నెయ్యి ప్రమాణాలకు పాతరేసిందెవరు?
ABN , Publish Date - Mar 03 , 2026 | 03:57 AM
జగన్ హయాంలో తిరుమల శ్రీవారి లడ్డూల తయారీకి కల్తీ నెయ్యి వినియోగించేందుకు నిబంధనలు సడలించిన వ్యవహారాన్ని పరిశీలించేందుకు ఏర్పాటైన ఏకసభ్య కమిషన్ రంగంలోకి దిగింది.
రంగంలోకి ఏకసభ్య కమిషన్
తిరుమల చేరుకున్న దినేశ్‌కుమార్
నేడు శ్రీవారిని దర్శించుకుని..పని ప్రారంభించనున్న రిటైర్డ్ ఐఏఎస్
తిరుపతి సిట్ కార్యాలయం నుంచే విచారణ?
తిరుమల/తిరుపతి, మార్చి 2(ఆంధ్రజ్యోతి): జగన్ హయాంలో తిరుమల శ్రీవారి లడ్డూల తయారీకి కల్తీ నెయ్యి వినియోగించేందుకు నిబంధనలు సడలించిన వ్యవహారాన్ని పరిశీలించేందుకు ఏర్పాటైన ఏకసభ్య కమిషన్ రంగంలోకి దిగింది. కమిషన్ సారథి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దినేశ్‌కుమార్ సోమవారం తిరుమల చేరుకున్నారు. భాగ్యశ్రీ అతిథిగృహానికి చేరుకున్న ఆయనకు టీటీడీ రిసెప్షన్ అధికారులు స్వాగతం పలికి వసతి ఏర్పాట్లు చేశారు. ఆయన మంగళవారం శ్రీవారిని దర్శించుకుని కల్తీ నెయ్యి వ్యవహారంపై విచారణ ప్రారంభించనున్నారు. ఇప్పటికే వివిధ అంశాలకు సంబంధించిన ఫైళ్లను అందుబాటులో ఉంచాలని టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్రకు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. కల్తీ నెయ్యి దర్యాప్తు కోసం సుప్రీంకోర్టు నియమించిన సిట్ బృందం తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్‌లోని పాత ఎస్వీబీసీ కార్యాలయాన్ని వినియోగించుకుంది. ఇప్పుడు ఏకసభ్య కమిషన్ సైతం అక్కడి నుంచే తమ కార్యకలాపాలు సాగించాలని చూస్తోంది. సోమవారమే కమిషన్ సిబ్బంది ఈ కార్యాలయాన్ని పరిశీలించారు. అవసరమైన ఫైళ్లను పరిశీలించడంతో పాటు టీటీడీలోని వివిధ విభాగాల అధికారుల నుంచి కమిషన్ తగిన సమాచారం సేకరించనుంది. ముఖ్యంగా వైసీపీ హయాంలో నెయ్యి సేకరణ కోసం నిబంధనల మార్పునకు సంబంధించిన అంశాలను పరిశీలిస్తుంది.
ప్రధానంగా 2022లో సీఎ్‌ఫటీఆర్‌ఐ నివేదిక అందిన తర్వాత టీటీడీ టెండరు నిబంధనల్లో బిటా సిటోస్టిరోల్‌తో పాటు ఎఫ్‌ఎ్‌సఎ్‌సఆర్ నిబంధనలు పొందుపరచాలని నాటి ఈవోకు అప్పటి ప్రొక్యూర్‌మెంట్ జీఎం నోట్ రాశారు. దీనిని అప్పటి ఈవో సైతం అంగీకరించారు. ఆ తర్వాత వెంటనే ఎఫ్‌ఎ్‌సఎ్‌సఆర్ నిబంధనలు తొలగించేందుకు అదే అధికారి మరోమారు ఈవోకు నోట్ పెట్టారు. తక్కువ వ్యవధిలోనే నిబంధనలు ఎందుకు మార్చాల్సి వచ్చిందో సిట్ సైతం లోతుగా అధ్యయనం చేయలేదు. ఇప్పుడు ఇలాంటి అంశాలను ఏకసభ్య కమిషన్ తన పరిశీలనలో వెలుగులోకి తీసుకురానుంది. అదేవిధంగా నెయ్యి సేకరణలో ఎక్కడెక్కడ లోపాలున్నాయో చెబుతూ సిట్ ఇచ్చిన నివేదికను సైతం పరిశీలించి.. అందులో అక్రమాలకు పాల్పడిన అధికారులపై క్రమశిక్షణ చర్యలకు సిఫారసు చేస్తుంది. దినేశ్‌కుమార్ వెంట రిటైర్డ్ అసిస్టెంట్ సెక్రటరీ శివకుమార్, సహాయ సిబ్బంది మధులత, మునీంద్ర కూడా ఉన్నారు. వీరికి, టీటీడీకి మధ్య లైజనింగ్‌కు టీటీడీకి చెందిన ఓ అధికారిని నియమించనున్నారు.