పొగాకు క్వింటాకు రూ.25వేలు ఇవ్వాల్సిందే
ABN , Publish Date - Jul 27 , 2026 | 11:23 PM
పొగాకుకు క్వింటాకు రూ.25వేలు ధర ఇవ్వడంతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించి ప్రభుత్వ రంగ సంస్థ ద్వారా మొత్తం కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని సంయుక్త కిసాన్ మోర్చా జిల్లా కన్వీనర్ చుండూరి రంగారావు డిమాండ్ చేశారు.
వెయ్యి కోట్లు కేటాయించి పొగాకును కొనాలి
ఈ నెల 29న రహదారుల దిగ్బంధం
సంయుక్త కిసాన్ మోర్చా జిల్లా కన్వీనర్ చుండూరి రంగారావు
ఒంగోలు కలెక్టరేట్, జూలై 27 (ఆంధ్రజ్యోతి) : పొగాకుకు క్వింటాకు రూ.25వేలు ధర ఇవ్వడంతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించి ప్రభుత్వ రంగ సంస్థ ద్వారా మొత్తం కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని సంయుక్త కిసాన్ మోర్చా జిల్లా కన్వీనర్ చుండూరి రంగారావు డిమాండ్ చేశారు. ఈనెల 23నుంచి 27వ తేదీ వరకు జిల్లాలోని పొగాకు రైతులను చైతన్యవంతం చేసేందుకు చేపట్టిన బైక్ ర్యాలీ ముగింపు సందర్భంగా సోమవారం స్థానిక మాదాల నారాయణస్వామి భవన్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు ఆందోళనలు చేసిన ప్రతిసారీ ఏదో ఒక సమీక్షలు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్తున్నా ఆ దిశగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడం లేదని ఆరోపించారు. సమస్యను మభ్యపెట్టే ధోరణితో వ్యవహరించడం సరికాదన్నారు. ధర సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ఆందోళన కొనసాగుతోందన్నారు. అందులో భాగంగా ఈనెల 29వ తేదీన త్రోవగుంట సమీపంలోని ముదిగొండి బ్రిడ్జి వద్ద, టంగుటూరు టోల్ ప్లాజా వద్ద రహదారుల దిగ్బంధం కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో జిల్లాలోని రైతాంగం పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘాల నాయకులు జే జయంతిబాబు, వడ్డే హనుమారెడ్డి, చిట్టిపాటి వెంకటేశ్వర్లు, ఎస్.లలితకుమారి, పమిడి వెంకట్రావు, టి. శ్రీకాంత్, సీఎస్ సాగర్, పరిటాల కోటేశ్వరరావు, టి. ప్రభాకర్, బి. పద్మ, ఆర్. లక్ష్మీ, జి. వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.