Share News

‘ద్వారంపూడి’ పెత్తనానికి చెక్‌!

ABN , Publish Date - Mar 28 , 2026 | 05:41 AM

కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండటంతో రాష్ట్ర రైస్‌ మిల్లర్ల అసోసియేషన్‌కు నూతన అధ్యక్షుడిని ఎన్నుకోవాలనే ప్రతిపాదనను ఓ వర్గం తెరమీదకు తీసుకువచ్చింది.

‘ద్వారంపూడి’ పెత్తనానికి చెక్‌!

రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌కు నూతన అధ్యక్షుడిని ఎన్నుకోవాలనే ప్రతిపాదన

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండటంతో రాష్ట్ర రైస్‌ మిల్లర్ల అసోసియేషన్‌కు నూతన అధ్యక్షుడిని ఎన్నుకోవాలనే ప్రతిపాదనను ఓ వర్గం తెరమీదకు తీసుకువచ్చింది. కొత్త అధ్యక్షుడికి ఎన్నుకోవడం ద్వారా ఏళ్లుగా సంఘంలో పెత్తనం చెలాయిస్తున్న వైసీపీకి చెందిన ద్వారంపూడి కుటుంబానికి చెక్‌ పెట్టాలని యోచిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మిల్లర్లు, పార్టీలకు అతీతంగా నేతల మద్దతు కూడగట్టే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇదే సమయంలో ద్వారంపూడి కుటుంబం అందుకు వ్యతిరేకంగా ప్రయత్నాలు చేస్తోంది. నూతన అధ్యక్షుడిగా పోటీకి సిద్ధమవుతున్న వ్యక్తిని ప్రస్తుత జిల్లా పదవి నుంచి దించేసి.. రాష్ట్ర పదవికి పోటీ చేయడానికి అనర్హుడిగా చేయాలని పావులు కదుపుతోంది. తమ చెప్పుచేతల్లో ఉండే వ్యక్తిని అధ్యక్షుడిగా నిలబెట్టేందుకు మద్దతు కూడగడుతున్నట్లు చెబుతున్నారు. తద్వారా సంఘంలో తమ ఆధిపత్యానికి తిరుగులేదని నిరూపించుకోవడంతోపాటు కాకినాడ పోర్టుపై అనాదిగా ఉన్న తమ అజమాయిషీకి భంగం వాటిల్లకుండా చూసుకోవాలనేది ద్వారంపూడి కుటుంబం లక్ష్యంగా కనబడుతోంది. కూటమి ప్రభుత్వంలోనూ కాకినాడ పోర్టుపై అధిపత్యం చెలాయిస్తుండటం, రాష్ట్రంలో ఏ రైసు మిల్లుకు ఎంత సీఎంఆర్‌ ధాన్యం కేటాయించాలనే విషయంలో కూడా ద్వారంపూడి కుటుంబమే చక్రం తిప్పుతుండటాన్ని జీర్ణించుకోలేకపోతున్న అసోసియేషన్‌లోని ఓ వర్గం ‘ఇది కూటమి ప్రభుత్వమా? వైసీపీ ప్రభుత్వమా? అంటూ ప్రశ్నిస్తోంది.


బియ్యం స్మగ్లింగ్‌తో వేల కోట్లు దోపిడీ!

కాకినాడకు చెందిన రైస్‌ మిల్లర్‌ ద్వారంపూడి భాస్కరరెడ్డి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, రాష్ట్ర రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్లకు అధ్యక్షుడిగా దశాబ్దాలపాటు పనిచేశారు. ఆయన పెద్ద కుమారుడు ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి 2019లో వైసీపీ నుంచి కాకినాడ సిటీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత ప్రభుత్వం భాస్కరరెడ్డిని సివిల్‌ సప్లయిస్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా నియమించింది. దాంతో భాస్కరరెడ్డి చిన్న కుమారుడు వీరభద్రారెడ్డి తూర్పుగోదావరి జిల్లా రైస్‌ మిల్లర్స్‌ సంఘంతోపాటు రాష్ట్ర అసోసియేషన్‌ అధ్యక్షుడిగా పనిచేశారు. వైసీపీ ప్రభుత్వ అండదండలతో కాకినాడ పోర్టును పూర్తిగా గుప్పిట్లోకి తీసుకుని లక్షల టన్నుల రేషన్‌ బియ్యాన్ని ఇతర దేశాలకు స్మగ్లింగ్‌ చేయడం ద్వారా రూ.వేల కోట్లు దోపిడీ చేశారనే ఆరోపణలున్నాయి. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పోర్టు నుంచి ఎగుమతి అవుతున్న 640 టన్నుల రేషన్‌ బియ్యాన్ని అధికారులు పట్టుకున్నారు.


ఇప్పటికీ వారి కనుసన్నల్లోనే..

ఆ తర్వాత ద్వారంపూడి కుటుంబం కొంత సైలెంట్‌ అయినప్పటికీ.. పోర్టు ద్వారా రేషన్‌ బియ్యం స్మగ్లింగ్‌ కార్యకలాపాలు ఇప్పటికీ వారి కనుసన్నల్లోనే సాగుతున్నాయి! ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వంలోనూ వారి ఆధిపత్యాన్ని జీర్ణించుకోలేకపోతున్న మిల్లర్స్‌ అసోసియేషన్‌లోని ఒక బలమైన వర్గం కొత్త నాయకత్వ ప్రతిపాదనను తెరమీదకు తీసుకువచ్చింది. కూటమి పెద్దల నుంచి సానుకూల స్పందన రావడంతో, ప్రస్తుతం కాకినాడ రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తినే.. రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీకి చెందిన ఓ మాజీ మంత్రి, పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీకి చెందిన మరో మాజీ మంత్రితో పాటు రైసు మిల్లులు ఎక్కువగా ఉన్న శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని ఎమ్మెల్యేలు, వైసీపీకి చెందిన కొంతమంది మాజీ ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టుకుని, మెజార్టీ మిల్లర్లను తమ వైపు తిప్పుకునేందుకు ముందుకు సాగుతోంది.

పోటీ పడే వ్యక్తికి వ్యతిరేకంగా కుట్రలు

దశాబ్దాలుగా ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా.. కనుసైగలతో రైస్‌ మిల్లర్లను శాసిస్తూ వస్తున్న ద్వారంపూడి కుటుంబం నేరుగా పోటీకి దిగకపోయినా, రాష్ట్ర అసోసియేషన్‌ అధ్యక్షుడిగా తమ అనుకూలమైన వ్యక్తే ఉండాలని కోరుకుంటుంది. ఈ క్రమంలో అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న కాకినాడ జిల్లా అసోసియేషన్‌ అధ్యక్షుడిపై తమ వర్గానికి చెందిన మిల్లర్ల మద్దతుతో అవిశ్వాసం ప్రకటింపజేసి.. ఆయనను జిల్లా పదవి నుంచి తొలగిస్తే.. రాష్ట్ర అధ్యక్షుడిగా పోటీ పడే పరిస్థితే ఉండదన్న ఉద్దేశంతో భాస్కరరెడ్డి ప్రయత్నాలు చేసినట్లు సమాచారం.

Updated Date - Mar 28 , 2026 | 05:43 AM