Rice Millers Scam: పేదల బియ్యంతో మిల్లర్ల మాయ
ABN , Publish Date - Jan 01 , 2026 | 05:28 AM
రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లు (ప్రొక్యూర్‌మెంట్) చేపట్టకముందు, రైసు మిల్లులను నడపలేక అనేకమంది యజమానులు దివాలా తీశారు.
సీఎంఆర్ ప్రక్రియలో యథేచ్ఛగా దోపిడీ
ప్రభుత్వం ఇచ్చిన ధాన్యం ఎక్కువకు అమ్మకం
పీడీఎ్‌సకు పురుగులతో కూడిన నాసిరకం బియ్యం
పాత రేషన్ బియ్యాన్నే రీసైక్లింగ్ చేసినట్లు నిర్ధారణ
తూర్పుగోదావరి జిల్లాలో వెలుగుచూసిన బాగోతం
ఉండ్రాజవరంలో 80 టన్నుల బియ్యం తిరస్కరణ
ఈ వ్యవహారంపై ఏలూరు ఎఫ్‌సీఐ డీఎం నివేదిక
ఆ మిల్లుల ఓనర్లకు జేసీ షోకాజ్ నోటీసు
రాష్ట్రంలో కొందరు రైసు మిల్లర్లు పేదల నోట్లో మట్టి కొడుతున్నారు. ప్రతినెలా పేదలకు ఉచితంగా రేషన్ బియ్యాన్ని అందించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి మద్దతు ధరకు కొనుగోలు చేసి, కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) కోసం ఇస్తున్న మేలు రకం ధాన్యాన్ని ముందే ఎక్కువ ధరకు అమ్మేసుకుని సొమ్ము చేసుకుంటున్నారు. తర్వాత తీరిగ్గా తక్కువ ధరకు వచ్చే, తినడానికి పనికిరాని నాసిరకం బియ్యాన్ని ‘సీఎంఆర్’ కింద ప్రభుత్వానికి అంటగడుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలంలో తాజాగా వెలుగుచూసిన అక్రమాల బాగోతం ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ.
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లు (ప్రొక్యూర్‌మెంట్) చేపట్టకముందు, రైసు మిల్లులను నడపలేక అనేకమంది యజమానులు దివాలా తీశారు. ‘సీఎంఆర్’ కార్యకలాపాలు మొదలయ్యాక వారే ఇప్పుడు కోట్లకు పడగలెత్తారు. రాజకీయాలు, రియల్ ఎస్టేట్, కన్‌స్ట్రక్షన్స్ తదితర రంగాల్లో రారాజుల్లా వెలుగొందుతూ ప్రభుత్వాలనే శాసించే స్థాయికి ఎదిగారు. అయినా.. ప్రభుత్వ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగాలు పట్టించుకోకుండా చోద్యం చూస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉదాహరణకు తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలంలోని విజయశ్రీ రైస్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం.... ఈ ఖరీఫ్ సీజన్‌కు సంబంధించిన సీఎంఆర్ కార్యకలాపాల కోసం పెరవలిలోని శ్రీ మారుతి రైస్ ప్రోడక్ట్స్, శ్రీ విజయ సత్యదేవ ట్రేడర్స్ (రైసు మిల్లులు) పేర్ల మీద బ్యాంక్ గ్యారంటీ కట్టి పౌరసరఫరాల సంస్థతో అవగాహన ఒప్పందం చేసుకుంది. ‘విజయశ్రీ’కి తూర్పుగోదావరి జిల్లా నుంచి 6,046 టన్నులు, అల్లూరి జిల్లా నుంచి 407 టన్నులు, కృష్ణా జిల్లా నుంచి 850 టన్నులు కలిపి...మొత్తం 7,305 టన్నుల ధాన్యాన్ని సీఎంఆర్ కోసం పౌరసరఫరాల సంస్థ కేటాయించింది.
