Share News

రెవెన్యూలో ఇంటిదొంగ

ABN , Publish Date - Feb 26 , 2026 | 05:09 AM

‘ఏడాదిలో రెవెన్యూ శాఖను ప్రక్షాళన చేస్తా.. ప్రజల ఆస్తులు, భూములకు జవాబుదారీగా ఆ శాఖ ఉండేలా చేస్తా’ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు కొంతకాలంగా చెబుతున్నారు.

రెవెన్యూలో ఇంటిదొంగ

  • 500 కోట్ల విలువైన భూముల్ని ప్రైవేటుపరం చేసే పన్నాగం

  • తిరుపతి శెట్టిపల్లి ఎస్టేట్‌ భూముల్లోని 40 ఎకరాలపై ప్రైవేటు వ్యక్తుల కన్ను

  • పట్టాల ప్రతిపాదనలు తిరస్కరించిన జేసీ

  • సెటిల్‌మెంట్‌ డైరెక్టర్‌ వద్ద అప్పీలు

  • తప్పుదోవ పట్టించేలా ఓ అధికారి ఫైలు

  • జేసీ ఉత్తర్వులు తిరస్కరించేలా ప్రతిపాదనలు

  • చివరి నిమిషంలో గుర్తించిన ఉన్నతాధికారి

  • బాధ్యుడిపై సస్పెన్షన్‌కు చర్యలు

  • అడ్డుకునేలా మరో అధికారి బేరసారాలు

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

‘ఏడాదిలో రెవెన్యూ శాఖను ప్రక్షాళన చేస్తా.. ప్రజల ఆస్తులు, భూములకు జవాబుదారీగా ఆ శాఖ ఉండేలా చేస్తా’ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు కొంతకాలంగా చెబుతున్నారు. ఈ దిశగా సంస్కరణలు చేపట్టారు. కానీ అవినీతి, అడ్డగోలు అక్రమాలకు అలవాటు పడిన కొందరు అధికారులు ప్రభుత్వ ప్రయోజనాలను, విలువైన భూములను పణంగా పెడుతూనే ఉన్నారు. తిరుపతి రూరల్‌ మండలంలో శెట్టిపల్లి గ్రామం ఉంది. ఇది ఒకప్పుడు ఎస్టేట్‌ విలేజ్‌. తిరుపతి పట్టణానికి అతి సమీపంలో ఉంది. ఇక్కడ ఎకరా కనీసం రూ.12-15 కోట్ల పైమాటే. ఇక్కడ 380 ఎకరాలకు పైగా భూములపై వివాదం ఉంది. 1948లో ఎస్టేట్‌ల రద్దు చట్టం వచ్చింది. దీని ప్రకారం ఈ గ్రామంలో ఎస్టేట్‌ భూముల్లోని సాగుదారులను గుర్తించి రైత్వారీ పట్టాలు ఇవ్వాలి. జిల్లా స్థాయిలో జాయింట్‌ కలెక్టర్‌ సెటిల్‌మెంట్‌ అధికారి. రాష్ట్రస్థాయిలో సర్వే, సెటిల్‌మెంట్‌ కమిషనర్‌ ఉంటారు. జిల్లా స్థాయిలో సెటిల్‌మెంట్‌ అధికారి ఇచ్చే ఆదేశాలు రైతులకు నచ్చకపోతే రాష్ట్రస్థాయిలో సెటిల్‌మెంట్‌ కమిషనర్‌ వద్ద అప్పీల్‌ చేసుకోవాలి. ఇదీ చట్టం చెబుతున్న విధానం. 45 ఏళ్లుగా ఇక్కడి భూములపై వివాదం నడుస్తోంది. ఎస్టేట్‌ భూముల్లో సాగుచేసుకుంటున్న వారికి రైత్వారీ పట్టాలు ఇవ్వాలని, నివాస స్థలాలు ఏర్పాటు చేసుకున్న వారికి ఇంటిపట్టాలు ఇవ్వాలన్న ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే కొన్ని కేసుల్లో రియల్‌ ఎస్టేట్‌ మాఫియా, ప్రైవేటు వ్యక్తులు దొంగ డాక్యుమెంట్లు సృష్టించి రైత్వారీ పట్టాలు ఇవ్వాలని కోరుతున్నారు. ఇలాంటి కేసులను పక్కనపెట్టి, నిజంగా రైతుల సాగులో ఉన్న భూములను సెటిల్‌ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.


