బెజవాడలో రోప్‌వే!
ABN , Publish Date - Mar 07 , 2026 | 12:58 AM
వేగంగా విస్తరిస్తూ.. దినదినాభివృద్ధి చెందుతున్న బెజవాడలో మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు అడుగులు పడ్డాయి. పండిట్ నెహ్రూ బస్‌స్టేషన్ నుంచి ఇంద్రకీలాద్రికి, అక్కడి నుంచి భవానీద్వీపం వరకు రోప్‌వే ప్రాజెక్టుకు పీపీపీ విధానంలో ఆసక్తి వ్యక్తీకరణ కోరుతూ అమరావతి అభివృద్ధి - మౌలిక సదుపాయాల కల్పన సంస్థ నోటిఫికేషన్‌ను వెలువరించింది. పలు అంశాలను దృష్టిలో పెట్టుకుని తయారు చేసిన ప్రాజెక్టు డిజైన్లతో ముందుకు రావాలని ఆహ్వానించింది.
- పీఎన్‌బీఎస్-ఇంద్రకీలాద్రి-భవానీ ద్వీపం కలుపుతూ రోప్‌వేకు టెండర్లు
- రూ.750 కోట్లతో ఈఓఐ విడుదల చేసిన ఏజీఐసీఎల్
- 3.3 కిలోమీటర్ల పొడవున నిర్మాణానికి ప్రణాళిక
- పీఎన్‌బీఎస్ - ఇంద్ర కీలాద్రి, ఇంద్రకీలాద్రి - భవానీఘాట్, భవానీ ఘాట్-భవానీ ద్వీపం
- మూడు చోట్ల ఎంట్రీ పాయింట్లు
వేగంగా విస్తరిస్తూ.. దినదినాభివృద్ధి చెందుతున్న బెజవాడలో మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు అడుగులు పడ్డాయి. పండిట్ నెహ్రూ బస్‌స్టేషన్ నుంచి ఇంద్రకీలాద్రికి, అక్కడి నుంచి భవానీద్వీపం వరకు రోప్‌వే ప్రాజెక్టుకు పీపీపీ విధానంలో ఆసక్తి వ్యక్తీకరణ కోరుతూ అమరావతి అభివృద్ధి - మౌలిక సదుపాయాల కల్పన సంస్థ నోటిఫికేషన్‌ను వెలువరించింది. పలు అంశాలను దృష్టిలో పెట్టుకుని తయారు చేసిన ప్రాజెక్టు డిజైన్లతో ముందుకు రావాలని ఆహ్వానించింది.
(ఆంధ్రజ్యోతి, విజయవాడ):
బెజవాడను ఎప్పటి నుంచో ఊరిస్తున్న రోప్ వే ప్రాజెక్టు కల ఎట్టకేలకు సాకారం కాబోతోంది. పండిట్ నెహ్రూ బస్‌స్టేషన్ (పీఎన్‌బీఎస్) నుంచి ఇంద్రకీలాద్రికి, అక్కడి నుంచి భవానీద్వీపానికి రోప్‌వే ప్రాజెక్టుకు పీపీపీ విధానంలో ఆసక్తి వ్యక్తీకరణ (ఈఓఐ) కోరుతూ అమరావతి అభివృద్ధి - మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (ఏజీఐసీఎల్) నోటిఫికేషన్‌ను వెలువరించింది. రూ.750 కోట్ల వ్యయంతో 3.3 కిలోమీటర్ల పొడవునా రోప్‌వే ప్రాజెక్టుకు సమగ్ర ప్రణాళికలతో ముందుకు రావాల్సిందిగా ఔత్సాహిక కాంట్రాక్టు సంస్థలను ఆహ్వానించింది. ఈ ప్రాజెక్టు పీఎన్‌బీఎస్ దగ్గర ప్రారంభమై భవానీ ద్వీపం దగ్గర ముగుస్తుంది. మధ్యలో