Share News

Revenue Minister Anagani Sathya Prasad: భూ రికార్డుల్లో తప్పులు జగన్‌ పాపమే!

ABN , Publish Date - Jan 07 , 2026 | 02:46 AM

జగన్‌ ప్రభుత్వంలో రీ సర్వేను తప్పులత డకగా నిర్వహించడమే నేడు రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యలకు ప్రధాన కారణమని రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ అన్నారు....

Revenue Minister Anagani Sathya Prasad: భూ రికార్డుల్లో తప్పులు జగన్‌ పాపమే!

  • ఇప్పటికీ అవి వెంటాడుతున్నాయి

  • నయానో, భయానో సిబ్బందిని అనుకూలంగా మార్చుకుని ఇష్టానుసారం రీసర్వే

  • అన్ని సమస్యలనూ పరిష్కరిస్తున్నాం

  • రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ వెల్లడి

అమరావతి, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): జగన్‌ ప్రభుత్వంలో రీ సర్వేను తప్పులత డకగా నిర్వహించడమే నేడు రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యలకు ప్రధాన కారణమని రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ అన్నారు. భూముల సర్వే సందర్భంగా వైసీపీ నేతలు, కార్యకర్తలు... క్షేత్రస్థాయి సిబ్బందిని నయానో, భయానో తమకు అనుకూలంగా మార్చుకొన్నారని, దానివల్లే రైతులకు అన్యాయం జరిగిందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక జగన్‌ హయాంలో జరిగిన రీ సర్వేపై 6,688 గ్రామాల్లో సభలు పెడితే తమ సమస్యలు పరిష్కరించాలని 7.50 లక్షల మంది రైతులు పిటిషన్లు ఇచ్చారని అనగాని తెలిపారు. గ్రామసభల అనంతరం కూడా రీ సర్వే తప్పులపై ప్రభుత్వానికి రైతుల నుంచి అర్జీలు వచ్చాయని ఆయన తెలిపారు. ఈ పిటిషన్లన్నీ పరిష్కరిస్తామని, రైతులు ఆందోళన చెందవద్దని మంత్రి అనగాని ఓ ప్రకటనలో భరోసా ఇచ్చారు. పాస్‌ పుస్తకాల్లో తప్పులు, రీ సర్వేపై రైతుల ఆందోళన వంటి అంశాలపై ‘ఆంధ్రజ్యోతి’ వరుస కథనాలు వెలువరిస్తున్న నేపఽథ్యంలో ఆయన పలు అంశాలను ఆ ప్రకటనలో ప్రస్తావించారు. ‘‘రీ సర్వే సమయంలో రైతులకు ముందుగా సమాచారం ఇవ్వలేదు. రైతుల సమక్షంలో భూమిని కొలవలేదు. సర్వేను సమగ్రంగా చేపట్టకపోవడంతో పాటు, డేటా ఎంట్రీ కూడా శాస్త్రీయంగా చేయలేదు. సరిహద్దు రైతులను భాగస్వాములను చేయలేదు. ఆ రీ సర్వే ఆధారంగా 4,783 గ్రామాల్లో పంపిణీ చేసిన భూ హక్కుపత్రాల్లో అనేక తప్పులు దొర్లాయి’’ అన్నారు.

తేడాలొస్తే మళ్లీ సర్వే కోరవచ్చు

కూటమి ప్రభుత్వం రీ సర్వే 2.0ను పకడ్బందీగా నిర్వహిస్తోందని మంత్రి అనగాని వివరించారు. ‘‘గ్రామంలో రైతులకు నోటీసు ఇచ్చి, వారి సమక్షంలోనే భూముల సర్వే జరుగుతోంది. రైతులు అందుబాటులో లేకుంటే వీడియో కాల్‌ ద్వారా వివరాలు తీసుకోవడం, సమాచారం ఇవ్వడం జరుగుతోంది’’ అని వివరించారు. విస్తీర్ణంలో హెచ్చుతగ్గులు ఉన్నా, సరిగ్గా కొలతలు వే యలేదని భావించినా, మరోసారి సర్వే చేయాలని తిరిగి దరఖాస్తు చేసుకోవాలని రైతులకు ఆయన సూచించారు. దశాబ్దాలుగా రెవెన్యూవ్యవస్థ అనేక చిక్కుముడులతో ఉందని, జగన్‌ పాలన దాన్ని మరింత సంక్లిష్టం చేసిందని మంత్రి అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేస్తోందని, ఇప్పటికే అనేక సంస్కరణలను అమలుచేసిందని వివరించారు. జగన్‌ చేసిన పాపాలు రెవెన్యూవ్యవస్థను ఇంకా వెంటాడుతున్నాయని మంత్రి తెలిపారు.

Updated Date - Jan 07 , 2026 | 02:46 AM