Share News

Revenue Department: పాత మాటే ‘కొత్త’గా

ABN , Publish Date - Jan 02 , 2026 | 04:16 AM

ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుని ఆదేశాలు జారీ చేసిందంటే కొత్తగా అమల్లోకి వచ్చినట్టే లెక్క. అందులోనూ కొత్త ఏడాది దీనికి సంబంధించిన ఫైలుపై తొలి సంతకం చేశామని మంత్రి చెప్పారంటే...

Revenue Department: పాత మాటే ‘కొత్త’గా

  • రెవెన్యూ మంత్రి తొలి సంతకంలో వింత

  • నిషేధిత జాబితా భూములపై విచిత్రం

  • పదేళ్ల కిందటే వాటికి ‘నిషేధ’ విముక్తి

  • ఆదేశాలు అమలు చేయని అధికారులు

  • ఇప్పుడు మళ్లీ విముక్తి అంటూ పాత పాట

  • కీలకమైన 4 కేటగిరీల భూములపై నాన్చుడు

  • సీఎం పలుమార్లు ఆదేశాలిచ్చినా అంతే

  • జగన్‌ ప్రభుత్వ పాపాలకు ఇప్పుడు రైతులు బలి

‘విముక్తి’ వీటికేనట...

మాజీ, ప్రస్తుత సైనికోద్యోగులు, స్వాతంత్య్ర సమరయోధులు, రాజకీయ బాధితులకు కేటాయించిన భూములు, 1954కు ముందు అసైన్‌మెంట్‌ చేసిన భూములు.. ఇంకా ప్రైవేటు పట్టా భూములను నిషేధిత జాబితా నుంచి తొలగిస్తున్నట్లు రెవెన్యూ మంత్రి ప్రకటించారు.

ఇదీ వాస్తవం

ఈ ఐదు కేటగిరీల భూములను నిషేధిత జాబితా నుంచి తొలగిస్తూ 2014-19 కాలంలో తెలుగుదేశం ప్రభుత్వమే ఉత్తర్వులు జారీ చేసింది. మళ్లీ 2022-2024లో గత జగన్‌ ప్రభుత్వమూ ఇవే ఉత్తర్వులు ఇచ్చింది. వాటిని ఇప్పుడు కొత్తగా నిషేధిత జాబితా నుంచి తొలగిస్తున్నట్టు మంత్రి అనగాని చెప్పడం ఏమిటో? కొత్త ఫైలుపై తొలి సంతకం చేయడం ఏమిటో?

విముక్తి కావాల్సినవి

షరతుగల పట్టా, సర్వీసు ఇనాం, చుక్కల భూములు, రీ సర్వే సమయంలో నిషేధిత జాబితాలో చేర్చిన పట్టా, చుక్కల భూములు... ఇవీ అసలు సమస్య!

ఇదీ జరిగింది

జగన్‌ ప్రభుత్వ హయాంలో నిషేధిత భూముల విషయంలో అక్రమాలు జరిగాయని, అనేకమందికి అన్యాయం జరిగిందని, ఈ సమస్యకు పరిష్కారం చూపాలని సీఎం చంద్రబాబు పలుమార్లు ఆదేశించారు. మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. పది నెలలవుతున్నా ఎలాంటి పురోగతీ లేదు.


గత జగన్‌ ప్రభుత్వంలో 13 లక్షల ఎకరాల అసైన్డ్‌ భూములను ఫ్రీ హోల్డ్‌ చేశారు. ఇందులో 5.75 లక్షల ఎకరాలను అక్రమంగా 22(ఏ) నుంచి తొలగించినట్టు కూటమి ప్రభుత్వం గుర్తించింది. వీటిపై చర్యలు తీసుకోకుండా మొత్తం అసైన్డ్‌ భూములపై నిషేధం విధించింది. ఇప్పటికీ అక్రమార్కులపై చర్యలు తీసుకోలేదు. బాధిత రైతులకు న్యాయం చేయలేదు.

