ఎన్‌హెచ్ ప్రాజెక్టుల సంగతి తేల్చండి!
ABN , Publish Date - Jan 19 , 2026 | 01:02 AM
జాతీయ రహదారుల(ఎన్‌హెచ్) ప్రాజెక్టులపై నెలకొన్న వివాదాలను ముఖ్యమంత్రి వద్దే పరిష్కరించుకునేందుకు ఉమ్మడి కృష్ణాజిల్లా ఎంపీలు సిద్ధమయ్యారు. ఎన్‌హెచ్ - 16, ఎన్‌హెచ్ -65 అంశాలకు సంబంధించిన సమస్యలను సీఎం చంద్రబాబుకు నివేదించి.. పరిష్కారం దిశగా అడుగులు వెయ్యాలని నిర్ణయించారు. మరికొద్ది రోజుల్లోనే విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి ముఖ్యమంత్రి వద్దకు వెళ్లనున్నారు.
- సీఎం చంద్రబాబు వద్దకు ‘వివాదాల పంచాయితీ’!
- విజయవాడ, మచిలీపట్నం ఎంపీలు కేశినేని, వల్లభనేని నిర్ణయం
- వీరికి మద్దతుగా ఉమ్మడి కృష్ణాజిల్లా ఎమ్మెల్యేలు
- త్వరలో సీఎంతో ఉమ్మడి కృష్ణాజిల్లా ప్రజాప్రతినిధుల భేటీ
- ప్రతిపాదిత నూతన ప్రాజెక్టులపైనా వివరణ
జాతీయ రహదారుల(ఎన్‌హెచ్) ప్రాజెక్టులపై నెలకొన్న వివాదాలను ముఖ్యమంత్రి వద్దే పరిష్కరించుకునేందుకు ఉమ్మడి కృష్ణాజిల్లా ఎంపీలు సిద్ధమయ్యారు. ఎన్‌హెచ్ - 16, ఎన్‌హెచ్ -65 అంశాలకు సంబంధించిన సమస్యలను సీఎం చంద్రబాబుకు నివేదించి.. పరిష్కారం దిశగా అడుగులు వెయ్యాలని నిర్ణయించారు. మరికొద్ది రోజుల్లోనే విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి ముఖ్యమంత్రి వద్దకు వెళ్లనున్నారు.
(ఆంధ్రజ్యోతి, విజయవాడ):
ఎన్‌హెచ్ - 16పై నిడమానూరు ఫ్లైఓవర్‌ను రద్దు చేయటం, విజయవాడ - మచిలీపట్నం మార్గంలో ఎన్‌హెచ్ - 65 ఆరు వరసల డీపీఆర్ ఆమోదయోగ్యంగా లేకపోవటం, హైదరాబాద్ - విజయవాడ మార్గంలో ఎన్‌హెచ్-65పై గొల్లపూడి దగ్గర ఉన్న సమస్యలు.. నూతన ప్రతిపాదనలకు సంబంధించి ఎన్‌హెచ్ వర్గాలు ఆసక్తిగా లేకపోవటంతో.. వీటిని సీఎం చంద్రబాబు దగ్గర చర్చించి ఎన్‌హెచ్ ఆర్‌వోకు ప్రభుత్వం ద్వారా ప్రతిపాదనలు పంపించేందుకు కృషి చెయ్యాలని భావిస్తున్నారు. ఇటీవల మచిలీపట్నంలో జాతీయ రహదారుల సంస్థ అధికారులతో నిర్వహించిన సమావేశం అనంతరం కూడా కీలక ప్రాజెక్టులకు సంబంధించి ఎలాంటి పురోగతి కనిపించటంలేదు. ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన అభిప్రాయాలను ఎన్‌హెచ్ అధికారులు పరిగణనలోకి తీసుకోవటం లేదు. దీంతో విసిగిపోయిన ఎన్టీఆర్, కృష్ణాజిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు ముఖ్యమంత్రి దగ్గర పంచాయితీ పెట్టడమే సరైన నిర్ణయమని భావించారు. అతి త్వరలో ముఖ్యమంత్రి సమక్షంలో ఎన్‌హెచ్ ప్రాజెక్టుల పంచాయితీ జరగనుంది.
ప్రధానమైన సమస్యలు ఇవే..
