Share News

మాఫియా కలల్లో మైనర్లు!

ABN , Publish Date - May 18 , 2026 | 04:40 AM

మాఫియాలో చేరాలని భావించిన కొడుకు కన్న తల్లిని చంపిన ఘటన రాష్ట్రాన్ని ఉలిక్కిపడేలా చేసింది. గంజాయి విక్రయించి రూ.లక్షలు సంపాదించాలనుకున్న యువకుడి లక్ష్యం అతని నేరప్రవృత్తిని చాటి చెప్పింది.

మాఫియా కలల్లో మైనర్లు!

  • పెరుగుతున్న నేర ప్రవృత్తి

  • 2024లో 726 కేసుల నమోదు.. హత్యలు, అత్యాచారాలు, దాడి,

  • దొంగతనాలు, దారి దోపిడీలు.. నేరాల దిశగా రేపటి పౌరులు

  • సోషల్‌ మీడియా, వ్యసనాలు, స్కూల్‌ డ్రాపౌట్లు కీలక కారణాలు

  • కుటుంబ వ్యవస్థ కూడా: పోలీసులు

రాష్ట్రంలోని మైనర్లలో పెరుగుతున్న నేర ప్రవృత్తి ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. విద్యాబుద్ధులు నేర్చుకోవాల్సిన వయసులో రేపటి పౌరులు చీకటి బాట పడుతున్నారు. ఏటా పెరుగుతున్న బాల నేరస్తులు సమాజానికి సవాలుగా మారుతున్నారు. చిన్నపాటి దొంగతనాలు మొదలుకొని దారి దోపిడీలు, హత్యలు, అత్యాచారాలు, దేశ ద్రోహం కేసుల్లో సైతం మైనర్ల పాత్ర వెలుగు చూస్తుండడం గమనార్హం.

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

మాఫియాలో చేరాలని భావించిన కొడుకు కన్న తల్లిని చంపిన ఘటన రాష్ట్రాన్ని ఉలిక్కిపడేలా చేసింది. గంజాయి విక్రయించి రూ.లక్షలు సంపాదించాలనుకున్న యువకుడి లక్ష్యం అతని నేరప్రవృత్తిని చాటి చెప్పింది. నాలుగేళ్ల బాలికపై అఘాయిత్యానికి పాల్పడి హత్యచేసి శవాన్ని మాయం చేసేందుకు ప్రయత్నించి యువకుడి వ్యవహారం సమాజాన్ని నివ్వెరపాటుకు గురిచేసింది. ఇలా.. రాష్ట్రంలో యువత నేరాలవైపు అడుగులు వేస్తోంది. కేంద్ర హోంశాఖ ఇటీవల విడుదల చేసిన ఎన్‌సీఆర్‌బీ నివేదిక సైతం రాష్ట్రంలో జువైనల్స్‌(బాల నేరస్తులు) పెరుగుతున్నట్లు వెల్లడించింది. మరోవైపు రాష్ట్రంలో కొత్తగా జైవైనల్‌ హోమ్‌ నిర్మాణానికి ప్రభుత్వాన్ని కోరుతూ ఇటీవలే జైళ్ల శాఖ ప్రతిపాదనలు పంపడం వంటివి బాల నేరస్తుల సంఖ్య పెరుగుతుండడాన్ని స్పష్టం చేస్తున్నాయి. కుటుంబ వ్యవస్థ బలహీన పడటం, సోషల్‌ మీడియా ప్రభావం, వ్యసనాలు, స్కూల్‌ డ్రాపౌట్లు, మత్తు పదార్థాల అలవాటు వంటివి బాల్యాన్ని చిదిమేస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. విజయనగరం జిల్లా రాజాంలో కుమారుడిని మందలించిన తల్లి దారుణ హత్యకు గురైంది. ఆనవాళ్లు లభించకుండా రక్తపు మరకలు కడిగేసి, మృతదేహాన్ని ఇంటి వెనుక పొదల్లో పడేసి.. బీరువాలోని డబ్బు, బంగారం తీసుకుని ముంబైకి పారిపోయాడు. ఎట్టకేలకు తిరుపతిలో పోలీసులకు పట్టుబడిన బాలుడిని విచారించగా ముంబైకి వెళ్లి మాఫియా గ్యాంగ్‌ల్లో చేరాలని, ఏదో ఒకరోజు డాన్‌ అవ్వడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించడంతో పోలీసులు కంగుతిన్నారు.


అబలలపై అఘాయిత్యాలు..

