Share News

నల్లమలలోని కేజీ రోడ్డుపై ఆంక్షలు

ABN , Publish Date - Feb 08 , 2026 | 11:02 PM

శ్రీశైల క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో నల్లమలలోని కర్నూలు - గుంటూరు జాతీయ రహదారి మీదుగా ఆంక్షలు విధించినట్లు ఆత్మకూరు డీఎస్పీ రామాంజి నాయక్‌ తెలిపారు.

   నల్లమలలోని కేజీ రోడ్డుపై ఆంక్షలు
మాట్లాడుతున్న ఆత్మకూరు డీఎస్పీ రామాంజి నాయక్‌

నేటి నుంచి గూడ్స్‌ వాహనాలు వెళ్లేందుకు అనుమతి నిరాకరణ

శ్రీశైల బ్రహ్మోత్సవాలు ముగిసే వరకు నిబంధనలు అమలు

ఆత్మకూరు డీఎస్పీ రామాంజి నాయక్‌

ఆత్మకూరు, ఫిబ్రవరి 8(ఆంధ్రజ్యోతి): శ్రీశైల క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో నల్లమలలోని కర్నూలు - గుంటూరు జాతీయ రహదారి మీదుగా ఆంక్షలు విధించినట్లు ఆత్మకూరు డీఎస్పీ రామాంజి నాయక్‌ తెలిపారు. ఆదివారం ఆత్మకూరులోని డీఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. శ్రీశైలంలో జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల దృష్ట్యా క్షేత్రానికి వేలాదిగా వాహనాలు తరలిరానున్నాయని, ఈ నేపథ్యంలో నల్లమలలో అటవీ మార్గంలో ట్రాఫిక్‌ జామ్‌ సమస్య ఉత్పన్నం కాకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా సోమవారం నుంచి 18వ తేది వరకు కర్నూలు నుంచి ఆత్మకూరు మీదుగా దోర్నాల వైపు వెళ్లే గూడ్స్‌ వాహనాలను కేజీరోడ్డు గుండా అనుమతించబోమని చెప్పారు. కర్నూలు, నందికొట్కూరు తదితర ప్రాంతాల మీదుగా వచ్చే గూడ్స్‌ వాహనాలు నంద్యాల, గిద్దలూరు మీదుగా విజయవాడ వైపు వెళ్లాలని సూచించారు. ఇందుకోసం అక్కడక్కడ తనిఖీ కేంద్రాలను కూడా ఏర్పాటు చేసినట్లు వివరించారు. గూడ్స్‌ వాహనదారులు ఈ విషయాన్ని గుర్తించుకొని సహకరించాలని కోరారు. అదేక్రమంలో గూడ్స్‌ వాహనాల్లో శ్రీశైలానికి ప్రయాణికులను తరలించడం చట్టరీత్యా నేరమని, అలాంటి వాహనాలపై కేసులు నమోదు చేసి జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు. వాహనదారులు కూడా నల్లమల అటవీ మార్గంలో రహదారి నియమాలు పాటించడంతో పాటు పరిమిత వేగంతో వెళ్లాలని సూచించారు. అలాగే పరిమితికి మించి ప్రయాణికులను వాహనాల్లో ఎక్కించుకోకూడదని చెప్పారు. కాగా కాలినడకన తరలివెళ్లే భక్తులు అటవీశాఖ నిర్ధేశించిన నిబంధనలు పాటిస్తూ, తగిన జాగ్రత్తలతో పాదయాత్ర సాగించాలని తెలిపారు. అనారోగ్యంతో బాధపడే వారు పాదయాత్రకు వెళ్లవద్దని సూచించారు. సమావేశంలో ఆత్మకూరు అర్బన సీఐ మహేశ్వరరెడ్డి, మోటారు వెహికల్‌ ఇనస్పెక్టర్‌ సత్యనారాయణరెడ్డి ఉన్నారు.

Updated Date - Feb 08 , 2026 | 11:02 PM