ఎల్‌నినో పేరిట.. బియ్యం ధరలు పెంచేశారు!
ABN , Publish Date - Jul 23 , 2026 | 05:13 AM
ఎల్‌నినో ప్రభావం రాష్ట్రంలో తీవ్రస్థాయికి చేరుకోకపోయినా.. వ్యాపారులు నిత్యావసరాల ధరలను ముందే పెంచేశారు. ముఖ్యంగా బియ్యం ధరను కిలోకి రూ.4-5 చొప్పున క్వింటాకు రూ.400-500 పెంచేశారు.
క్వింటాకు రూ.500 పెరుగుదల
పప్పులు, నూనెల ధరలూ పైకే!
కరువు ప్రచారాన్ని సొమ్ము చేసుకుంటున్న వ్యాపారులు
అమరావతి, జూలై 22(ఆంధ్రజ్యోతి): ఎల్‌నినో ప్రభావం రాష్ట్రంలో తీవ్రస్థాయికి చేరుకోకపోయినా.. వ్యాపారులు నిత్యావసరాల ధరలను ముందే పెంచేశారు. ముఖ్యంగా బియ్యం ధరను కిలోకి రూ.4-5 చొప్పున క్వింటాకు రూ.400-500 పెంచేశారు. ఎల్‌నినో తీవ్ర రూపం దాల్చి, వర్షాలు కురవక, పంటలు సరిగ్గా పండకపోతే.. దాని ప్రభావం వచ్చే ఏడాది ఉంటుంది. కానీ కొందరు వ్యాపారులు అప్పుడే ఏదో కరువు వచ్చేసినట్లు.. వరి పండనట్టు, ధాన్యం ఉత్పత్తి కానట్టు.. బియ్యం నిల్వలు తరిగిపోయినట్టు.. అప్పుడే బియ్యం ధరలు పెంచేశారు. దీనికి ఎల్‌నినోనే కారణమని కొందరు చెప్తున్నారు. సోనామసూరి/ బీపీటీ రకాలు 25 కిలోల బియ్యం బస్తా రూ.1,450 నుంచి రూ.1,550కు పెంచారు. ఈవిధంగా ఏ రకం బియ్యమైనా 25కిలోల బస్తాకు రూ.100 చొప్పున పెంచేశారు. వాస్తవంగా రాష్ట్రంలోని రైతుబజార్లలో గత నెల నుంచి ఇప్పటివరకు బీపీటీ బియ్యం కిలో రూ.48, నాన్ బీపీటీ రూ.44, బీపీటీ ముడి బియ్యం రూ.48, 1061 రూ.36, 1010, 1075 రకాలు రూ.32 ఉన్నాయి. కానీ వ్యాపారులు మాత్రం ధరలు పెంచి అమ్ముతున్నారు. రాష్ట్ర అర్థ గణాంక, ప్రణాళిక శాఖ నెలవారీగా సేకరించే సమాచారం ప్రకా రం గత మే నెలలో రాష్ట్ర సగటు ధరల్లో గ్రేడ్-1 సూపర్‌ఫైన్ రకం బియ్యం కిలో రూ.60.34, ఫైన్ రకం రూ.53.26, సాధారణ రకం రూ.43.05 ఉంది. గతేడాది మేతో పోల్చితే ఫైన్ క్వాలిటీ బియ్యం ధర మాత్రమే స్వల్పంగా పెరిగి, సూపర్‌ఫైన్, కామన్ రకాల ధరలు స్వల్పంగా తగ్గాయి.
ఎల్‌నినో పరిస్థితులపై ప్రతి వారం సమీక్ష
రాష్ట్రంలో ఎల్‌నినో పరిస్థితులపై అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్ ఆదేశించారు. వ్యవసాయ, అనుబంధ శాఖల ఉన్నతాధికారులు, వ్యవసాయ, ఉద్యాన, మత్స్య, పశువైద్య విశ్వవిద్యాలయాల శాస్త్రవేత్తలు, అధికారులతో వారాకోసారి సమావేశమై, ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు సూచనలు, సిఫారసులతో నివేదికలు అందించాలని స్పష్టం చేశారు. బుధవారం రాష్ట్ర సచివాలయంలో వ్యవసాయ అనుబంధ శాఖల విభాగాధిపతులతో ఎల్‌నినో పరిస్థితులపై ఆయన సమీక్ష నిర్వహించారు. పంటల విస్తీర్ణం, వర్షపాతం, ప్రాజెక్టులు, కాలువలు, జలాశయాల్లో సాగునీటి లభ్యత వంటి వివరాలను ఏకీకృతం చేసి, కంటింజెన్సీ ప్లాన్ తయారు చేయాలని సూచించారు. ఎల్‌నినో వల్ల హైరిస్క్ ఉన్న 1,357 రైతు సేవా కేంద్రాల పరిధిలో ప్రీ-మాన్సూన్ డ్రైస్పెల్ విధానం ద్వారా 365 రోజులు పశుగ్రాస లభ్యత ఉండేలా, విత్తన గుళికలు అందుబాటులో ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు.