Minister Anagani Satyaprasad: 22(ఏ) నుంచి 5 రకాల భూముల తొలగింపు
ABN , Publish Date - Jan 02 , 2026 | 04:20 AM
నూతన సంవత్సర కానుకగా నిషేధిత భూముల జాబితా 22(ఏ) నుంచి ఐదు రకాల భూములకు విముక్తి కల్పించామని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు.
2 నెలల్లో మరో 4 రకాలపై నిర్ణయం
నకిలీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు రద్దు
నేటి నుంచి రాజముద్రతో కూడిన
పట్టాదారు పాస్‌పుస్తకాలు పంపిణీ
ఈ ఏడాది భూనామ సంవత్సరం
అక్రమార్కులపై చర్యలు: అనగాని
నూతన సంవత్సర కానుకగా నిషేధిత భూముల జాబితా 22(ఏ) నుంచి ఐదు రకాల భూములకు విముక్తి కల్పించామని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. నూతన సంవత్సరంలో దీనికి సంబంధించిన ఫైలుపై తొలి సంతకం చేసినట్లు చెప్పారు. గురువారం మంత్రి అనగాని సచివాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి శాఖాపరంగా తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు. ప్రస్తుతం ఐదు రకాల భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించామని, మరో నాలుగు రకాల భూములపై మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. మాజీ, ప్రస్తుత సైనికోద్యోగులకు, స్వాతంత్య్ర సమరయోధులు, రాజకీయ బాధితులకు కేటాయించిన భూములు, 1954కు ముందు అసైన్‌మెంట్ చేసిన భూములు, ఇంకా ప్రైవేటు పట్టా భూములను జాబితా నుంచి తొలగించినట్లు వెల్లడించారు. కొంత భూమి కోసం మొత్తం సర్వే నంబర్‌నే నిషేధిత జాబితాలో చేర్చిన ఉదంతాలపై మంత్రి స్పందించారు. ఆ భూములను సబ్ డివిజన్ చేసి అవసరం ఉన్న వాటినే నిషేఽధిత జాబితాలో చేర్చాలని, అవసరం లేని వాటికి విముక్తి కల్పిస్తున్నట్లు మంత్రి తెలిపారు. షరతుగల పట్టా, సర్వీసు ఇనాం, రీ సర్వే సమయంలో నిషేధిత జాబితాలో చేర్చిన చుక్కల భూముల కు విముక్తి కల్పించే విషయంపై మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అన్నిపత్రాలు ఉన్న భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించాలని, రైతులను పదేపదే ఆఫీసుల చుట్టూ తిప్పుకోవద్దని అధికార యంత్రాంగానికి సూచించారు. గత ప్రభుత్వంలో వైసీపీ నేతలు పెద్ద ఎత్తున భూ అక్రమాలకు పాల్పడ్డారని, వాటిపై గత ఏడాదిన్నర కాలం నుంచి సమగ్ర విచారణ చేయిస్తున్నామని మంత్రి తెలిపారు. గత ప్రభుత్వంలో భూ అక్రమాలకు పాల్పడిన వారందరూ ఈ ఏడాది ఫలితం అనుభవిస్తారని హెచ్చరించారు. గత ఏడాది నకిలీ మద్య నామ సంవత్సరంగా సాగిందని, నకిలీ మద్యం కేసులో ఉన్న వ్యక్తులు జైలుకెళ్లారని అన్నారు. ఈ ఏడాది భూ అక్రమార్కుల వంతు అని చెప్పారు. క్షేత్రస్థాయిలో రెవెన్యూ ఉద్యోగుల పనివిధానాన్ని మెరుగుపరిచేందుకు ఆకస్మిక తనిఖీలు చేపడుతామని తెలిపారు. క్షేత్రస్థాయిలో సిబ్బంది కొరత ఉందన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లోని అదనపు ఉద్యోగులను రెవెన్యూలోకి తీసుకునేందుకు ఒక కమిటీ నియమించినట్లు మంత్రి తెలిపారు. రైతులకు శుక్రవారం నుంచి రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్‌పుస్తకాలు అందజేస్తామని తెలిపారు. 21.80 లక్షల పాసుపుస్తకాలు రైతులకు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా పాల్గొంటారని తెలిపారు. నకిలీ రిజిస్ట్రేషన్లను రద్దు చేసే అధికారం జిల్లా కలెక్టర్లకు ఇస్తున్నట్లు మంత్రి తెలిపారు.