రాష్ట్ర రెవెన్యూ జేఏసీ చైర్మన్‌గా రవీంద్రరాజు
ABN , Publish Date - Feb 02 , 2026 | 05:38 AM
రెవెన్యూ ఉద్యోగుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఆంధ్రప్రదేశ్ అమరావతి రెవెన్యూ ఎంప్లాయీస్ జేఏసీ ఏర్పాటైంది.
విజయవాడ (గాంధీనగర్), ఫిబ్రవరి 1 (ఆంధ్రజ్యోతి): రెవెన్యూ ఉద్యోగుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఆంధ్రప్రదేశ్ అమరావతి రెవెన్యూ ఎంప్లాయీస్ జేఏసీ ఏర్పాటైంది. విజయవాడ ఫిల్మ్ చాంబర్‌లో ఆదివారం జరిగిన కార్యక్రమంలో బీహెచ్ రవీంద్రరాజు చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బి.మధుబాబు సెక్రటరీ జనరల్‌గా, బి.సుగుణ కన్వీనర్‌గా, ఎన్.పెద్దయ్య కో-చైర్మన్‌గా, చంద్రమౌళి కోశాధికారిగా, ఎస్.రాజశేఖర్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా.. మొత్తం 26 మందితో జేఏసీని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రవీంద్రరాజు మాట్లాడుతూ వీఆర్‌ఏ నుంచి తహసీల్దార్ల సమస్యల పరిష్కారమే అజెండాగా జేఏసీ పనిచేస్తుందన్నారు. అప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా వర్క్ ఫర్ రూల్ నిర్ణయాన్ని అమలు చేయాలని జేఏసీ తీర్మానించిందన్నారు. ఏపీఆర్‌ఎస్ఏ (ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్) అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు రాష్ట్రంలోని రెవెన్యూ సమస్యలు పట్టించుకోకుండా, కేవలం తన వ్యక్తిగత లాభం కోసం రెవెన్యూ స్పోర్ట్స్ పేరుతో అనధికారంగా కోట్లాది రూపాయలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు.