కుట్ర చేసి పరువు తీశారు
ABN , Publish Date - Apr 26 , 2026 | 05:04 AM
విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు 11 మందికి పరువు నష్టం నోటీసులు జారీ చేశారు. తనకు కలిగించిన మనోవేదనకు పరిహారంగా రూ.కోటి చెల్లించాలని డిమాండ్ చేశారు.
అన్ని విధాలా నష్ట పరిచారు.. రూ.కోటి పరిహారం చెల్లించండి
పీఎస్ఆర్, పూడి శ్రీహరి సహా 11 మందికి ఏబీవీ నోటీసులు
అమరావతి, ఏప్రిల్ 25(ఆంధ్రజ్యోతి): విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు 11 మందికి పరువు నష్టం నోటీసులు జారీ చేశారు. తనకు కలిగించిన మనోవేదనకు పరిహారంగా రూ.కోటి చెల్లించాలని డిమాండ్ చేశారు. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, మాజీ డీజీపీలు గౌతమ్ సవాంగ్, ఆర్‌పీ ఠాకూర్, సీఐడీ డీజీ రవిశంకర్ అయ్యన్నార్, సీఐడీ మాజీ డీజీ పీవీ సునీల్ కుమార్, అదనపు ఎస్పీ విజయ్ పాల్(రిటైర్డ్), గోవింద రాజన్, ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు, ఏసీబీ అడిషనల్ ఎస్పీ సాయికృష్ణ, ఇంటెలిజెన్స్ మాజీ ఐజీ కొల్లి రఘురామి రెడ్డి, మాజీ సీఎం జగన్ సీపీఆర్‌వో పూడి శ్రీహరికి తన న్యాయవాది ద్వారా ఏబీవీ నోటీసులు పంపారు. ‘సివిల్ ప్రొసీజర్ కోడ్, 1908 సెక్షన్ 80 ప్రకారం దురుద్దేశ పూర్వక కేసులు, కట్టుకథలు, అక్రమ సస్పెన్షన్లతో ఆర్థికంగా, కేరీర్ పరంగా నష్టం కలిగించి మానసిక వేదనకు గురిచేశారు. రాజ్యాంగ హక్కుల్ని కాలరాశారు. పరువు నష్టం రూ.కోటీ ఒక్క రూపాయితో పాటు 2020 ఫిబ్రవరి నుంచి ఏడాదికి 12ు వడ్డీ చొప్పున 15 రోజుల్లోపు చెల్లించండి. లేకపోతే సివిల్ కేసులు వేస్తా’ అని ఏబీవీ హెచ్చరించారు.