Share News

దోచేశారు!

ABN , Publish Date - Feb 26 , 2026 | 12:47 AM

గత వైసీపీ పాలనలో పంచాయతీల్లో పెద్దఎత్తున అవినీతి రాజ్యమేలింది. రాష్ట్ర, జిల్లా స్థాయిలో అధికారుల పర్యవేక్షణ లోపించడంతో పంచాయతీ పాలకవర్గాలు, కార్యదర్శులు అందినకాడికి దోచుకున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఫిర్యాదులు వెల్లువెత్తడంతో తవ్వేకొద్ది అవినీతి బయట పడుతోంది. అక్రమాలకు పాల్పడిన అధికారులు, సర్పంచులపై చర్యలకు అధికారులు సన్నద్ధమవుతున్నారు.

దోచేశారు!

- వైసీపీ పాలనలో పంచాయతీల్లో భారీగా అక్రమాలు

- రూ.కోట్లలో ప్రజాధనం దుర్వినియోగం

- ఫిర్యాదుల వెల్లువతో అధికారుల విచారణ

- సర్పంచులు, కార్యదర్శులకు షోకాజ్‌ నోటీసులు

గత వైసీపీ పాలనలో పంచాయతీల్లో పెద్దఎత్తున అవినీతి రాజ్యమేలింది. రాష్ట్ర, జిల్లా స్థాయిలో అధికారుల పర్యవేక్షణ లోపించడంతో పంచాయతీ పాలకవర్గాలు, కార్యదర్శులు అందినకాడికి దోచుకున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఫిర్యాదులు వెల్లువెత్తడంతో తవ్వేకొద్ది అవినీతి బయట పడుతోంది. అక్రమాలకు పాల్పడిన అధికారులు, సర్పంచులపై చర్యలకు అధికారులు సన్నద్ధమవుతున్నారు.

ఆంధ్రజ్యోతి-కంచికచర్ల:

పశ్చిమ ఎన్టీఆర్‌ జిల్లాలోని కంచికచర్ల, పెనుగంచిప్రోలు, ముక్త్యాల గ్రామ పంచాయతీల్లో రూ. కోట్లలో నిధులు పక్కదారి పట్టించి బొక్కేశారు. స్థానికుల ఫిర్యాదులో కదిలిన అధికార యంత్రాంగం విచారణ చేసి సదరు పంచాయతీ సర్పంచులు, కార్యదర్శులకు నోటీసులు ఇచ్చాయి. కాజేసిన నిధుల రికవరీకి ప్రయత్నాలు చేస్తున్నాయి.

కంచికచర్లలో ఇష్టారాజ్యం!

కంచికచర్ల పంచాయతీలో భారీగా నిధులు దుర్వినియోగం అయ్యాయి. ప్రజల నుంచి వసూలు చేసిన వివిధ రకాల పన్నుల సొమ్మును ముగ్గురు ఉద్యోగులు ట్రెజరీకి జమ చేయకుండ తమ ఇష్టారాజ్యమన్నట్టుగా బొక్కేశారు. జూనియర్‌ అసిస్టెంట్‌ ఎస్‌కే నాగులు 2024-25 ఆర్థిక సంవత్సరంలో వివిధ పద్దుల కింద వసూలు చేసిన సొమ్ము రూ. 16,08,904, అలాగే బిల్‌ కలెక్టర్‌ జంగం వెంకట గుప్తా బిల్‌ కలెక్షన్‌ రిజిస్టర్‌ (బీసీఆర్‌) దాఖలా వసూలు చేసిన సొమ్ము రూ.11,10,280 పంచాయతీ ఖజానాకు జమ చేయలేదు. గుమస్తా ఇల్లా సుబ్బారావు కొంత మేర నిధులు దుర్వినియోగం చేశాడు. ఈ పంచాయతీలో ముగ్గురు ఉద్యోగులు దాదాపుగా రూ.40 లక్షల వరకు అవినీతికి పాల్పడ్డారు. ముగ్గురిని జిల్లా పంచాయతీ అధికారులు సస్పెండ్‌ చేశారు. అయితే సుబ్బారావు రూ.5 లక్షలు జమ చేయటంతో అధికారులు సస్సెన్షన్‌ ఎత్తివేశారు. నాగులు కొంత సొమ్ము జమ చేసినట్టుగా తెలిసింది.

పెనుగంచిప్రోలులో రూ.1.33 కోట్లు గోల్‌మాల్‌

పెనుగంచిప్రోలు పంచాయతీలో రూ.1.33 కోట్ల నిధులు గోల్‌మాల్‌ అయినట్టు అధికారులు ప్రాథమిక విచారణలో తేల్చారు. నిధుల పక్కదారికి సమాధానమివ్వాలని సర్పంచి వేల్పుల పద్మకుమారి, పంచాయతీ కార్యదర్శి జి.శ్యామ్‌కుమార్‌కు పక్షం రోజుల క్రితమే జిల్లా అధికారులు షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. గ్రీన్‌ అంబాసిడర్ల పేరిట జీతాలు పక్కదారి పట్టించి, ఆ నిధులను కార్యదర్శి, సర్పంచి కాజేశారని పంచాయతీ సభ్యుడైన లగడపాటి ప్రవీణ్‌ చేసిన ఫిర్యాదుపై అధికారులు లోతైన విచారణ చేశారు. పంచాయతీలో మొత్తం 43 మంది పారిశుధ్య కార్మికులు, వాటర్‌ వర్క్స్‌, బిల్‌ కలెక్టర్‌లు కాంట్రాక్ట్‌ పద్ధతిలో పనిచేస్తున్నారు. వీరికి ఏటా పంచాయతీ తీర్మానం ద్వారా జీతాలు చెల్లిస్తున్నారు. వీరితో పాటు అసలు విధుల్లో లేని 16 మంది గ్రీన్‌ అంబాసిడర్లు పనిచేస్తున్నట్లు కాగితాల్లో చూపించి వారికి 15వ ఆర్థిక సంఘం నిధులను జీతాలుగా చెల్లించారు. వీరికి ఒక్కొక్కరికి నెలకు రూ. 6 వేల జీతం చొప్పున ఇచ్చి, ఆ సొమ్మును పారిశుధ్య కార్మికుల బ్యాంక్‌ ఖాతాల ద్వారా తిరిగి పంచాయతీ అధికారులే వసూలు చేసుకున్నారు. అధికారులు జరిపిన విచారణలో ఇది మొత్తం బయట పడింది.

ముక్త్యాలలో రూ.2.90 కోట్ల నిధుల దుర్వినియోగం

ముక్త్యాల గ్రామ పంచాయతీలో భారీగా నిధులు పక్కదారి పట్టించారని స్థానికులు పలువురు గతేడాది అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆ మేరకు జిల్లా పంచాయతీ అధికారులు విచారణ చేశారు. పంచాయతీ పాలన నిర్వహణలో అన్నింటా నిధులు మొత్తంగా రూ.2.90 కోట్లు పక్కదారి పట్టినట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ నెల 12న సర్పంచికి, కార్యదర్శులుగా పనిచేసిన ముగ్గురికి షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో గత నాలుగైదు రోజులుగా గ్రామంలో గొడవలు చోటుచేసుకున్నాయి. చిల్లకల్లు పోలీస్‌స్టేషన్‌లో కేసులు పెట్టుకున్నారు. మరోవైపు నిధుల దుర్వినియోగం విషయం రాజకీయ రంగు పులుముకుంది.

Updated Date - Feb 26 , 2026 | 12:47 AM