మరో 22,177 కోట్ల పెట్టుబడులు
ABN , Publish Date - Sep 24 , 2026 | 04:15 AM
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో వివిధ రంగాల్లో రూ.22,177 కోట్ల పెట్టుబడులతో 19,739 ఉద్యోగాలు కల్పించే ప్రాజెక్టులకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. మచిలీపట్నంలో రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన గోవా షిప్‌యార్డ్ ఆధ్వర్యంలో నౌకానిర్మాణ, మరమ్మతుల కేంద్రం ఏర్పాటుకు అనుమతించింది.
ఎస్‌ఐపీబీ సిఫారసులకు మంత్రివర్గం ఆమోదం
4 కొత్త పోలీసు కమిషనరేట్లు..
న్యాయాధికారుల రిటైర్మెంట్ వయసు పెంచే ఆర్డినెన్స్‌కు ఓకే
ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు
2 డీఏల మంజూరు ఉత్తర్వులకు ఆమోదం
ఎస్‌ఐపీబీ సిఫారసులకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం
క్యాబినెట్ నిర్ణయాలు వెల్లడించిన మంత్రి పార్థసారథి
అమరావతి, సెప్టెంబరు 23(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో వివిధ రంగాల్లో రూ.22,177 కోట్ల పెట్టుబడులతో 19,739 ఉద్యోగాలు కల్పించే ప్రాజెక్టులకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. మచిలీపట్నంలో రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన గోవా షిప్‌యార్డ్ ఆధ్వర్యంలో నౌకానిర్మాణ, మరమ్మతుల కేంద్రం ఏర్పాటుకు అనుమతించింది. బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం జరిగింది. రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్‌ఐపీబీ) సిఫారసులను ఆమోదించింది. విశాఖపట్నంలో డెలాయిట్ ఐటీ/ఐటీఈఎస్ క్యాంపస్, ముత్తూట్ ఫిన్‌కార్ప్ ఏఐ-టెక్ ట్రైనింగ్ సెంటర్‌తో పాటు అమరావతిలో క్వాంటమ్ టెక్నాలజీ ప్రాజెక్టులకు అంగీకారం తెలిపింది. క్యాబినెట్ నిర్ణయాలను గృహ నిర్మాణ, సమాచార-పౌరసంబంధాల శాఖల మంత్రి కొలుసు పార్థసారథి మీడియాకు వివరించారు. తిరుపతి, గుంటూరు, కర్నూలు, రాజమండ్రి కేంద్రాలుగా కొత్త పోలీసు కమిషనరేట్ల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు 2024 జూలై 1 నుంచి 2.73 శాతం, 2025 జనవరి 1 నుంచి 1.82 శాతం చొప్పున రెండు డీఏల మంజూరుకు ఆర్థికశాఖ ఉత్తర్వులకు ఆమోదముద్ర వేసిందన్నారు. న్యాయాధికారుల పదవీ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచుతూ.. ఈ ఏడాది మార్చి 31 నుంచి అమల్లోకి వచ్చేలా ఆర్డినెన్స్ జారీకి ఆమోదం తెలిపిందన్నారు.
మరిన్ని కీలక నిర్ణయాలివీ..
రూ.8 వేల కోట్ల పెట్టుబడితో 3 వేల ఉద్యోగాలు కల్పించేందుకు మచిలీపట్నంలో బ్రౌన్‌ఫీల్డ్ నౌకానిర్మాణం, నౌకా మరమ్మతుల కేంద్రం ఏర్పాటుకు గోవా షిప్‌యార్డ్‌కు 400 ఎకరాల భూమి.. మార్కెట్ విలువలో 2శాతం వార్షిక లీజు రుసుముతో పాటు.. ఏటా 5 శాతం పెంపుపై కేటాయింపు.
పర్యాటక రంగంలో రూ.408.26 కోట్లతో 1,765 ఉద్యోగాలిచ్చే ప్రాజెక్టులకు గ్రీన్‌సిగ్నల్.
