Share News

అది ఎర్ర బంగారమే

ABN , Publish Date - Apr 09 , 2026 | 04:40 AM

ప్రకాశం జిల్లాలోని పవిత్ర పుణ్యక్షేత్రమైన మాలకొండ శ్రీమాల్యాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పరిసరాలన్నీ ఐరన్‌ ఓర్‌తో నిండి ఉన్నట్లు నిర్ధారణ అయింది.

అది ఎర్ర బంగారమే

  • ప్రకాశం జిల్లాలో నాణ్యమైన ఇనుప ఖనిజ నిక్షేపాలు

  • అత్యంత అరుదుగా లభించే మాగ్నటైట్‌ రకంగా గుర్తింపు

  • నిర్ధారించిన జేఎస్‌డబ్ల్యూ

  • త్వరలో మైనింగ్‌కు సన్నాహాలు

  • అయ్యవారిపల్లి వద్ద షెడ్ల నిర్మాణం

  • భూ సేకరణకు యంత్రాంగం సిద్ధం

  • క్షేత్రస్థాయిలో కలెక్టర్‌ పరిశీలన

  • ‘ఆంధ్రజ్యోతి’ చెప్పిందే నిజమైంది

కందుకూరు, ఏప్రిల్‌ 8(ఆంధ్రజ్యోతి): ప్రకాశం జిల్లాలోని పవిత్ర పుణ్యక్షేత్రమైన మాలకొండ శ్రీమాల్యాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పరిసరాలన్నీ ఐరన్‌ ఓర్‌తో నిండి ఉన్నట్లు నిర్ధారణ అయింది. లింగసముద్రం, వలేటివారిపాలెం మండలాలతోపాటు పామూరు మండలంలోని ఒకటి రెండు గ్రామాల పరిధిలో కూడా ఈ నిక్షేపాలు పుష్కలంగా ఉన్నట్లు గుర్తించారు. నాణ్యమైన మాగ్నటైట్‌ రకం ఐరన్‌ఓర్‌ నిక్షేపాలు ఉన్నాయని జేఎ్‌సడబ్ల్యూ గ్రూప్‌ నిర్ధారించింది. దీంతో ఐరన్‌ ఓర్‌ తవ్వకాలకు(మైనింగ్‌) సిద్ధపడుతోంది. వలేటివారిపాలెం, లింగసముద్రం మండలాల పరిధిలో 21.87 చదరపు కిలో మీటర్ల విస్తీర్ణంలో ఐరన్‌ ఓర్‌ నిక్షేపాలు పుష్కలంగా ఉన్నాయని గతంలో నేషనల్‌ జియోగ్రాఫికల్‌ సర్వేలో తేలింది. ఈ సర్వే రిపోర్టు ఆధారంగా 2023లో అప్పటి వైసీపీ ప్రభుత్వం బిడ్డింగ్‌ నిర్వహించింది. ఈ ప్రక్రియలో జేఎ్‌సడబ్ల్యూ గ్రూప్‌(జిందాల్‌) ఐరన్‌ఓర్‌ నిక్షేపాలపై కాంపోనెంట్‌ లైసెన్సు పొందింది. ఈ లైసెన్సు ద్వారా ఐరన్‌ఓర్‌ శోధన, నాణ్యత నిర్ధారణతోపాటు ఓర్‌ను మైనింగ్‌చేసి తీసుకెళ్లే హక్కు కూడా లభిస్తుంది. దీని కోసం ముందుగా నాణ్యత నిర్ధారణ కోసం ఆ సంస్థకు ప్రభుత్వం కొన్ని భూములను కేటాయించింది. గత ఏడాదిన్నరగా జేఎ్‌సడబ్ల్యూ గ్రూప్‌ అక్కడ మైనింగ్‌ చేస్తూ ఐరన్‌ ఓర్‌ క్వాలిటీని పరీక్షిస్తోంది.


ఊహలు కాదు.. నిజం!

వలేటివారిపాలెం, లింగసముద్రం మండలాల్లో ఐరన్‌ఓర్‌ నిక్షేపాలు పుష్కలంగా ఉన్నాయని ‘ఆంధ్రజ్యోతి’ గతంలో పలు కథనాలు ప్రచురించింది. గత సంవత్సరం జూలై 25న ప్రధాన సంచికలో ‘నెల్లూరు జిల్లాలో నాణ్యమైన ఇనుప ఖనిజం’ శీర్షికన వార్త ప్రచురించింది. అయితే, ఇదంతా ఊహాజనితమని అంత నాణ్యమైన ఐరన్‌ఓర్‌ ఇక్కడ ఉండే అవకాశం లేదని అధికారులు, ప్రజాప్రతినిధులు వ్యాఖ్యానించారు. అయితే నాడు ‘ఆంధ్రజ్యోతి’ చెప్పిందే నేడు నిజమైంది. ప్రస్తుతం జేఎ్‌సడబ్ల్యూ గ్రూప్‌ ఐరన్‌ఓర్‌ మైనింగ్‌కు ఏర్పాట్లు చేసుకుంటోంది. ఇప్పటికే అయ్యవారిపల్లి కొత్తచెరువు వద్ద షెడ్ల నిర్మాణా జరుగుతున్నాయి. బుధవారం కలెక్టర్‌ రాజాబాబు, కందుకూరు సబ్‌ కలెక్టర్‌ దామెర హిమవంశీలు ఐరన్‌ఓర్‌ ఉన్న ప్రాంతాలను పరిశీలించారు. నిక్షేపాలు ఉన్న ప్రాంతంలో ప్రభుత్వ భూములు, అటవీభూములతో పాటు పెద్దఎత్తున ప్రైవేటు వ్యక్తుల పట్టాభూములు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఆ భూముల సేకరణను యుద్ధప్రాతిపదికన చేపట్టేందుకు అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. కలెక్టర్‌ రాజాబాబు వీవీపాలెం తహసీల్దార్‌ కార్యాలయంలో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసి, భూసేకరణపై చర్చించారు.