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుని ఆదేశాలు జారీ చేసిందంటే కొత్తగా అమల్లోకి వచ్చినట్టే లెక్క. అందులోనూ కొత్త ఏడాది దీనికి సంబంధించిన ఫైలుపై తొలి సంతకం చేశామని మంత్రి చెప్పారంటే ‘కొత్త’గా భావించాల్సిందే. అయితే... ఐదు రకాల భూములను నిషేధిత జాబితా 22(ఏ) నుంచి తొలగిస్తున్నామని మంత్రి అనగాని సత్యప్రసాద్‌ చెప్పడం రెవెన్యూ వర్గాలనే విస్మయానికి గురిచేస్తోంది. మాజీ సైనికులు, ప్రస్తుతం సర్వీసులో ఉన్న సైనికులు, స్వాతంత్య్ర సమరయోధులు, రాజకీయ బాధితులకు ఇచ్చిన భూములను 22 (ఏ) నుంచి తొలగిస్తున్నట్టు మంత్రి గురువారం చెప్పారు. కొత్త ఏడాది తొలిరోజున ఆ ఫైలుపైనే సంతకం చేశానని చెప్పారు. వాస్తవానికి ఈ కేటగిరి భూములను పదేళ్ల నిర్దిష్ట గడువు తర్వాత నిషేధిత జాబితా నుంచి తొలగించాలని ప్రభుత్వ ఉత్తర్వులు గత కొన్నేళ్లుగా అమల్లో ఉన్నాయి. 2014-19 కాలంలో తెలుగుదేశం ప్రభుత్వమే ఈ ఉత్తర్వులు ఇచ్చింది. ఇదే విషయంపై జగన్‌ ప్రభుత్వం కూడా పలు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత రెవెన్యూ స్పెషల్‌ సీఎస్‌ సాయిప్రసాద్‌ గత జగన్‌ ప్రభుత్వంలోనూ రెవెన్యూ శాఖ బాస్‌గా ఉన్నారు. సీసీఎల్‌ఏగా కూడా పనిచేశారు. ఈ కేటగిరీల భూములను ప్రభుత్వ ఆదేశాల మేరకు నిషేధిత జాబితా నుంచి తొలగించాలని 2022-2024 కాలంలో అనేక ఉత్తర్వులు ఇచ్చారు. అలాంటి ఆదేశాలను గుదిగుచ్చి రెవెన్యూ బుక్‌లెట్‌గా ముద్రించారు. అసలు సమస్య వాటిని క్షేత్రస్థాయిలో అమలు చేయకపోవడమే. రెవె న్యూ శాఖ ఇచ్చిన ఉత్తర్వులను నాటి నుంచి నేటి వరకు కొందరు కలెక్టర్లు, జేసీలు అమలు చేయడం లేదు. దీంతో కొన్నిరకాల భూములను కాలానుగుణంగా నిషేధ విముక్తి కల్పించడం అనేది కలెక్టర్లు, అధికారపార్టీ నేతల దయాదాక్షిణ్యాలపై ఆధారపడిపోయింది. ఇప్పటికీ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. అందుకే రెవెన్యూ శాఖ పనితీరు పట్ల సంతృప్తి స్థాయి అధ్వానంగా ఉంటోంది.


1954 ముందు వాటికీ...

1954కు ముందు అసైన్‌ చేసిన భూములను నిషేధిత జాబితా నుంచి తొలగిస్తున్నట్టు తాజాగా మంత్రి అనగాని చెప్పారు. వాస్తవానికి ఈ కేటగిరి భూములను 22(ఏ) నుంచి తొలగించాలని 2018లోనే ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. అంటే.. 1954కు ముందు అసైన్‌మెంట్‌ అయిన భూములను వాటి రికార్డుల ఆధారంగా రైతులు వచ్చి అడగకముందే జిల్లా స్థాయిలో నిషేధిత జాబితా నుంచి తొలగించాలి. కానీ వాస్తవం ఏంటంటే.. రైతులు వచ్చి అన్నీ రకాల ఆధారాలు ఇచ్చినా కొందరు కలెక్టర్లు పట్టించుకోవడం లేదు. ఇప్పుడు ఈ కేటగిరి భూములను నిషేధిత జాబితా నుంచి తొలగిస్తూ ఫైలుపై సంతకం చేశామని మంత్రి చెబుతున్నారు. నిషేఽధిత జాబితా నుంచి ఈ కేటగిరి భూములను తొలగించాలని 2014-19లో, మరోసారి 2022-2024 కాలంలోనే ఉత్తర్వులు, మార్గదర్శకాలు విడుదలయ్యాక, ఇప్పు డు కొత్తగా మరోసారి ఉత్తర్వులు ఇవ్వడ ం ఏమిటి? లోగడ ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయని కలెక్టర్లు, జేసీలు, రెవెన్యూ యంత్రాంగంపై చర్యలు తీసుకోవాల్సింది పోయి.. మళ్లీ కొత్త కాగితంపై పాత ఉత్తర్వు చందంగా ఆదేశాలు ఇవ్వడం రెవెన్యూ శాఖ ప్రతిష్ఠను పెంచేదిగా లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.


