బుల్లెట్ వేగంతో ఎన్‌ఫీల్డ్ ప్రాజెక్టు!
ABN , Publish Date - May 19 , 2026 | 04:18 AM
బుల్లెట్ వేగంతో రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్రాజెక్టు ఏర్పాటు కావాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. రాయల్ ఎన్‌ఫీల్డ్ సంస్థ సీఈవో గోవింద రాజన్ సోమవారం సచివాలయంలో సీఎంతో భేటీ అయ్యారు
18 నెలల్లో ఉత్పత్తి ప్రారంభించాలి: సీఎం
చంద్రబాబుతో సంస్థ సీఈవో గోవింద రాజన్ భేటీ
అమరావతి, మే 18(ఆంధ్రజ్యోతి): బుల్లెట్ వేగంతో రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్రాజెక్టు ఏర్పాటు కావాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. రాయల్ ఎన్‌ఫీల్డ్ సంస్థ సీఈవో గోవింద రాజన్ సోమవారం సచివాలయంలో సీఎంతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ప్రాజెక్టును 18 నెలల్లో పూర్తి చేసి, ఉత్పత్తి ప్రారంభించాలని తేల్చిచెప్పారు. దీనికి ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరిస్తుందని భరోసా ఇచ్చారు. ప్రభుత్వపరంగా ప్రోత్సాహకాలు కల్పించడంపై సంస్థ ప్రతినిధులు సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. తిరుపతి జిల్లా సత్యవేడు మండలం రాళ్లకుప్పం, వానల్లూరు వద్ద రూ.2500 కోట్ల పెట్టుబడితో అత్యాధునిక తయారీ యూనిట్‌తోపాటు టెస్టింగ్ ట్రాక్, పరిశోధన కేంద్రం, వెండార్ పార్క్ ఎకో సిస్టమ్ కూడా నిర్మిస్తామని గోవిందరాజన్ చెప్పారు. ఏడాదికి 9 లక్షల మోటార్ సైకిళ్లు ఉత్పత్తి చేయనున్నట్లు వివరించారు. ఈ యూనిట్ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 15 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. త్వరలో ఫ్లైయింగ్ ఫ్లీ సీ6 పేరిట ఎలక్ట్రిక్ వేరియంట్ మోడల్‌ను కూడా తీసుకురానున్నట్లు సంస్థ ప్రతినిధులు సీఎంకు తెలిపారు. రెన్యువబుల్ ఎనర్జీ ఉత్పాదనకు రాష్ట్రంలో చేపట్టిన వివిధ ప్రాజెక్టులపై రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్రతినిధులకు సీఎం వివరించారు. ఈ ప్రాజెక్టులు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరగడానికి దోహదపడతాయన్నారు. అనంతరం రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్రతినిధులు సీఎంకు బుల్లెట్ 350 మినియేచర్ మోడల్‌ను అందించారు. హెల్మెట్ ధరించి సీఎం బుల్లెట్ ఎక్కారు.