సహకార చక్కెర కర్మాగారాల ఆర్థిక సమస్యల పరిష్కారానికి మంత్రుల కమిటీ చేసిన సిఫారులకు ఆమోదం. చెరకు ధర బకాయిల చెల్లింపులకు చోడవరం షుగర్ ఫ్యాక్టరీకి రుణ రూపంలో ఆర్థికసాయం. ఐదు కర్మాగారాల పెండింగ్ బకాయిల చెల్లింపులకు ఏపీఐఐసీ నుంచి రూ.66.57 కోట్ల రుణం పొందటానికి అనుమతి.
ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ బిల్లు-2024లో సవరణాత్మక వివరణ లేఖను కేంద్ర హోంశాఖకు పంపేందుకు అనుమతి.
ప్రభుత్వ సమాచారం, ప్రజా అవగాహన కార్యక్రమాలను విస్తృతం చేసేందుకు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లను ఎంప్యానెల్ చేసే పాలసీకి ఆమోదం.
ఏపీఐఐసీకి సాగర్‌మాల ఫైనాన్స్ కార్పొరేషన్ మంజూరు చేసిన రూ.2,500 కోట్ల టర్మ్ లోన్ వినియోగానికి ఓకే
విజయవాడలో హడ్కో ప్రాంతీయ కార్యాలయం నుంచి ఏపీపీఎఫ్‌పీఎల్ తీసుకునే ప్రత్యేక టర్మ్ లోన్ రూ.వెయ్యి కోట్లకు ప్రభుత్వ గ్యారెంటీ.. పంజాబ్-సింధ్ బ్యాంకు హైదరాబాద్ అబిడ్స్ బ్రాంచ్ నుంచి రూ.500 కోట్లు, విజయవాడ ఎస్‌బీఐ బ్రాంచ్ నుంచి రూ.2 వేల కోట్ల టర్మ్ లోన్ తీసుకోవడానికి ఏపీపీఎఫ్‌పీఎల్ కు అనుమతి.
హంద్రీ-నీవా సుజల స్రవంతి ఫేజ్-2 కింద పలమనేరు, కుప్పం నియోజకవర్గాల్లోని బ్రాంచ్ కెనాల్‌లో సీసీ లైనింగ్ పనులకు రూ.125.65 కోట్లతో సవరించిన ప్రతిపాదనలకు ఆమోదం. ఇదే పథకం కింద అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో ప్రధాన కాలువ లైనింగ్‌తో పాటు టన్నెల్ పనులకు రూ.337.99 కోట్లతో సవరించిన బడ్జెట్‌కు ఆమోదం.
రాజధాని అమరావతి పరిధిలోని అన్ని గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు రూ.1,548.98 కోట్లతో సవరించిన ప్రతిపాదనలకు అనుమతి.
అమరావతిలో ప్రభుత్వ కాంప్లెక్స్ సూపర్ బ్లాక్-ఈలో అసెంబ్లీ భవన పనులకు 661 కోట్లకు అనుమతి.
అమరావతి కృష్ణాయపాలెంలో స్కూల్ ప్లాట్-4లో ఐదెకరాలు నలందా అకాడమీకి లీజుకు ఇవ్వడానికి ఆమోదం.
విశాఖపట్నంలో ఏఐ ఇంటిగ్రేటెడ్ హబ్ ఏర్పాటుకు ముత్తూట్ ఫిన్‌కార్ప్‌కు 3ఎకరాల కేటాయింపు.
కడప జిల్లా చిన్నకొమ్మెర్లలో క్లింకర్, సిమెంట్ ప్లాంట్ విస్తరణకు దాల్మియా సిమెంట్‌కు 250 ఎకరాలు.
తిరుపతి జిల్లా పెన్నేపల్లిలో స్టీల్ ప్లాంట్ విస్తరణకు అగర్వాల్ ఫౌండ్రీ్‌సకు 148.98 ఎకరాలు.