కనకదుర్గ ఆలయం, భవానీఘాట్‌లను కలుపుతుంది. ప్రస్తుతం బస్సులు, టాక్సీలు, క్యాబ్‌లు, ఇతర ప్రైవేటు వాహనాలు బస్‌స్టేషన్ నుంచి భవానీఘాట్ వరకు అందుబాటులో ఉన్నాయి. భవానీ ద్వీపం చేరుకోవటానికి భవానీ ఘాట్ దగ్గర ఫెర్రీ బోటు సేవలు అందుబాటులో ఉన్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకుని ఆకాశంలో విహరిస్తూ నగర అందాలను, అమ్మవారిని దర్శించుకునేలా, భవానీద్వీపాన్ని సందర్శించేలా.. తిరిగి పీఎన్‌బీఎస్‌కు చేరుకునేలా దీనికి ప్లాన్ చేశారు. దుర్గగుడికి నేరుగా వచ్చిన భక్తులు కూడా రోప్‌వే మీదుగా.. భవానీ ద్వీపంతో పాటుగా.. పీఎన్‌బీఎస్‌కు కూడా వెళ్లేలా పాయింట్‌ను కల్పించనున్నారు. పీఎన్‌బీఎస్, దుర్గగుడి, భవానీ ద్వీపం దగ్గర మూడు పాయింట్లు ఉంటాయి. ఈ పాయింట్ల నుంచి ఎటు నుంచి ఎటైనా వెళ్లవచ్చు.
పలు అంశాలను దృష్టిలో పెట్టుకుని..
పీపీపీ విధానంలో కాబట్టి .. సాధ్యాసాధ్యాలపై సమగ్ర నివేదికను ఆయా సంస్థలు అందించాల్సి ఉంటుంది. ఇంద్రకీలాద్రి మీదకు రోప్‌వే వెళుతుంది కాబట్టి వైదిక, ఆగమ శాస్ర్తాలకు విరుద్ధంగా లేకుండా.. ఆర్కియాలజికల్ అభ్యంతరాలు రాకుండా ట్రాన్స్‌మిషన్ హైటెన్షన్ లైన్స్ ద్వారా సమస్యలు తలెత్తకుండా రోప్‌వే ప్రాజెక్టు డిజైన్లతో ముందుకు రావాల్సి ఉంటుంది. భారీ వ్యయంతో తలపెడుతున్న ప్రాజెక్టుకు వయబిలిటీ ఉంటుందా లేదా అన్న దానిపై కూడా ఏజీఐసీఎల్ భరోసా ఇస్తోంది. విజయవాడ నగరంలో 2011 లెక్కల ప్రకారం 10.48 లక్షల జనాభా నివశిస్తోందని, ప్రస్తుతం ఆ సంఖ్య 14.91 లక్షలకు చేరిందని ప్రస్తావించింది. విజయవాడ మెట్రోపాలిటన్ ప్రాంతంగా గన్నవరం, రాజధాని అమరావతి ప్రాంతాలను కలిగి ఉందని రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో ఈ ప్రాంతం ఎంత కీలక పాత్ర పోషిస్తుందో కూడా వివరించింది. ఈ ప్రాంతానికి ఉన్న విస్తృతమైన రోడ్డు నెట్‌వర్క్ గురించి ఈఓఐలో పేర్కొంది. ఎన్‌హెచ్ - 16, ఎన్‌హెచ్ - 65, ఎన్‌హెచ్ - 30, గుంటూరు నుంచి రావటానికి వీలైన ప్రకాశం బ్యారేజీ, ర్యాపిడ్ గ్రోత ఏరియాలుగా ఉన్న గ్రేటర్ విలీన ప్రతిపాదిత గ్రామాల నుంచి రావటానికి అనువైన నైనవరం - నూజివీడు రోడ్డు వంటి వాటి గురించి ప్రస్తావిస్తూ .. ఔత్సాహిక సంస్థల నుంచి ఆసక్తి వ్యక్తీకరణను కోరింది.