అవయవదానంతో ఆరుగురి జీవితాల్లో వెలుగులు
ABN , Publish Date - Jan 27 , 2026 | 05:04 AM
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఇంజనీరింగ్ విద్యార్థి బ్రెయిన్ డెడ్ అయినా.. ఆరుగురి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాడు.
ఇంజనీరింగ్ విద్యార్థి బ్రెయిన్ డెడ్
గ్రీన్ చానల్ ద్వారా తిరుపతికి గుండె తరలింపు
లివర్, కిడ్నీలు రమేశ్ హాస్పిటల్‌కు..
కార్నియాలు ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రికి
గుంటూరు మెడికల్, జనవరి 26 (ఆంధ్రజ్యోతి): రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఇంజనీరింగ్ విద్యార్థి బ్రెయిన్ డెడ్ అయినా.. ఆరుగురి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాడు. గుంటూరు జిల్లా తెనాలి మండలం పినపాడుకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి పెరుగు అమర్ బాబు (22) తాడికొండ మండలం నిడుముక్కలలో ఈ నెల 24న జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం ఆయనను గుంటూరులోని ఆస్టర్ రమేశ్ హాస్పిటల్స్‌కు తరలించారు. ఇక్కడ చికిత్స పొందుతూ అమర్‌బాబు సోమవారం బ్రెయిన్ డెడ్ అయినట్టు వైద్యులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో జీవన్‌దాన్ కో ఆర్డినేటర్లు బాధిత కుటుంబ సభ్యులను కలిసి వారికి అవయవదానం ప్రాముఖ్యతను వివరించారు. దీంతో వారు అవయవదానానికి అంగీకరించారు. సోమ వారం సాయంత్రం అవయవాల సేకరణ ప్రారంభించిన వైద్యులు.. అమర్ గుం డెను తిరుపతికి తరలించాలని నిర్ణయించారు. పోలీస్ శాఖకు సమాచారం ఇవ్వడంతో వారు.. గ్రీన్‌చానల్ ద్వారా ట్రాఫిక్‌ను నియంత్రించి ప్రత్యేక అంబులెన్స్‌లో అమర్ గుండెను గన్నవరం ఎయిర్‌పోర్టుకు తరలించారు. అక్కడి నుంచి విమానంలో తిరుపతికి పంపించారు. అమర్ కాలేయం, రెండు కిడ్నీలకు గుంటూరు రమేశ్ హాస్పటల్‌కు కేటాయించగా.. ఇక్కడ ముగ్గురు రోగులకు వాటిని అమర్చారు. రెండు కార్నియాలను ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్ కు పంపించారు.
వారి నిర్ణయం స్ఫూర్తిదాయకం ఎమ్మెల్యే గళ్లా మాధవి
అవయవదానంతో ఆరుగురి జీవితాల్లో కొత్త వెలుగులు నింపిన అమర్‌బాబు కు టుంబ నిర్ణయం స్ఫూర్తిదాయకమని గుం టూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవి అన్నారు. సోమవారం రమేశ్ హాస్పిటల్స్‌కు వచ్చిన ఆమె.. అమర్‌బాబు తల్లి కోటేశ్వరమ్మ, కుటుంబ సభ్యులను ఓదార్చారు. వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అమర్‌బాబు మృతి దురదృష్టకరమని, ఇంత బాధలోనూ కుటుంబసభ్యులు మానవతా దృక్పథంతో అవయవదానానికి ముందుకు రావడం గొప్ప విషయమని అన్నారు.