నిబంధనల ప్రకారం ధాన్యాన్ని స్వీకరించిన తేదీ నుంచి వారం రోజుల్లోపు మిల్లింగ్‌ను ప్రారంభించి.. రెండు నెలల్లోపు కస్టమ్ మిల్లింగ్‌ను పూర్తి చేసి 67 శాతం బియ్యాన్ని ప్రభుత్వానికి సీఎంఆర్‌గా అందజేయాలి. అయితే ప్రభుత్వం నుంచి మొత్తం 7,305 టన్నుల ధాన్యాన్ని తీసుకున్న ‘విజయశ్రీ’.. ఇప్పటివరకు కేవలం 1,071 టన్నుల బియ్యాన్ని మాత్రమే ప్రభుత్వానికి డెలివరీ ఇచ్చింది. ఈ కస్టమ్ మిల్లింగ్ రైస్‌ను పీడీఎస్ అవసరాల కోసం నిల్వ చేయడానికి తాడేపల్లిగూడెం సమీపంలోని పెన్నాడలో ఉన్న ఎఫ్‌సీఐ గోడౌన్(బఫర్ స్టోరేజ్ కాంప్లెక్స్)కు తరలించారు.
87 టన్నుల బియ్యం వెనక్కి...
పెన్నాడలో ఉన్న భారత ఆహార సంస్థ గోడౌన్‌కు తరలించిన బియ్యాన్ని పరిశీలించిన ఎఫ్‌సీఐ అధికారులు నివ్వెరపోయారు. అవి తాజాగా మిల్లింగ్ చేసిన బియ్యం కాదని గుర్తించారు. పైగా ఆ ముడి బియ్యంలో ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్స్‌తోపాటు పురుగులు ఉన్నట్టు కనుగొన్నారు. మిక్స్‌డ్ ఇండికేటర్ మెథడ్ (ఎంఐఎం) పరీక్షలో కూడా ఆ బియ్యం విఫలం కావడంతో.. మొత్తం 3 ఏసీకేల (87 టన్నులు) బియ్యాన్ని తిరస్కరించారు. మిల్లర్లు నాన్ ఫోర్టిఫైడ్ సీఎంఆర్ బియ్యాన్ని మాత్రమే డెలివరీ చేయాల్సి ఉండగా, విజయశ్రీ రైస్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ డెలివరీ చేసిన సీఎంఆర్‌లో ఫోర్టిఫైడ్ కెర్నల్స్ ఉన్నాయి. దీంతో రేషన్ బియ్యాన్నే రీసైక్లింగ్ చేసి సీఎంఆర్‌గా డెలివరీ చేస్తున్నట్లు ఎఫ్‌సీఐ అధికారులు తేల్చారు. ప్రభుత్వం ఇచ్చిన ధాన్యాన్ని మిల్లింగ్ చేయకుండా.. పురుగులు పట్టిన పాత రేషన్ బియ్యాన్ని తక్కువ ధరకు సేకరించి.. వాటినే నేరుగా ప్రభుత్వానికి ఈ ఖరీఫ్ సీజన్‌లో సీఎంఆర్‌గా డెలివరీ చేసినట్లుగా నిర్ధారించారు. ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం ప్రకా రం నిబంధనలు, షరతులను ఉల్లంఘించడమనేది భారత న్యాయ సంహిత (బీఎన్‌ఎస్) చట్టం సెక్షన్ 318 కింద ‘దుష్ప్రవర్తన’ నేరానికి పాల్పడినట్టు. దీని ప్రకారం, సదరు మిల్లర్‌ను ఐదు సంవత్సరాలపాటు బ్లాక్‌లిస్టులో ఉంచడంతోపాటు క్రిమినల్ చర్యలకు బాధ్యత వహించాల్సి ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. పీడీఎస్ బియ్యాన్ని రీ సైక్లింగ్ చేసినట్లు తేలితే బ్యాంక్ గ్యారంటీని కూడా ప్రభుత్వం జప్తు చేస్తుందని తెలిపారు. ఈ వివరాలన్నింటినీ పొందుపరుస్తూ ఏలూరు ఎఫ్‌సీఐ డీఎం ఇచ్చిన నివేదిక ఆధారంగా తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ వై. మేఘా స్వరూప్.. విజయశ్రీ రైస్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యానికి షోకాజ్ నోటీసు జారీ చేశారు. ప్రభుత్వం నుంచి తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు ఎఫ్‌సీఐకి సీఎంఆర్ డెలివరీని నిలిపివేయాలని ఆదేశించారు.
అంతటా ఇదే తంతు...