2 బ్లాక్‌లుగా అనుమతులు

ప్రస్తుతానికి జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌నకు కాంపోనెంట్‌ లైసెన్సును రెండు బ్లాక్‌లుగా మంజూరు చేశారు. లింగసముద్రం మండలం అద్దంకివారిపాలెం ఐరన్‌ఓర్‌ బ్లాక్‌ 9.14 కిలో మీటర్ల మేరకు విస్తరించి ఉండగా దీనిలో లింగసముద్రం, తిమ్మారెడ్డిపాలెం, ఆర్‌.ఆర్‌.పాలెం, జంగంరెడ్డికండ్రిక గ్రామాల పరిధిలోని కొండలు, ప్రభుత్వ, ప్రైవేటు భూములు ఉన్నాయి. అలాగే లక్ష్మక్కపల్లి నార్త్‌ ఐరన్‌ఓర్‌ బ్లాక్‌గా పరిగణిస్తున్న ప్రాంతంలో వలేటివారిపాలెం మండలంలోని చుండి, అయ్యవారిపల్లి, పోలినేనిచెరువు గ్రామాల పరిధిలోకి వచ్చే కొండలు, ఇనాం, పట్టా, ప్రభుత్వ, పోరంబోకు, అటవీ భూములు ఉన్నాయి. అలాగే పీసీపల్లి, పామూరు మండలాల్లోని కొన్ని గ్రామాల భూములు కూడా లక్ష్మక్కపల్లి నార్త్‌ఐరన్‌ఓర్‌ బ్లాక్‌ పరిధిలోకి వస్తున్నట్లు సమాచారం. లక్ష్మక్కపల్లి నార్త్‌ ఐరన్‌ఓర్‌ బ్లాక్‌ 11.94 కిలో మీటర్ల మేరకు విస్తరించి ఉంది. ఈ బ్లాక్‌ల పరిధిలో అయ్యవారిపల్లి కొండలు కూడా ఉన్నాయి. మరోవైపు, ఇక్కడి వందలాది ఎకరాల భూమిని అటు అటవీ, ఇటు రెవెన్యూ శాఖలు మాది కాదంటే మాదికాదని చెబుతున్న తరుణంలో అక్కడ కూడా ఐరన్‌ఓర్‌ ఉందన్నది చర్చనీయాంశంగా మారింది.


అత్యంత నాణ్యం

ఇక్కడి ఐరన్‌ ఓర్‌ అత్యంత నాణ్యమైందని నిర్ధారించారు. ఐరన్‌ఓర్‌లో మాగ ్నటైట్‌, హెమటైట్‌, లైమోనైట్‌, సైడ్‌రైట్‌ అనే 4 రకాలు ఉంటాయి. వీటిలో మాగ్నటైట్‌ రకాన్ని నేరుగా ఇనుము తయారీకి ఉపయోగించవచ్చు. ఈ రకంలో 75శాతం వరకు ఐరన్‌ ఓర్‌ ఉంటుంది. ఫలితంగా మైనింగ్‌ కూడా తక్కువ ఖర్చుతో పూర్తవుతుంది. మిగిలిన రకాలలో ఐరన్‌కంటెంట్‌ తక్కువగా ఉంటుంది. ఇనుము తయారీ ప్రక్రియలో రకరకాల పదార్థాలను సమ్మిళితం చేసి ఐరన్‌గా మార్చుకోవాల్సి ఉంటుంది. అయితే, ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఉన్నది మాగ్నటైట్‌ రకం కావడంతో మైనింగ్‌ ప్రక్రియను వేగంగా ప్రారంభించుకునేందుకు జేఎ్‌సడబ్ల్యూ గ్రూప్‌ సన్నద్ధమవుతోంది. సాధారణంగా భూమట్టం నుంచి కనీసం 40, 50 మీటర్ల లోతుకు వెళ్తే తప్ప ఐరన్‌ఓర్‌ లభించదు. కానీ, ఇక్కడ పదిమీటర్ల లోతు నుంచే నాణ్యమైన ఐరన్‌ఓర్‌ నిక్షిప్తమై ఉంది. భూమిలోపలకు రమారమి 200 మీటర్ల వరకు కూడా కొన్నిప్రాంతాలలో ఓర్‌ ఉండడంతో భారీ నిక్షేపాల ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.

Updated Date - Apr 09 , 2026 | 04:42 AM