రెవెన్యూ తీరు మారాలి
ABN , Publish Date - Sep 28 , 2026 | 02:53 AM
ప్రభుత్వానికి ప్రజాస్పందనే కొలమానమని సీఎం చంద్రబాబు ఘంటాపథంగా చెబుతున్నారు. ప్రభుత్వ పరిధిలోని శాఖలు, అధికారులు, వ్యవస్థల పనితీరుకు కూడా ప్రజల సంతృప్తే గీటురాయిగా ఉంటుందని నిర్దేశించారు
ఇదీ ప్రజాభిప్రాయం.. పనితీరుపై అసంతృప్తి
వ్యతిరేకతలో టాప్-10 డివిజన్లు,
మండలాలను గుర్తించిన రెవెన్యూ శాఖ
పనితీరు అధ్వానం.. లంచాలు అడుగుతున్నారని ఫిర్యాదు
డివిజన్లలో భీమిలి నంబర్ 1.. మండలాల్లో కరప
ప్రభుత్వం పారదర్శకంగా రెవెన్యూ సేవలు అందిస్తోంది. రెవెన్యూ శాఖలో అవినీతి లేకుండా చేసేందుకు, జవాబుదారీతనం తీసుకొచ్చేందుకు, రైతుల ప్రమేయంతోనే భూముల సర్వే జరిగేలా.. అనేక సంస్కరణలు తీసుకొస్తోంది. మరి ఇవన్నీ ఆచరణలో ఫలితాలు ఇస్తున్నాయా? ప్రజలు ఈ సేవలను స్వేచ్ఛగా పొందగలుగుతున్నారా? ఇంకా అవినీతి ఉంటోందా? అన్నది తెలుసుకునేందుకు ఐవీఆర్‌ఎస్ పద్ధ్దతిలో ప్రజల నుంచి ప్రభుత్వం సమాచారం తీసుకుంటోంది.
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
ప్రభుత్వానికి ప్రజాస్పందనే కొలమానమని సీఎం చంద్రబాబు ఘంటాపథంగా చెబుతున్నారు. ప్రభుత్వ పరిధిలోని శాఖలు, అధికారులు, వ్యవస్థల పనితీరుకు కూడా ప్రజల సంతృప్తే గీటురాయిగా ఉంటుందని నిర్దేశించారు. ఇదే రెవెన్యూ శాఖ అందిస్తున్న కీలక సేవల్లో ప్రజాస్పందనను సర్కారు లెక్కించింది. రాష్ట్రవ్యాప్తంగా పది రెవెన్యూ డివిజన్లు, 10 మండలాల్లో రెవెన్యూ సేవల పనితీరుపై ప్రజా స్పందనలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోందని రెవెన్యూ సేవలు కోరుతూ ప్రజలు ఇచ్చిన అర్జీల ఆధారంగానే ఐవీఆర్‌ఎస్ కాల్స్ ద్వారా అధికారులు సమాచారం సేకరించారు.
పది డివిజన్లలో ప్రజావ్యతిరేకత 57-61 శాతం మేర నమోదైంది.
రెవెన్యూ సేవలకు లంచాలు అడుగుతున్నారని సగటున 80 శాతం మంది చెబుతున్నారు.
తమ అర్జీలపై విచారణ చేయడం లేదన్నవారు 30-58 శాతం.
తమ అర్జీ ఆమోదించిన విషయమే తెలియజేయడం లేదని 57-70 శాతం మంది ఫీడ్‌బ్యాక్ ఇచ్చారు. (మొదటి పేజీ తరువాయి)
వెల్లడైంది. పీజీఆర్‌ఎస్, ప్రజా స్పందనలను అంచనా వేసి రెవెన్యూ శాఖ స్వయంగా తయారు చేసిన గణాంకాల ప్రకారమే అధ్వాన పనితీరు కనబరుస్తున్న డివిజన్లు, మండలాల సంఖ్యను నిర్ధారించారు. రెవెన్యూ రికార్డుల నిర్వహణ, మ్యుటేషన్లు, రీ సర్వే, సర్వే సంబంధిత సేవలు, అధికారుల పనితీరుపై ప్రభుత్వం ఐవీఆర్‌ఎస్ ద్వారా డేటా సేకరించినప్పుడు కొన్ని డివిజన్లు, మండలాల పట్ల ప్రజల్లో ఉన్న అసంతృప్తి, వాటి అధ్వాన పనితీరు బయటపడింది. అత్యంత ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్న డివిజన్లలో విశాఖ జిల్లాలోని భీమిలి నంబర్ 1 స్థానంలో ఉంది. ఈ డివిజన్‌లో సేవలపై 61.22 శాతం ప్రజలు అసంతృప్తి వెలిబుచ్చారు. 10వ స్థానంలో తెనాలి డివిజన్ ఉంది. అత్యంత ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్న మండలాల జాబితాలో కాకినాడ జిల్లా కరప మొదటి స్థానంలో ఉంది. ఇక్కడ 61.63 శాతం ప్రజలు ఈ మండలంలో రెవెన్యూ సేవలు అందుతున్న తీరుపై అసంతృప్తి కనబర్చారు. చివరగా 10వ స్థానంలో ఏలూరు జిల్లా ముదినేపల్లి మండలం ఉంది. ఈ మండలంలో సేవలు బాగోలేవంటూ 58.64 శాతం ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేశారు.
