Share News

ఆయనే కావాలి!

ABN , Publish Date - Apr 26 , 2026 | 04:26 AM

వందల ఎకరాల ప్రభుత్వ, ట్రస్ట్‌ భూములను తారుమారుమారుచే సి ప్రైవేటు పేరిట రాసిన ఘనాపాఠి ఆయన! 2017-18 కాలంలో ఆయనపై నమోదైన ఏసీబీ కేసులు, సిట్‌ విచారణలు, అరెస్ట్‌లు.. అంతా ఓ సంచలనం!!

ఆయనే కావాలి!

  • రెవెన్యూలో రిటైర్డ్‌ అధికారికి అందలం.. విశాఖలో లెక్కకు మించిన ఏసీబీ కేసులు

  • గతంలో వందల ఎకరాలు ప్రైవేటుపరం.. సస్పెండయ్యారు.. జైలుకెళ్లొచ్చారు

  • కేసులతో నేటికీ ఖరారుకాని పింఛన్‌.. ఇప్పుడు రెవెన్యూశాఖ కీలక ఆఫీసులో రీ ఎంట్రీ

  • అనధికారికంగా పీజీఆర్‌ఎస్‌ అధికారిగా పోస్టింగ్‌.. కీలకమైన భూముల ఫైళ్లు ఆయనకే

  • ఇంతకీ ఆయన్నే ఎందుకు తెచ్చిపెట్టుకున్నారు?.. సర్వత్రా అనుమానాలు.. చర్చలు

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

వందల ఎకరాల ప్రభుత్వ, ట్రస్ట్‌ భూములను తారుమారుమారుచే సి ప్రైవేటు పేరిట రాసిన ఘనాపాఠి ఆయన! 2017-18 కాలంలో ఆయనపై నమోదైన ఏసీబీ కేసులు, సిట్‌ విచారణలు, అరెస్ట్‌లు.. అంతా ఓ సంచలనం!! ఆయన పేరు చెబితే భూ అక్రమార్కులు, కబ్జాకోరులకు ఓ ఉత్సాహం! ఆయన అండ ఉంటే ఎంతటి భూమినయినా రికార్డులు తారుమారుచేసి కొట్టేయవచ్చన్న నమ్మకం!! ఉమ్మడి విశాఖ జిల్లానే కాదు.. యావతాంధ్ర నివ్వెరపోయేలా భూ దందాలకు కేరా్‌ఫగా నిలిచారాయన! ఆ నాటి కేసులేవీ తేలలేదు. రిటైర్‌ అయిన తర్వాత పింఛను కూడా ఖరారు కాలేదు. ఇప్పుడు ఆయన మళ్లీ రెవెన్యూశాఖలో ఎంట్రీ ఇచ్చారు. అదీ సాదాసీదా ఎంట్రీకాదు. అత్యంత కీలకమైన ఆఫీసులో పోస్టింగ్‌. అదీ అనధికారమే. ఇప్పుడు ఆయన ముఖ్యమైన భూముల కేసులు అంటే యూఎల్‌సీ, అసైన్‌మెంట్‌, ఇనామ్‌, మాజీ సైనికులకిచ్చిన భూములు, ఇంకా అనేక కీలక భూముల ఫైళ్లు ఆయన వద్దకు వెళ్తున్నాయి. ఆయనతో ఏం చేయిద్దామనుకుంటున్నారు? ఎలాంటి పనులు చేయాలని ఆయనకు టాస్క్‌ ఇచ్చారు? ఆయన్ను అసలు ఏ ఉద్దేశంతో అనధికారికంగా తీసుకొచ్చారు? ఇప్పుడు రెవెన్యూశాఖలో ఇదే హాట్‌టాపిక్‌!. రెవెన్యూలో ప్రైవేటు వ్యక్తులు, ఎన్‌ఆర్‌ఐలు, లాబీయిస్ట్‌లు కీలక వ్యవహారాలు చక్కబెడుతున్నారన్న విమర్శలు, ఆరోపణలు ఆ శాఖను చుట్టుముట్టిన నేపథ్యంలో ఇప్పుడు కొత్తగా రిటైర్‌ అయిన అవినీతి అధికారికి పెద్దపీటవేయడం చర్చనీయాంశంగా మారింది.


పదేళ్లు వెనక్కి వెళ్తే..

