్లుగాను నిర్థారణ అయ్యింది. రుణాలు చెల్లించని కొందరు రైతులకు నోడ్యూస్ సర్టిఫికెట్‌లను జారీ చేసినట్లు అధికారులు తమ విచారణలో గుర్తించారు. సీఈవో కొంత నగదును తన సొంత ఖాతాకు, పోన్‌పే ద్వారా తన కుమారుడి ఖాతాలో నగదు జమ చేయించుకున్నట్లు అధికారుల విచారణలో వెల్లడైంది.
గోడౌన్ ప్రారంభోత్సవానికి రూ.6 లక్షల ఖర్చు
గోకవరం పీఏసీఎస్ పరిధిలోని గోడౌన్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రూ.6 లక్షలు ఖర్చు చేసినట్లుగా లెక్కల్లో చూపారు. పెద్ద మొత్తంలో నగదును పక్కదారి పట్టించిన గోకవరం పీఏసీఎస్ సీఈవో, అధ్యక్షుడు, డైరెక్టర్‌లు, వారికి సహకరించిన మచిలీపట్నం కేడీసీసీబీ బ్రాంచ్ అధికారులపైనా చర్యలు తీసుకోవాలని విచారణ అధికారులు తమ నివేదికలో పేర్కొన్నారు. నగదు దుర్వినియోగమైన నాటి నుంచి అసలు నగదుతో పాటు, 18శాతం వడ్డీతో కలిపి నగదు వసూలు చేయాలని కూడా విచారణ అధికారులు సిఫార్సు చేశారు. నగదు చెల్లించకుంటే సంబంధిత వ్యక్తులకు సంబంధించిన ఆస్తులను అటాచ్‌మెంట్ చేయాలని అధికారులు సిఫార్సు చేశారు.