5 కోట్లతో సమస్యలు పరిష్కరిస్తా
ABN , Publish Date - Apr 04 , 2026 | 03:51 AM
శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ పట్టణంలోని సమస్యల పరిష్కారానికి రూ.5 కోట్లు కేటాయిస్తామని బీసీ సంక్షేమ, చేనేత, జౌళిశాఖ మంత్రి సవిత ప్రకటించారు.
‘అక్షరం అండగా..’ అద్భుత కార్యక్రమం: సవిత
శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండలో నిర్వహణ.. తరలివచ్చిన జనం
హిందూపురం, ఏప్రిల్ 3(ఆంధ్రజ్యోతి): శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ పట్టణంలోని సమస్యల పరిష్కారానికి రూ.5 కోట్లు కేటాయిస్తామని బీసీ సంక్షేమ, చేనేత, జౌళిశాఖ మంత్రి సవిత ప్రకటించారు. పట్టణంలోని నారాయణమ్మ కాలనీలో ‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్’ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన ‘అక్షరం అండగా.. పరిష్కారమే అజెండాగా’ కార్యక్రమంలో మంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ప్రజల సమస్యలపై ‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్’ బాధ్యతగా వ్యవహరిస్తున్నాయన్నారు. పట్టణ ప్రజలు తమ దృష్టికి తెచ్చిన నారాయణమ్మ కాలనీ, ఎన్టీఆర్ కాలనీ, ఇస్లాపురంలో సీసీ రోడ్లు, కోనాపురం రోడ్డు, డ్రైనేజీ వ్యవస్థ, సెంట్రల్ లైటింగ్ సిస్టం, మరికొన్ని పనులకు రూ.5 కోట్లు కేటాయిస్తున్నామని తెలిపారు. తొమ్మిది నెలల్లో ఈ పనులను పూర్తి చేస్తామని చెప్పారు. పెనుకొండ మెడికల్ కళాశాలను పీపీపీ పద్ధతిలో 2029లోపు పూర్తి చేస్తామన్నారు. ఈఎస్ఐ ఆసుపత్రిని కూడా నిర్మిస్తామన్నారు.
సామాజిక సమస్యలే అధికం
‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్’ నిర్వహించిన ‘అక్షరం అండగా.. పరిష్కారమే అజెండాగా’ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. నారాయణమ్మ కాలనీ, పెనుకొండ పట్టణం, సమీప గ్రామాల ప్రజలు 450 మందికిపైగా తరలివచ్చారు. సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. కార్యక్రమంలో ఆర్డీవో ఆనంద్‌కుమార్, మున్సిపల్ కమిషనర్ సతీష్ కుమార్, తహసీల్దార్ స్వాతి తదితరులు పాల్గొన్నారు.
గ్రీన్‌సిటీలో రోడ్డు పనులకు శ్రీకారం
‘అక్షరం అండగా..’ కార్యక్రమానికి స్పందన
ఏలూరు, ఏప్రిల్ 3(ఆంధ్రజ్యోతి): ఏలూరు నగరంలోని 19వ డివిజన్ గ్రీన్‌సిటీ గ్రీన్‌ల్యాండ్‌లోని ప్రధాన రహదారికి మోక్షం లభిస్తోంది. ‘ఏబీఎన్ ఆంధ్రజ్యోతి’ ఆధ్వర్యంలో ‘అక్షరం అండగా.. పరిష్కారమే అజెండా’గా కార్యక్రమం గతనెల 15న ఇక్కడ జరిగింది. రోడ్డు సమస్య పరిష్కారానికి రూ.1.07 కోట్లతో సీసీ రోడ్డు ఏర్పాటుకు ఎమ్మెల్యే చంటి అనుమతి మంజూరు చేశారు. ఇటీవలే టెండర్లు పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో గ్రీన్‌సిటీ డెవల్‌పమెంట్ సొసైటీ ఆధ్వర్యంలో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శుక్రవారం భూమి పూజ చేశారు. పనులు వేగంగా జరిగేలా చూసుకోవాలని.. ఎమ్మెల్యే సూచించారు.
