Share News

రోబో కాప్‌ పట్టేసింది

ABN , Publish Date - Feb 04 , 2026 | 04:34 AM

విశాఖ రైల్వే స్టేషన్‌లో రోబో పోలీస్‌ ‘ఏఎ్‌ససీ అర్జున్‌’కు ఇద్దరు పాత నేరస్థులు చిక్కారు. ఇటీవల స్టేషన్‌లో ఈ రోబోను ప్రారంభించిన విషయం తెలిసిందే.

రోబో కాప్‌ పట్టేసింది

  • ఇద్దరు పాత నేరస్థులను పట్టుకున్న రోబో

  • విశాఖ రైల్వే స్టేషన్‌లో ముఖాన్ని డేటా బేస్‌లో గుర్తించిన అర్జున్‌

  • వెంటనే అదుపులోకి తీసుకున్న రైల్వే పోలీసులు

  • వారిపై రాయగడ స్టేషన్‌లో దోపిడీ కేసులు

విశాఖపట్నం, ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి): విశాఖ రైల్వే స్టేషన్‌లో రోబో పోలీస్‌ ‘ఏఎ్‌ససీ అర్జున్‌’కు ఇద్దరు పాత నేరస్థులు చిక్కారు. ఇటీవల స్టేషన్‌లో ఈ రోబోను ప్రారంభించిన విషయం తెలిసిందే. అందులో పాత నేరస్థుల ఫొటోలతో కూడిన డేటాను లోడ్‌ చేశారు. ఈ నేపథ్యంలో ఏఐ ఆధారిత ముఖ గుర్తింపు వ్యవస్థ (ఎఫ్‌ఆర్‌ఎస్‌) ద్వారా పాత నేరస్థులను గుర్తించడంలో రోబో విజయవంతమైంది. సోమవారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో స్టేషన్‌లో రోబో కాప్‌ పెట్రోలింగ్‌ చేస్తుండగా ఒకరి ముఖం డేటా బేస్‌లోని పాత నేరస్థుడితో సరిపోవడంతో ఆర్పీఎఫ్‌ సీసీ టీవీ కంట్రోల్‌ రూమ్‌ను సిగ్నల్‌తో అప్రమత్తం చేసింది. విధుల్లో ఉన్న ఆర్పీఎఫ్‌ ఎస్‌ఐ కీర్తిరెడ్డి, హెడ్‌ కానిస్టేబుల్‌ బీఎస్‌ నారాయణ తమ సిబ్బందితో హుటాహుటిన అక్కడకు చేరుకుని రోబో గుర్తించిన హడప శివ (39)ను, అతని సహచరుడు జి.భాంగారు (ఇద్దరూ ఒడిశా వాసులు)ను అదుపులోకి తీసుకున్నారు. వారిద్దరి వద్ద టికెట్‌ లేకపోవడంతో ఆర్పీఎఫ్‌ కార్యాలయానికి తీసుకువెళ్లి జీఆర్పీ సిబ్బందితో కలిసి విచారించడంతోపాటు యుద్ధప్రాతిపదికన వివిధ స్టేషన్లలో ఆరా తీశారు. వారిద్దరిపై రాయగడ పోలీస్‌ స్టేషన్‌లో దోపిడీ తదితర అనేక నేరాలకు సంబంధించి కేసులు ఉన్నట్టు తేలింది. దీంతో రాయగడ పోలీసులకు సమాచారమిచ్చారు. కాగా, ప్రస్తుతం టికెట్‌ లేకుండా ప్రయాణిస్తున్నట్టు గుర్తించిన నేపథ్యంలో వారిపై రైల్వే చట్టం ప్రకారం కూడా చర్యలు తీసుకున్నారు. దీనిపై డీఆర్‌ఎం లలిత్‌ బొహ్రా స్పందిస్తూ భద్రతను పెంచడం, నేరాలను ముందస్తుగా నిరోధించడంలో ఏఐ ఆధారిత నిఘా, ముఖ గుర్తింపు సాంకేతికత విజయవంతమైందని సంతోషం వ్యక్తం చేశారు.

Updated Date - Feb 04 , 2026 | 04:35 AM