హంద్రీ నీవాలోనే..!
ABN , Publish Date - Sep 09 , 2026 | 01:17 AM
భక్తుల ఆకాంక్షకు అనుగుణంగా వినాయక నిమజ్జనానికి అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. ఎల్‌నినో ప్రభావం వల్ల ఆశాజనంగా వర్షాలు లేకపోవడంతో తుంగభద్ర నది ఒట్టిపోయింది.
నిమజ్జన ఏర్పాట్లు, భద్రతపై కలెక్టర్, ఎస్పీ సమీక్ష
నన్నూరు, తడకనపల్లె, ఉల్లిందకొండ వద్ద కాలువల పరిశీలన
వరుణుడు కరుణిస్తే కేసీ కెనాల్‌లోనే..
భక్తుల ఆకాంక్షలకు అనుగుణంగా సన్నాహాలు
కర్నూలు, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి): భక్తుల ఆకాంక్షకు అనుగుణంగా వినాయక నిమజ్జనానికి అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. ఎల్‌నినో ప్రభావం వల్ల ఆశాజనంగా వర్షాలు లేకపోవడంతో తుంగభద్ర నది ఒట్టిపోయింది. కేసీ కెనాల్‌కు నీటి ఆధారమైన సుంకేసుల జలాశయం అడుగంటిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో నగర నడిబొడ్డున ప్రవహించే కేసీ కాలువలో వినాయక ఘాట్ వద్ద గణనాథుల నిమజ్జనం ప్రశ్నార్థకంగా మారింది. నీటి కొరత కారణంగా కేసీ కెనాల్‌లో కాకుండా నగర శివారులో ప్రవహించే హంద్రీనీవా కాలువలో నిమజ్జనం చేయడం ఉత్తమ ప్రత్యామ్నాయ మార్గం అంటూ ‘విఘ్నేశ్వరా.. నిమజ్జనమెలా..? శీర్షికన వాస్తవర పరిస్థితులను వెలుగులోకి తెచ్చింది. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత, కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి, ఎస్పీ విక్రాంత పాటిల్‌లు గణేశ మహోత్సవ కేంద్ర సమితి సభ్యులు, వివిధ శాఖ అధికారులతో పలు దఫాలుగా చర్చలు జరిపారు. వారి నుంచి సలహాలు. సూచనలు తీసుకున్నారు. నిమజ్జనంలోగా వర్షాలు కురిసి కేసీ కెనాల్‌కు తుంగభద్ర నీటిని విడుదల చేస్తే నగర నడిబొడ్డున వినాయక ఘాట్‌లోనే నిమజ్జన మహోత్సవాలు యథావిధిగా కొనసాగిస్తారు. వానలు రాకపోతే ప్రత్యామ్నాయంగా నగర శివారులో ప్రవహించే హంద్రీనీవా కాలువలో కృష్ణమ్మ ఒడిన గణేశుడిని చేర్చే నిమజ్జన ఉత్సవాలు నిర్వహించేందుకు సన్నహాలు చేస్తున్నారు.
ఫ ఆ మూడు ప్రాంతాల్లో నిమజ్జనం
ఎల్‌నినో ప్రభావం కారణంగా తీవ్రమైన దుర్భిక్ష పరిస్థితులు తలెత్తాయి. కందనవోలు కంఠాభరంగా ప్రవహించే తుంగభద్ర నదిలో చుక్కనీరు లేక ఎడారిని తలపిస్తోంది. కర్నూలు నగర ప్రజల దాహం తీర్చే సుంకేసుల జలాశయంలో నీటి నిల్వలు పడిపోయాయి. డ్యాం పూర్తిస్థాయి సామర్థ్యం 1.235 టీఎంసీలు కాగా, మంగళవారం నాటికి 0.338 టీఎంసీలకు పడిపోయింది. అంటే.. 27 శాతం కూడా నీళ్లు లేవు. ఉన్న నీటిని నిమజ్జనానికి వాడేస్తే రాబోయే రోజుల్లో నగర ప్రజలు తీవ్ర తాగునీటి ఎద్దడిని ఎదుర్కొనే ప్రమాదం లేకపోలేదు. ఇలాంటి పరిస్థితుల్లో హంద్రీనీవా కాలువలో నిమజ్జనం చేయడం ఉత్తమ మార్గమని నిపుణులు సూచిస్తున్నారు. నగర శివారులో నన్నూరు టోల్‌పాజా, తడనకపల్లె, ఉల్లిందకొండ దగ్గర హంద్రీనీవా కాలువలో వినాయక నిమజ్జన మహోత్సవం నిర్వహించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. దీనిపై కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి, ఎస్పీ విక్రాంత పాటిల్‌లు ఏర్పాట్లు, భద్రతపై వేర్వేరుగా నగరపాలక సంస్థ, జలవనరులు, విద్యుత, రెవిన్యూ, పోలీస్ శాఖ అధికారులతో సమీక్షించారు. సాయంత్రం ఐదు గంటల తరువాత అధికారుల బృందం నన్నూరు టోల్‌ప్లాజా, తడకనపల్లె, ఉల్లిందకొండ దగ్గర హంద్రీ నీవాలో వినాయక నిమజ్జన ఉత్సవాలు నిర్వహణకు ఉన్న అనుకూల, ప్రతికూల అంశాలపై అధ్యయనం చేశారు. పక్కా ఏర్పాట్లతో పాటు పలు జాగ్రత్తలు తీసుకుంటే హంద్రీనీవా కాలువలో నిమజ్జనం చేయడమే ఉత్తమ మార్గమని పలువురు అధికారులు పేర్కొంటున్నారు.