రేషన్ బియ్యాన్ని రైసుమిల్లర్లు తక్కువ ధరకు కొనుగోలు చే సి.. మరోసారి పాలిష్ పట్టించి, సీఎంఆర్ కింద రీసైక్లింగ్ చేయడమనేది ఏళ్లతరబడి అనేక మిల్లుల్లో యథేచ్ఛగా కొనసాగుతోం ది. వరి ఎక్కువగా సాగుచేసే తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కోనసీమ, కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, విజయనగ రం జిల్లాలతోపాటు ఇటు ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల తదితర జిల్లాల్లోని పలువురు రైసు మిల్లర్లు ఎడాపెడా అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రేషన్ కార్డుదారుల నుంచి కేజీ పది రూపాయలు చొప్పున కొనుగోలు చేస్తున్న రేషన్ బియ్యాన్ని అక్రమ మార్గాల్లో రైసుమిల్లులకు తరలించి రీసైక్లింగ్ చేస్తూ రూ.కోట్లలో లాభాలు ఆర్జిస్తున్నారు.
నిబంధనలను అమలు చేసేవారేరీ?
రాష్ట్రంలో ప్రజాపంపిణీ, ఇతర సంక్షేమ పథకాలకు అవసరమైన బియ్యాన్ని ఇంతకు ముందు మిల్లర్లు, వ్యాపారుల నుంచి ప్రభుత్వం లెవీ కింద సేకరించేది. ఈ విధానం వల్ల రైతులకు గిట్టుబాటు ధర లభించక తీవ్రంగా నష్టపోతున్నారనే ఫిర్యాదుల నేపథ్యంలో.. కేంద్రం సరికొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. రైతులకు కనీస మద్దతు ధర(ఎంఎ్‌సపి) నిర్ణయించి, మిల్లర్లు, దళారుల ప్రేమయం లేకుండా నేరుగా రాష్ట్ర ప్రభుత్వాలే ధాన్యా న్ని సేకరించేలా కఠినమైన నిబంధనలు విధిస్తూ మార్గదర్శకాలు జారీ చేసింది. ధాన్యం సేకరణలో ఎక్కడా అక్రమాలకు తావు లేకుండా రైతులకు మేలు చేయడం దీని లక్ష్యం. ఈ క్రమంలో పలు నిబంధనలను జారీ చేసింది. అయితే.. ఈ నిబంధనలు అమలు చేసేవారు లేకపోవడంతో రైతులకు న్యాయం జరగడం లేదన్న వాదన బలంగా వినిపిస్తోంది.
గన్నీలపై మిల్లు కోడ్
రైసు మిల్లుల సామర్థ్యాన్ని పరిగణనలోకి తీసుకుని మాత్రమే కస్టమ్ మిల్లింగ్‌కు ధా న్యాన్ని కేటాయించాలి. అది కూడా సార్టెక్స్, బ్లెండింగ్ యంత్రాలు ఏర్పాటు చేసిన మిల్లులకు మాత్రమే సీఎంఆర్ ఇవ్వాలి. ధాన్యం సేకరణకు అవసరమైన గన్నీలను సమీకరించే బాధ్యతలను జిల్లా రైసు మిల్లర్స్ అసోసియేషన్‌లకు అప్పగించాలని కేంద్రం పేర్కొంది. ప్రతి గోనెసంచిపై సంబంధిత మిల్లు కోడ్‌ను ముద్రించాలి. ఒకసారి ఉపయోగించిన గన్నీలనే మళ్లీ మళ్లీ వినియోగించకుండా వాటి నాణ్యతను ఎక్కడికక్కడ సబ్ కలెక్టర్లు, ఆర్డీవోలు నిత్యం పరిశీలించాలి.
బ్యాంకు గ్యారంటీ సైతం జప్తు
సీఎంఆర్ రైస్‌ను సకాలంలో అందించడంలో విఫలమైన మిల్లర్లకు పెనాల్టీ విధించడంతోపాటు ప్రభుత్వానికి జరిగిన నష్టం, బకాయిలు మొత్తాన్ని రికవరీ చేయాలి. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసే మిల్లర్లను బ్లాక్‌లిస్టులో పెట్టాలి. సీఎంఆర్ బకాయిలకు సమానమైన జరిమానా విధించాలి. వారి బ్యాంకు గ్యారంటీని జప్తు చేయాలి. ఈ నేరాలకు పాల్పడిన మిల్లర్లపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. కానీ ఈ నిబంధనలను అమలు చేసేవారు లేక.. మిల్లర్లు, దళారుల దందాలు సాగుతున్నాయి.