చర్యలేవి మంత్రిగారు?

గత జగన్‌ ప్రభుత్వంలో 13 లక్షల ఎకరాల అసైన్డ్‌ భూములను ఫ్రీ హోల్డ్‌ చేయగా, 5.75 లక్షల ఎకరాలను అక్రమంగా నిషేధిత జాబితా నుంచి తీశారని కూటమి ప్రభుత్వం గుర్తించింది. ఈ పాపంలో వైసీపీ నేతలతో పాటు నాటి ప్రభుత్వంలోని కొందరు కలెక్టర్లు, జేసీలు, ఆర్‌డీవోలు, తహశీల్దార్ల పాత్ర ఉంది. ఇదే అంశంపై నాటి రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆర్‌.పి.సిసోడియా నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబుకే ఓ నివేదిక ఇచ్చారు. ఫ్రీ హోల్డ్‌ అక్రమాల్లో ఎందరు ఐఏఎ్‌సల పాత్ర ఉందో ఆ నివేదికలో పేర్కొన్నారు. ఇక కిందిస్థాయి అధికారుల పాత్ర అపరిమితం. 15 నెలలు గడిచినా కూటమి ప్రభుత్వంలో ఫ్రీ హోల్డ్‌ అక్రమాలపై ఒక్కనేతపై, ఒక్క అధికారిపై కూడా విచారణ లేదు. ఏ చర్యలూ లేవు. అక్రమాలకు వెన్నుదన్నుగా ఉన్న అధికారులపై విచారణ చేయకుండా, నిగ్గుతేల్చకుండా ఇంకెంతకాలం నాన్చుతారన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

ఇంకెంతకాలం ఫ్రీ హోల్డ్‌ను సాగదీస్తారు?

అక్రమాలను అరికట్టే పేరిట అసైన్డ్‌ భూముల ఫ్రీ హోల్డ్‌ను కూటమి సర్కారు నిలిపివేసింది. ఆ భూముల రిజిస్ట్రేషన్‌లు ఆపేసింది. ఈ సమస్యకు సత్వర పరిష్కారం చూపేందుకు రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసింది. ఇప్పటికే పది నెలలవుతోంది. ఎలాంటి పురోగతి లేదు. సెప్టెంబరులో జిల్లా కలెక్టర్ల సమావేశం జరిగినప్పుడు నెలరోజుల్లో ఫ్రీ హోల్డ్‌ అంశాన్ని పరిష్కరించాలని సీఎం ఆదేశించారు. ఆ గడువు దాటిపోయింది. నవంబరులో నిర్వహించిన సమీక్షలో నెలరోజుల గడువు ఇచ్చారు. అదీ వెళ్లిపోయింది. చివరకు డిసెంబరు మొదటి వారంలో జరిగిన సమీక్షలో ఒక్క నెలలో సమస్యను పరిష్కరించాలని సీఎం ఆదేశించారు. ఆ గడువు కూడా దాటిపోయింది. తాజాగా నిషేధిత జాబితా నుంచి 5 రకాల భూములను తొలగిస్తున్నట్టు చెప్పిన అనగాని.. మరో 4 రకాల భూముల సమస్య పరిష్కారానికి మరో రెండు నెలల సమయం పడుతుందని చెప్పారు. రైతులు ఈ సమస్య పరిష్కారం కోసం ఇంకెంతకాలం ఎదురుచూడాలో మరి!

Updated Date - Jan 02 , 2026 | 04:18 AM