ప్రామాణికత ఏమిటంటే..
రెవెన్యూ సేవలు ఎలా అందుతున్నాయో తెలుసుకునేందుకు ఐవీఆర్‌ఎస్ పద్ధ్దతిలో ప్రజల నుంచి ప్రభుత్వం సమాచారం తీసుకుంటోంది. ఇందుకోసం కొన్ని ప్రశ్నలను అడుగుతోంది.
ఆర్‌ఓఆర్ మ్యుటేషన్‌లపై నాలుగు ప్రశ్నలు అడుగుతోంది. మీ ఆన్‌లైన్ అర్జీపై రెవెన్యూ అధికారి విచారణ జరిపారా? మీ ఆన్‌లైన్ అర్జీ ఆమోదించిన తర్వాత ఫీజు కాకుండా అదనపు డబ్బులు అడిగారా? మీ ఆన్‌లైన్ అర్జీని ఆమోదించినట్లు మీకు సమాచారం వచ్చిందా? స్వర్ణగ్రామ ఆఫీసులో డిజిటల్ అసిస్టెంట్ మీ అప్లికేషన్‌పై వీఆర్‌ఓ సంతకం అడిగారా? అన్న ప్రశ్నలకు ప్రజల నుంచి సమాచారం తీసుకుంటున్నారు.
ఎఫ్-లైన్ సర్వేకు సంబంధించి మరో నాలుగు ప్రశ్నలు అడుగుతున్నారు. ఆన్‌లైన్‌లో సమర్పించిన అర్జీకి సర్వేయర్ నోటీసు ఇచ్చారా? మీరు అర్జీ పెట్టిన తర్వాత సర్వేయర్ ఫీల్డ్‌కు వచ్చి సర్వే చేశారా? మీ సర్వే పూర్తయిన తర్వాత సర్వేయర్ మిమ్మల్ని డబ్బులు అడిగారా? సర్వే పూర్తయిన తర్వాత మీకు సర్వే సర్టిఫికెట్ ఇచ్చారా? స్వర్ణ గ్రామ ఆఫీసులో డిజిటల్ అసిస్టెంట్ మీ దరఖాస్తు నమోదుకు సర్వేయర్ సంతకం అడిగారా? అన్న ప్రశ్నలకు అర్జీదారుల నుంచే ఫీడ్‌బ్యాక్ తీసుకుంటున్నారు.
రెవెన్యూ సేవలకు నిర్దేశిత ఫీజు కాకు ండా అదనంగా డబ్బు డిమాండ్ చేస్తున్నారని ఏలూరు జిల్లా కైకలూరు మండల ప్రజలు వాపోయారు. ఇక్కడ అధికారులు అదనపు డబ్బులు అడుగుతున్నారని 91.30 శాతం మంది చెప్పారు. కాకినాడ జిల్లా కరపలో ఐవీఆర్‌ఎస్ లో పాల్గొన్నవారిలో 90 శాతం మంది.. అధికారులు అదనపు డబ్బు డిమాండ్ చేస్తున్నారని తెలిపారు. గుంటూరు జిల్లాలో తెనాలి డివిజన్, తెనాలి మండలం, ఎన్టీఆర్ జిల్లాలో విజయవాడ డివిజన్, విజయవాడ రూరల్ మండలం ఈ జాబితాలో ఉన్నాయి. విశాఖజిల్లాలో ఉన్న రెండు డివిజన్లలోనూ రెవెన్యూ సేవలపై ప్రజలు సంతృప్తిగా లేకపోవడం గమనార్హం.