తిరుపతి కలెక్టర్‌, ఇతర అధికారుల చొరవతో ఈ ఏడాది జనవరిలో ఓ కొలిక్కి తీసుకొచ్చారు. సంక్రాంతి నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా అర్హులైన రైతులకు పట్టాలు, రెండు సెంట్లు చొప్పున నివాస స్థలాల పట్టాలు ఇప్పించారు. ఇందులో 225.42 ఎకరాలు రైతులకు, 90 ఎకరాలు ప్రభుత్వానికి, 65 ఎకరాలు తుడాకు ఇచ్చేలా ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు సెటిల్‌మెంట్‌ కమిషనర్‌ వద్ద పెండింగ్‌లో ఉన్న అనేక కేసులను పరిష్కరించారు. సెటిల్‌మెంట్‌ కమిషనర్‌ వద్ద మరో 40 ఎకరాలకు సంబంధించి కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటి విలువ 500 కోట్లు ఉంటుంది.


40 ఎకరాలు కొట్టేసేందుకు ప్లాన్‌

పెండింగ్‌లో ఉన్న 40 ఎకరాలకు సంబంధించి పట్టాలు కోరుతూ ప్రైవేటు వ్యక్తులు దాఖలు చేసిన పిటిషన్‌లను జిల్లా సెటిల్‌మెంట్‌ అధికారిగా జే సీ గతంలోనే తిరస్కరించారు. జేసీ ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ ప్రైవేటు వ్యక్తులు అమరావతిలోని సర్వే, సెటిల్‌మెంట్‌ కమిషనర్‌ వద్ద అప్పీల్‌ చేశారు. అయితే ఓ అధికారి ప్రైవేటు వ్యక్తులతో మిలాఖత్‌ అయ్యారు. ముందస్తుగా బేరసారాలు చేసుకున్నారు. దీంతో 40 ఎకరాల కేసులో తిరుపతి జేసీ ఉత్తర్వులను ‘అడ్మిట్‌’కు బదులుగా, ‘రిజెక్ట్‌’ (తిరస్కరించడం) అని రాసి ఫైలును తయారు చేసి సెటిల్‌మెంట్‌ కమిషనర్‌ ఆమోదం కోసం పంపించారు. అప్పటికే కొన్ని కీలక ఫైళ్లపై సెటిల్‌మెంట్‌ కమిషనర్‌ కూర్మనాథ్‌ సంతకాలు చేశారని తెలిసింది. అయితే వాటి మధ్యలో తిరుపతి శెట్టిపల్లి ఎస్టేట్‌ భూముల ఫైలు ఉండటం, అందులో జేసీ ఉత్తర్వులను రిజెక్ట్‌ చేయాలనే ప్రతిపాదనలు ఉండటాన్ని పరిశీలించి సంతకాలు ఆపేశారు.

సస్పెన్షన్‌ను అడ్డుకునేందుకు మంత్రాంగం

ఎస్టేట్‌ భూముల విషయంలో ప్రైవేటు వ్యక్తులకు అనుకూలంగా ఆదేశాలు ఇచ్చేలా ఫైలు ప్రతిపాదనలు పంపించిన అధికారిని సస్పెండ్‌ చేయడానికి ఫైలు సిద్ధం చేయాలని సర్వే, సెటిల్‌మెంట్‌ కమిషనర్‌ కూర్మనాథ్‌ ఆదేశించారని తెలిసింది. అయితే తప్పు చేసిన వ్యక్తిని కాపాడేందుకు మరో కీలక అధికారి మంతనాలు ప్రారంభించారని తెలిసింది. ప్రభుత్వ స్థాయిలో పెద్దలతో మాట్లాడి సస్పెన్షన్‌ను ఆపేస్తామని బేరసారాలకు దిగినట్లు సమాచారం. క్రమశిక్షణా చర్యల ఫైలు సర్వే, సెటిల్‌మెంట్‌ కమిషనర్‌కు పంపకుండా అడ్డుపుల్ల వేసినట్లు తెలిసింది. ఇటు ప్రభుత్వ, అటు రైతుల ప్రయోజనాలతో ముడిపడిన కేసులో ఓ అధికారి నిర్భీతిగా సెటిల్‌మెంట్‌ కమిషనర్‌ను తప్పుదోవపట్టించాలనుకోవడం, ప్రైవేటు వ్యక్తులకు మేలు చేయాలనుకోవడం చర్చనీయాంశంగా మారింది.

Updated Date - Feb 26 , 2026 | 05:12 AM