ఫ ఈ జాగ్రత్తలు తప్పనిసరి
ఫ హంద్రీనీవా కాలువలో భారీ వినాయక విగ్రహాలను నిమజ్జనం చేయాల్సి రావడంతో నీటి ప్రవాహానికి అడ్డుంకులు ఏర్పడే అవకాశం ఉంది. నీటి ప్రవాహం ముందుకు, వెనక్కి ఎగదన్నుతోందని, ఈ ఇబ్బందులు తలెత్తకుండా అవసరాన్ని బట్టి నీటి ప్రవాహాన్ని తగ్గిస్తూ నిమజ్జన ఏర్పాట్లు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఫ ఇది పంపింగ్ కెనాల్ కావడంతో నీటి వేగానికి విగ్రహాలు కొట్టుకుపోయి పంపింగ్ స్టేషనలో మోటర్లకు అడ్డం పడకుండా వెల్దుర్తి-కోడుమూరు రోడ్డులోని వంతెన వద్ద ఇనుప జాలి ఏర్పాటు చేయాలి. అదే క్రమంలో ఆ ప్రాంతంలో భారీగా విగ్రహాలు వచ్చి చేరితే వాటిని బయటకు తీసేసేందుకు క్రేన్స ఏర్పాటు చేయాలి.
ఫ కేసీ కెనాల్‌లో విగ్రహాలను క్రేన్ల సాయంతో నిమజ్జనం చేయడం కోసం మూడు నాలుగు సిమెంట్ ప్లాట్‌ఫాంలు నిర్మించారు. అదే తరహాలో హంద్రీనీవా కాలువ వద్ద కూడా తాత్కాలిక ప్లాట్‌ఫాంలు ఏర్పాటు చేయాలి.
ఫ జాతీయ రహదారి వెంబడి విగ్రహాలతో వాహనాలను తరలించాల్సి ఉంది. ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు, ప్రమాదాలకు అవకాశాల లేకుండా రహదారి వెంబడే కాకుండా నిమజ్జన ప్రాంతాల్లో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలి.
ఫ నిమజ్జనానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు
- టీజీ భరత, రోడ్లు, భవనాల శాఖ మంత్రి
హంద్రీ నీవాలో వినాయక నిమజ్జన ఏర్పాట్లు చేస్తున్నాం. సుంకేసులలో నీటి లభ్యత లేని కారణంగా కేసీ కెనాల్‌కు నీటిని విడుదల చేసే పరిస్థితి కనిపించడం లేదు. ఈ నెల 14 వరకు మాత్రమే హంద్రీ నీవాకు నీళ్లు తీసుకునే అవకాశం ఉందని ఈ నెల 2న అధికారులు చెప్పారు. జిల్లా ఇనచార్జి మంత్రి నిమ్మల రామానాయుడు, ఇరిగేషన ఉన్నతాధికారులో చర్చించాం. ఈ రోజు నుంచి మరో 12-14 రోజులు నీటిని తీసుకోవడానికి అవకాశం ఉందని చెప్పారు. పెద్ద విగ్రహాలను కూడా నిమజ్జనం చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 5, 7వ రోజు నీటి లభ్యత ఎక్కువగా ఉంటుందని, ఈ దినాలు నిమజ్జనానికి ఎంతో అనుకూలంగా ఉంటుంది. 9వ రోజు ఎంతవరకు అనుకూలత ఉంటుంతో ఇప్పుడే అంచనా వేయలేం. నన్నూరు టోల్‌ప్లాజా, తడకనపల్లె, ఉల్లిందకొండ వద్ద మూడు ప్రాంతాల్లో హంద్రీనీవాలో నిమజ్జనానికి అనుకూలంగా ఉంటుందని, గణేశ మహోత్సవ కేంద్ర సమితి ఒక ప్రాంతాన్ని సూచిస్తే అక్కడ పూర్తిస్థాయిలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు, అసౌకార్యలు కలగకుండా కార్పొరేషన అధికారులతో ఏర్పాట్లు చేయిస్తాం. ప్రస్తుతం తలెత్తిన దుర్భిక్ష పరిస్థితుల దృష్ట్యా ప్రజలు కూడా సంపూర్ణ సహకారం అందిస్తూ అడుగు, అడుగున్నర మట్టి విగ్రహాలను ఏర్పాటు చేసుకోవాలి. ఆ విగ్రహాలను ఇంటి వద్దనే నిమజ్జనం చేసుకునే అవకాశం ఉంటుంది. భారీ విగ్రహాలను గణేశ మహోత్సవ కమిటి సూచించిన ప్రాంతంలో నిమజ్జనం చేసేలా సౌకర్యాలు కల్పిస్తున్నాం. కర్నూలులో గాయత్రి గోసేవ సమితి అధ్వర్యంలో వరుణ యాగం నిర్వహిస్తాం. వర్షాలు కురిసి సుంకేసులకు నీళొస్తే,, కేసీ కెనాల్‌లో నిమజ్జనం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఆ అవకాశం లేనందున ప్రజలు అర్థం చేసుకొని సంపూర్ణ సహకారం అందించాలి.