Jagan River Basin Argument: రివర్ బేసిన్‌లో రాజధాని కడతారా?
ABN , Publish Date - Jan 09 , 2026 | 03:46 AM
మూడు రాజధానుల పేరిట రాజధాని అమరావతిని ధ్వంసం చేసిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి..
అది సుప్రీం మార్గదర్శకాలకు విరుద్ధం
దీనిపై సుప్రీం కోర్టు జోక్యం చేసుకోవాలి
రాజ్యాంగంలో రాజధాని అనే పదమే లేదు
సీఎం ఎక్కడుంటే అదే రాజధాని: జగన్
అమరావతి, జనవరి 8 (ఆంధ్రజ్యోతి): మూడు రాజధానుల పేరిట రాజధాని అమరావతిని ధ్వంసం చేసిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి.. దానిపై మరోసారి విషం కక్కారు. ఈసారి... ‘రివర్ బేసిన్’ అంటూ కొత్త పల్లవి అందుకున్నారు. నదీ పరివాహక ప్రాంతం (రివర్ బేసిన్)లో రాజధాని నిర్మిస్తున్నారని ఆరోపించారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ఆ ప్రాంతంలో ఒక్క భవనం కూడా నిర్మించేందుకు వీల్లేదని గురువారం తాడేపల్లి ప్యాలె్‌సలో చెప్పారు. వాటికి విరుద్ధంగా నిర్మిస్తున్నందున సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలన్నారు. అలాగే... రాజ్యాంగంలో రాజధాని అనే పదమే లేదని చెప్పారు. ‘ప్రభుత్వం ఎక్కడ కూర్చుంటే అదే రాజధాని. ఈ ముఖ్యమైన విషయాన్ని అందరూ అర్థం చేసుకోవాలి. ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చుంటే.. అక్కడికే మంత్రులంతా వస్తారు. మంత్రులు ఎక్కడుంటే... హెచ్‌వోడీలూ అక్కడికే వస్తారు. ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చుంటే అదే రాజధాని. ఇదే రాజ్యాంగం చెబుతోంది. చంద్రబాబు కడుతున్న సోకాల్డ్ రాజధాని రివర్ బేసిన్‌లో ఉంది. ఆయనకు మెదడులో ఫ్యూజు, ప్లగ్గు ఉన్నాయో లేవో! అమరావతిలో రోడ్లు, తాగునీరు, విద్యుత్, డ్రైనేజీ సదుపాయాలు లేవు. కానీ అక్కడే చంద్రబాబు రాజధాని నిర్మాణం చేపడతానంటున్నారు’ అని జగన్ విమర్శించారు. 50 వేల ఎకరాల్లో మౌలిక సదుపాయాలకే రూ.లక్ష కోట్లు అవసరమని పాతపాటే పాడారు. ఇంకా కొత్తగా భూసేకరణ ఎందుకని ప్రశ్నించారు. బినామీల కోసమే సేకరిస్తున్నారని ఆరోపించారు.