నాణ్యత ‘రివర్స్’
ABN , Publish Date - May 08 , 2026 | 05:33 AM
గత వైసీపీ ప్రభుత్వంలో తిరుమలకు కల్తీ నెయ్యి సరఫరా వ్యవహారంలో నాటి పాలకుల తప్పిదాలను ఇప్పటికే సిట్ తన నివేదికలో స్పష్టం చేయగా...
కల్తీ నెయ్యి సరఫరాకు అవకాశం కల్పించారు
అసాధారణంగా ధరలు తగ్గించారు
స్వచ్ఛమైన నెయ్యి సరఫరా అసాధ్యమని
తెలిసీ అధికారులు అప్రమత్తం కాలేదు
నాణ్యత కంటే ధరకే ప్రాధాన్యం ఇచ్చారు
బిడ్‌లో వైష్ణవి కోట్ చేసిన ధర కిలోకు రూ.511
తర్వాత రూ.471 ధరకు టెండరు ఖరారు
అనేకసార్లు టెండరు నిబంధనల ఉల్లంఘన
నివేదికలో స్పష్టం చేసిన ఏకసభ్య కమిషన్
తిరుపతి(టీటీడీ), మే 7 (ఆంధ్రజ్యోతి): గత వైసీపీ ప్రభుత్వంలో తిరుమలకు కల్తీ నెయ్యి సరఫరా వ్యవహారంలో నాటి పాలకుల తప్పిదాలను ఇప్పటికే సిట్ తన నివేదికలో స్పష్టం చేయగా... రివర్స్ టెండరింగ్ ద్వారా కల్తీ నెయ్యి సరఫరాకు అవకాశం కల్పించినట్లైందని తాజాగా మాజీ సీఎస్ దినేశ్ కుమార్ నేతృత్వంలోని ఏకసభ్య కమిషన్ సైతం అభిప్రాయపడింది. ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో కల్తీ నెయ్యి సరఫరాకు దోహదపడిన పలు అంశాలను దినేశ్ కుమార్ ప్రస్తావించారు. తక్కువ ధరలకు స్వచ్ఛమైన నెయ్యి సరఫరా చేయడం అసాధ్యమని తెలిసి అధికారులు ముందుగానే అప్రమత్తమై ఉంటే కల్తీని అరికట్టేందుకు ఆస్కారం ఉండేదని అభిప్రాయపడ్డారు. రివర్స్ టెండర్లలో ధరలు అనూహ్యంగా తగ్గిపోయినట్లు ఆయన గుర్తించారు. కొన్ని చోట్ల కిలోకు ఏకంగా రూ.207 వరకు ధర పడిపోయిందని నివేదికలో ప్రస్తావించారు. మార్కెట్‌లో ఉన్న ముడిపదార్థాల ధరలతో పోలిస్తే ఇంత తక్కువ ధరకు కోట్ చేయడం ఏ మాత్రం వాస్తవికమైనది కాదని అభిప్రాయపడ్డారు. ఎల్1 (అతి తక్కువ ధరకు టెండర్లు దాఖలు చేసిన) వారిపై అతిగా ఆధారపడటం వల్ల అనేకసార్లు చాలా తక్కువ ధరలకు అంగీకరించాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. నాటి కొనుగోలు ప్రక్రియను పరిశీలిస్తే నాణ్యత కంటే ధర తగ్గించడం, సరఫరా ఆగిపోకుండా చూడడానికి మాత్రమే అధిక ప్రాధాన్యం ఇచ్చినట్లు స్పష్టమవుతోందని పేర్కొన్నారు. రివర్స్ టెండరింగ్‌లో ఇంత భారీగా ధరలు తగ్గడం ఆర్థికంగా, ఉత్పత్తి పరంగా సాధ్యమేనా అనే అంశాలపై కనీసం ఆలోచన చేయలేదని దుయ్యబట్టారు. ఆ ధరలను అంగీకరించేముందు లోతైన పరిశీలన చేసి ఉండాల్సిందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ఆర్థిక బిడ్ తర్వాతా సంప్రదింపులు
టెండరు నిబంధనల్లో సంప్రదింపులకు ఎటువంటి తావులేదని స్పష్టంగా ఉంది. అయితే ఆర్థిక బిడ్లు ముగిసిన తర్వాత కూడా లెటర్లు, ఈ-మెయిళ్ల ద్వారా సవరించిన ధరలను అంగీకరించిన సందర్భాలు ఉన్నాయని తన నివేదికలో దినేశ్ కుమార్ పేర్కొన్నారు. పలు సందర్భాల్లో రివర్స్ టెండరింగ్ పూర్తయిన తర్వాత కూడా లెటర్ల ద్వారా తుది ధరలను తగ్గించారని తెలిపారు. ఇది టెండరు నిబంధనలను పూర్తిగా ఉల్లంఘించినట్లు అవుతుందని స్పష్టం చేశారు. 2022 మే 10న ఏపీ డెయిరీ నుంచి ట్యాంకర్ల ద్వారా 5.50 లక్షల కిలోల నెయ్యి కొనుగోలుకు టెండర్లు పిలిచారు.
ఈ సమయంలో వైష్ణవి డెయిరీ ఒక్కటి మాత్రమే టెండర్లలో పాల్గొన్నది. ఆ టెండరును రద్దు చేసి మరోమారు పిలిచి 2022 జూన్ 30న తెరవగా వైష్ణవి డెయిరీ ఒక్కటి మాత్రమే పాల్గొంది. కిలో నెయ్యి ధర రూ.511కు సరఫరా చేసేందుకు బిడ్ దాఖలు చేసింది. ఒకే బిడ్ వచ్చినప్పుడు రివర్స్ ఆక్షన్ నిర్వహించకూడదనే పద్ధతిని టీటీడీ అనుసరిస్తోంది. అయినప్పటికీ ఆర్థిక బిడ్ తెరిచిన తర్వాత తాము కిలో నెయ్యిని రూ.471కు సరఫరా చేస్తామంటూ వైష్ణవి డెయిరీ టీటీడీకి ఈ-మెయిల్ పంపింది. 5.50 లక్షల కిలోల నెయ్యిని రూ.471 ధర చొప్పున సరఫరా చేసేందుకు టెండరు దక్కించుకుంది. ఇలా అనేక సందర్భాల్లో టెండరు నిబంధనలు ఉల్లంఘించినట్లు నివేదికలో స్పష్టంగా పొందుపర్చారు. అధికారులు టెండరు ప్రక్రియ పారదర్శకతను దెబ్బతీయడమే కాకుండా పవిత్రత, విశ్వసనీయతను దెబ్బతీశారని అభిప్రాయపడ్డారు.