శ్రీసత్యసాయి జిల్లా టేకులోడులో 623.60 ఎకరాల ప్రభుత్వ భూమి ఏపీఐఐసీకి బదిలీ.
కోససీమ జిల్లా బ్రహ్మసమేద్యం గ్రామంలో 1,618 ఎకరాల ప్రభుత్వ భూమి ఏపీఎండీసీకి కేటాయింపు.
కృష్ణా జిల్లా రుద్రవరంలో 102.85 ఎకరాలు మార్కెట్ విలువపై కృష్ణా యూనివర్సిటీకి బదిలీ.
నెల్లూరు జిల్లా ఈపూరు బిట్‌లో 11.70 ఎకరాలు పారిశ్రామిక పార్కుకు కేటాయింపు.
సోలార్ పవర్ ప్రాజెక్టు కోసం కడప జిల్లా రామచంద్రయ్యపల్లిలో ఏపీఎస్పీసీఎల్‌కు 783.47 ఎకరాల ప్రభుత్వ భూమి మార్కెట్ విలువపై కేటాయింపు.
వివిధ జిల్లాల్లో టీడీపీ కార్యాలయాలకు ఇచ్చిన భూముల లీజు కాలం 33 ఏళ్ల నుంచి 66 ఏళ్లకు పొడిగింపు.
రాజధాని భూసమీకరణ రూల్స్‌లో సవరణలు. ఎకరా కంటే తక్కువ భూమిచ్చిన రైతులకు కనీస వార్షిక భృతి.
రౌడీయిజాన్ని పెంచిపోషిస్తున్న గొడ్డలి పార్టీ నేత
ఖాళీ భూముల్లో పీఎండీఎస్ విత్తనాలు: పార్థసారథి
‘రాష్ట్రంలో విధ్వంసం, అలజడి సృష్టించి, ప్రభుత్వ అధికారుల మనోధైర్యాన్ని దెబ్బతీసేలా జగన్ ప్రవర్తిస్తున్నారు. రౌడీయిజాన్ని, గంజాయిని పెంచిపోషిస్తూ... రాష్ట్రానికి పెట్టుబడిదారులు రాకుండా ఒక భయాన్ని కల్పించాలనే లక్ష్యంతో గొడ్డలి పార్టీ నేత పనిచేస్తున్నారు’ అని మంత్రి కొలుసు పార్థసారథి వ్యాఖ్యానించారు. బుధవారం మంత్రి మీడియాతో మాట్లాడారు. ‘తనకు ఓట్లు వేసిన ఓటర్ల మనోభావాలను గౌరవించకుండా, అసెంబ్లీకి రాకుండా, తన ఇంటినే ఒక అసెంబ్లీగా మార్చుకుని, సొంత పేపరు, చానల్‌ను అడ్డం పెట్టుకుని అబద్ధాలతో విధ్వంసాలు సృష్టించడంపై ప్రజలంతా ఆలోచించాలి. క్యాబినెట్‌లో ఎల్‌నినో ప్రభావంపైనా చర్చ జరిగింది. విత్తనాలు నాటే సమయం అయిపోయినందున చాలా భూములు ఖాళీగా ఉన్నాయి.
వాటిలో పీఎండీఎస్ విత్తనాలు చల్లేలా మంత్రులు, ఎమ్మెల్యేలు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. పెరుగుతున్న ధరలకు కళ్లెం వేసేలా మంత్రుల కమిటీ సిఫారసులు వెంటనే చేయాలని, మార్కెట్ జోక్యంపై ప్రణాళికలను రూపొందించాలనీ సీఎం ఆదేశించారు. తీవ్ర వాయుగుండం ప్రభావం ఉన్న ఏడు జిల్లాలకు మంత్రులు వెళ్లి, కలెక్టర్లతో కలసి ప్రజలు ఇబ్బందులు పడకుండా, మౌలిక సదుపాయాలు దెబ్బతింటే వెంటనే పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు’ అని మంత్రి పార్థసారథి వివరించారు.