విశాఖపట్నంలో ఇటీవల మాట్లాడే సామర్థ్యంలేని బాలిక(11)పై ఇద్దరు మైనర్లు అఘాయిత్యానికి పాల్పడ్డారు. నంద్యాలజిల్లాలో ఎనిమిదేళ్ల బాలికను ముగ్గురు మైనర్లు రేప్‌ చేసి చంపేసి ఆనవాళ్లు చెరిపేసి శవాన్ని నీటి కాలువలో పడేశారు. పల్నాడు ప్రాంతం లో మూడో తరగతి చదువుతున్న బాలికపై అత్యాచారం, హత్య చేసి ముగ్గురు మైనర్లు అరెస్టయ్యారు. అయితే, పలు నేరాల్లో మైనర్లు ఆనవాళ్లు చెరిపేయడానికి ప్రయత్నించడం పోలీసుల్ని ఆలోచనలో పడేస్తోంది.

దొంగతనాలు.. దారిదోపిడీలు..

రాష్ట్రంలో మైనర్లపై నమోదవుతున్న కేసుల్లో ఎక్కువగా దొంగతనం కేసులే ఉంటున్నాయి. స్థానిక పోలీసులు, రైల్వే పోలీసులకు పట్టుబడుతున్న దొంగల్లో మైనర్ల సంఖ్య ఏటా పెరుగుతోంది. ఇటీవల ఏలూరు జిల్లాలోని దెందులూరు సమీపంలో బైకుపై వెళుతున్న ఒక వ్యక్తిపై ఐదుగురు కర్రలతో దాడి చేసి సెల్‌ఫోన్‌తో పాటు రూ.40 వేలు దోచుకున్నారు. పోలీసులు ఐదుగురు నిందితుల్ని అరెస్టు చేయగా వారిలో నలుగురు మైనర్లు ఉండటంతో ఆశ్చర్యపోయారు. జల్సాలకు అలవాటు పడి, మధ్యలోనే స్కూల్‌ మానేసిన వారు ఈ ఘటనకు పాల్పడినట్లు తేల్చారు. మరింత లోతుగా విచారించగా అప్పటికే ఆ గ్యాంగ్‌ 12 నేరాలకు పాల్పడినట్లు తేలింది.


గంజాయి విక్రయాల్లో..

కాకినాడలో ఇటీవల గంజాయి విక్రయాలు, దొంగతనం కేసులో ఇద్దరు బాలురిని పోలీసులు అరెస్టు చేశారు. వారినుంచి 25 కిలోల గంజాయి, రూ.19లక్షల నగదు, బైకులు స్వాధీనం చేసుకున్నారు. కాకినాడలోని సూర్యనారాయణపురం, రామకృష్ణపేటకు చెందిన బాలురు డబ్బు సంపాదించడానికి గంజాయి స్మగ్లింగ్‌ చేస్తున్నారు. పోలీసులు ఇటీవల గంజాయి విక్రయాలపై గట్టి నిఘా పెట్టి చర్యలు తీసుకోవడంతో దొంగతనాల వైపు మళ్లారు. స్థానిక గంజివారి వీధిలోని ఒక దుకాణంలో రూ.60 లక్షలు దొంగతనం చేసిన ఇద్దరినీ సీసీ ఫుటేజీ ఆధారంగా అరెస్టు చేశారు. వారిని ప్రశ్నించగా గంజాయి స్మగ్లింగ్‌ గురించి వెల్లడించారు. అప్పటికే రవాణాకు సిద్ధం చేసుకున్న 25కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. విజయవాడ, గుంటూరు, తిరుపతిలోనూ మైనర్లు గంజాయి కేసుల్లో పట్టుబడినట్లు పోలీసులు తెలిపారు.

ఏడాదిలో 726 కేసులు

దేశవ్యాప్తంగా ఏటా విడుదల చేసే కేంద్ర హోంశాఖ నేర గణాంకాల(ఎన్‌సీఆర్‌బీ) నివేదికలో ‘క్రైమ్‌ కమిటెడ్‌ జువైనల్స్‌’(బాలలు చేసిన నేరాలు) కింద వివరాలు వెల్లడించింది. రాష్ట్రంలో 2023లో మైనర్లపై 662 కేసులు నమోదు కాగా.. 2024లో ఆ సంఖ్య 726కు పెరిగిందని పేర్కొంది. వీటిలో 290 దొంగతనాలు, 14 దోపిడీలు, 325 ఆస్తి సంబంధిత కేసులు, 11 దారి దోపిడీ కేసులు నమోదయ్యాయి. నిర్లక్ష్య డ్రైవింగ్‌, ఫోర్జరీ కేసుల్లోనూ మైనర్ల సంఖ్య పెరుగుతున్నట్టు పేర్కొంది.

Updated Date - May 18 , 2026 | 05:46 AM