Share News

నదుల అనుసంధానంతో భారత్‌ అన్‌స్టాపబుల్‌!

ABN , Publish Date - Jun 26 , 2026 | 04:36 AM

నదుల అనుసంధానంతో దేశం అన్‌స్టాపబుల్‌ అవుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. రైతుల కోసం ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలు ఐకమత్యంతో పనిచేస్తాయని, రైతులకు ఆండగా నిలుస్తామని హామీ ఇచ్చారు.

నదుల అనుసంధానంతో భారత్‌ అన్‌స్టాపబుల్‌!

  • రైతుల కోసం 3 రాష్ట్రాలూ సమన్వయంతో పనిచేస్తాయి : చంద్రబాబు

దేశంలోని జలాశయాల సామర్థ్యం పెంపు, నీటి వనరుల సమర్థ వినియోగం, నీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడమే కేంద్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యం.

- సీఆర్‌ పాటిల్‌, కేంద్ర మంత్రి

తుంగభద్ర పరివాహక ప్రాంతం ఈ ప్రాంత భవిష్యత్‌ గోదాం. దీనిని కాపాడేందుకు కట్టుబడి ఉన్నాం. సమస్యల పరిష్కారానికి మేమూ సిద్ధంగా ఉన్నాం.

- కర్ణాటక సీఎం డీకే శివకుమార్‌

దుల అనుసంధానంతో దేశం అన్‌స్టాపబుల్‌ అవుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. రైతుల కోసం ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలు ఐకమత్యంతో పనిచేస్తాయని, రైతులకు ఆండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. గంగ, కావేరి నదులను అనుసంధానం చేస్తే భారత్‌ శక్తిమంతమైన దేశంగా అవతరిస్తుందన్నారు. ‘తుంగా పానం.. గంగా స్నానం’ అనే సామెత తుంగ నదీ జలాల విశిష్టతను తెలియజేస్తోందని చెప్పారు. ‘2024 ఆగస్టు 10న తుంగభద్ర డ్యాం 19వ క్రస్ట్‌ గేటు కొట్టుకుపోయినప్పుడు తీవ్ర ఆందోళన నెలకొంది. వెంటనే గేట్ల నిపుణుడు కన్నయ్యనాయుడిని డ్యాం వద్దకు పంపించాం. ఆయన సూచన ప్రకారం స్టాప్‌లాక్‌ అమర్చి, డ్యాంలో నీరు వృథా కాకుండా అడ్డుకున్నాం. ఏపీ, కర్ణాటక ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేసి, 33 క్రస్ట్‌ గేట్లు పునర్నిర్మాణాన్ని విజయవంతంగా పూర్తి చేశాయి. గోదావరి-కావేరి అనుసంధానంతో ఏపీ, కర్ణాటక, తెలంగాణ, తమిళనాడుకు దీర్ఘకాలిక ప్రయోజనాలు చేకూరతాయి. తాగునీటి సమస్య ఎదుర్కొంటున్న పొరుగు రాష్ట్రాలకు మంచినీటిని ఇచ్చి ఆదుకోవడం ఏపీకి అలవాటు. 1983లో ఉమ్మడి ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర అంగీకారంతో చెన్నె నగరానికి 15 టీఎంసీల తాగునీటిని అందించాలని నిర్ణయం తీసుకున్నాం. అప్పట్లో తమిళనాడుకు అదనంగా 5టీఎంసీల నీటిని అందించేందుకు కూడా రాష్ట్రాలు అంగీకరించాయి. ప్రస్తుతం ఎల్‌నివో ప్రభావం కారణంగా తుంగభద్ర, ఆలమట్టి జలాశయాలకు వరద తగ్గుతోంది. ఈ పరిస్థితుల్లో నీటి వినియోగంలో పొదుపు పాటించడం అత్యవసరం. రాష్ట్రాలుగా వేరైనా దేశంగా మనమం తా ఒక్కటే. రైతుల ప్రయోజనాల పరిరక్షణ కోసం కలిసికట్టుగా పనిచేయాలి’ అని పిలుపిచ్చారు.


కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రంలో మోదీపై ప్రశంసలు

సభలో ప్రధాని మోదీపై చంద్రబాబు ప్రశంసల వర్షం కురిపించారు. కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రంలో మోదీని కొనియాడడం.. స్థానికుల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవడం గమనార్హం. మోదీ చొరవతోనే రాష్ట్రాల నడుమ జలవివాదాలు సులువుగా పరిష్కారమవుతున్నాయని, ఆయన దూరదృష్టి కారణంగానే నదుల అనుసంధానం వంటి అంశాలు చురుగ్గా ముందుకు సాగుతున్నాయని చెప్పారు. మోదీ నాయకత్వంలో భారత్‌ వేగంగా పురోగమిస్తోందని.. వన్‌నేషన్‌-వన్‌ గ్రిడ్‌, టెలికాం విస్తరణ, జాతీయ రహదారి, నెట్‌వర్క్‌ వంటి పనులు దేశ సమగ్రాభివృద్ధికి బాటలు వేస్తున్నాయని తెలిపారు.

Updated Date - Jun 26 , 2026 | 04:40 AM