2017-18 మధ్య కాలం.. విశాఖలోని భీమిలి మండలం.. ప్రభుత్వ, అసైన్డ్‌, మాజీ సైనికులు, స్వాతంత్య్ర సమరయోధులు సహా ప్రైవేటు భూములు భారీగా ఉన్నాయి. అక్కడ ఎకరం కనీసం 15 కోట్లపైమాటే. ఆ మండలంలో భూ వివాదాలు, తగాదాలు, దందాలు చాలా భయానకంగా ఉన్నాయి. సిఫారసుపై ఆ మండలానికి 2016లో వె ళ్లిన ఓ రెవెన్యూ అధికారి లెక్కలేనన్ని అక్రమాలకు పాల్పడ్డారు. భూ కబ్జాకోరులతో కుమ్మక్కయి వందల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను గుట్టుచప్పుడు కాకుండా ప్రైవేటుపరం చేశారు. చివరికి ప్రభుత్వం కన్నెర్రచేయడంతో 2017లో ఆయనపై ఏసీబీ దాడులు జరిగాయి. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారని ఏసీబీ నిగ్గుతేల్చింది. దాడుల సమయంలో ఆయన ఇంట్లో 1200 కోట్ల విలువైన ప్రభుత్వ భూముల రికార్డులు లభించాయి. మాన్సాస్‌ ట్రస్ట్‌కు చెందిన 150 ఎకరాల భూముల రికార్డులు దొరికాయి. మరో 100 ఎకరాల మాన్సాస్‌ భూములు ప్రైవేటు పరం చేశారన్న అభియోగాలు ఆయనపై ఉన్నాయి. ఇవే భూముల విషయంలో ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ చేసింది. ఆ తర్వాత పలు కేసుల్లో అరెస్ట్‌ అయి జైలుకు వెళ్లివచ్చారు. సస్పెండ్‌ అయ్యారు. ఆతర్వాత రిటైర్‌ అయ్యారు. అవినీతి, అక్రమాల కేసులు తేలకుండానే రిటైర్‌ అవ్వడంతో నేటికీ కూడా ఆయన పింఛను, ఇతర ప్రయోజనాలేవీ ఖరారుకాలేదు. ఇదంతా రెవెన్యూశాఖకు తెలిసిన అంశాలే.


సీన్‌కట్‌ చేస్తే...

ఆ అవినీతి వ్యక్తే ఇప్పుడు రెవెన్యూశాఖకు దిక్కయ్యారు. లెక్కకు మించి అవినీతి, అక్రమాల కేసుల్లో ఉన్న ఆయన్ను విశాఖ నుంచి తెచ్చి అమరావతిలోని రెవెన్యూశాఖలో అత్యంత కీలకమైన ఆఫీసులో దర్జాగా కూర్చోబెట్టారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదుల పరిశీలన, పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన విభాగంలో ప్రత్యేక అధికారిగా నియమించారు. ఆయన నియామకం అనధికారికమే. ఎలాంటి ఆదేశం, లిఖితపూర్వక ఉత్తర్వు లేదు. ఎందుకంటే, ఆయనకు ఆ కార్యాలయంలో ఉద్యోగం ఇచ్చారంటే ఎవ్వరూ అడ్డుకోలేనంతగా ఆ శాఖ పరువు, గౌరవం అమాంతంగా పెరిగిపోతుంది. అందుకే రూల్స్‌, గైడ్‌ లైన్స్‌, హేతుబద్ధత, వంటి అంశాలకు పాతరేసి ఆయనకు అనధికారికంగా కీలకపోస్టు ఇచ్చేశారు. తహశీల్దార్‌ వేతనం ఇచ్చేలా కమిట్‌మెంట్‌ ఇచ్చారు. నెలన్నర రోజులుగా ఆయన ఆ కార్యాలయానికి వస్తున్నారు.

అక్రమాలే అర్హతా?!

తీవ్రమైన కేసులను మోస్తున్న అధికారిని ఇప్పుడు రెవెన్యూలోకి ఎందుకు తీసుకొచ్చారు? ఆయనతో ఏం పనులు చేయిద్దామనుకున్నారు? ఆయన్నే ఏరికోరి కీలకపోస్టులో కూర్చోబెట్టాలన్న ఆలోచన ఎవరిది? అన్న ప్రశ్నలు, వాటి చట్టూ అనేక చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఆయనకు భూముల ఫైళ్లే పంపిస్తున్నారని తెలిసింది. పట్టణ గరిష్ఠ భూ పరిమితి (యూఎల్‌సీ), అసైన్డ్‌, ఇనామ్‌, మాజీ సైనికులు, స్వాతంత్య్ర సమరయోధుల ఫైళ్లే ఆయనకు వెళ్తున్నాయని తెలిసింది. అందులోనూ ఎక్కువగా విశాఖ, విజయనగరం జిల్లా, ప్రత్యేకించి భోగాపురం మండల పరిధిలోని భూముల ఫైళ్లే ఆయనకు పంపిస్తున్నారని తెలిసింది. ఉత్తరాంధ్రలోని భూముల వ్యవహారాలు ఆ రిటైర్డ్‌ అధికారికి కొట్టినపిండి. అందుకే ఆ ఫైళ్లు ఆయనకు ఇచ్చి అధ్యయనం చేయిస్తున్నారా? అన్న చర్చ జరుగుతోంది.

Updated Date - Apr 26 , 2026 | 04:32 AM