మహానాడు జంక్షన్ నుంచి నిడమానూరు జంక్షన్ వరకు 6.5 కిలోమీటర్ల పొడవున విజయవాడ నగరంలో ఇప్పటి వరకు లేని అతి పెద్ద నిడమానూరు ఫ్లై ఓవర్‌ను ఇటీవల కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. డీపీఆర్ కూడా పూర్తి చేసుకున్న ఈ ప్రాజెక్టు మెట్రో రైల్ ప్రాజెక్టు కారణంగా టెండర్లు పిలిచే విషయంలో జాప్యమైంది. నిడమానూరు నుంచి రామవరప్పాడు రింగ్ రోడ్డు వరకు డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్‌కు ప్రతిపాదన తెరమీదకు వచ్చింది. రూ.1000 కోట్లతో అంచనాలు తయారు చేసి మోర్త్‌కు పంపించారు. ఈ దశలో కేంద్ర ప్రభుత్వం నిడమానూరు ఫ్లై ఓవర్‌ను రద్దు చేసింది. దీనిని మళ్లీ సాధించే దిశగా విజయవాడ ఎంపీ కృషి చేస్తున్నా.. ఎన్‌హెచ్ నుంచి సానుకూలంగా స్పందన రావటం లేదు.
- విజయవాడ - మచిలీపట్నం మార్గంలో ఎన్‌హెచ్ - 65 ఆరు వరసల విస్తరణ ప్రాజెక్టుకు సంబంధించి డీపీఆర్‌పై అసంతృప్తి నెలకొంది. పోరంకి నుంచి బెంజిసర్కిల్ వరకు ఎలివేటెడ్ కారిడార్ (ఫ్లై ఓవర్)కు ప్రతిపాదించగా.. డీపీఆర్‌లో కన్సల్టెన్సీ సంస్థ మాత్రం పొందుపరచటం లేదు.
- ఎన్‌హెచ్ - 65 విస్తరణలో భాగంగా ఎన్‌హెచ్ - 216 దగ్గర క్లోవర్ లీఫ్ జంక్షన్‌కు ప్రతిపాదిస్తుండగా.. దీనిపై ఇప్పటికీ స్పష్టత రావటం లేదు.
- హైదరాబాద్ - విజయవాడ మార్గంలో ఎన్‌హెచ్ - 65, ఎన్‌హెచ్ - 16లు అనుసంధానమౌతున్న చోట గొల్లపూడి బైపాస్ దగ్గర క్లోవర్ లీప్ జంక్షన్ ఏర్పాటుకు ప్రతిపాదిస్తున్నా.. ఇప్పటి వరకు డీపీఆర్‌లో ఆ దిశగా చర్యలు తీసుకోవటం లేదు.
- ఎన్‌హెచ్ - 16, ఎన్‌హెచ్ - 65లను అనుసంధానించేలా తాడిగడప - ఎనికేపాడు (4 కి.మీ), పోరంకి - నిడమానూరు (6కి.మీ), కంకిపాడు - కేసరపల్లి (10 కి.మీ) కనెక్టింగ్ రోడ్లకు ప్రతిపాదించినా .. వీటిపైనా ఇప్పటి వరకు స్పష్టత రాలేదు.
-సరికొత్త ప్రతిపాదనలు ఇలా..
- ట్రేడ్ బిజినెస్‌ను దృష్టిలో పెట్టుకుని మచిలీపట్నం సౌత పోర్టు నుంచి ఎన్‌హెచ్ - 65 వరకు 18 కిలోమీటర్ల పొడవునా నాలుగు లేన్ల గ్రీన్‌ఫీల్డ్ రహదారికి మచిలీపట్నం ఎంపీ బాలశౌరి ప్రతిపాదన తీసుకువచ్చారు.
- మంగినపడి బీచ్ రోడ్డు నుంచి ప్రతిపాదిత నాలుగులేన్ల రోడ్డు వరకు 11.7 కిలోమీటర్ల మేర రోడ్డును విస్తరించేందుకు ప్రతిపాదన తెచ్చారు.
- కేసరపల్లి నుంచి వెదురుపావులూరు మీదుగా రామవరప్పాడు ఇన్నర్ రింగ్ రోడ్డుకు, అలాగే వెదురుపావులూరు నుంచి విజయవాడ పశ్చిమ బైపాస్‌కు కనెక్టింగ్ రోడ్లకు కూడా ప్రతిపాదించారు.
- విజయవాడ పశ్చిమ బైపాస్‌కు పూర్తి స్థాయిలో సర్వీసు రోడ్లను అభివృద్ధి చేయటంపై ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
- ఎన్‌హెచ్ - 216 హెచ్‌ను గుడివాడ నుంచి ఖమ్మం జిల్లా వరకు నాలుగు వరసలుగా అభివృద్ధి చేయటంపై ప్రతిపాదించారు.
- విజయవాడలో స్కూబ్రిడ్జి నుంచి రాజీవ్‌గాంధీ పార్కు వరకు నాలుగు లైన్ల ఫ్లైఓవర్‌కు ఎంపీ కేశినేని చిన్ని ప్రతిపాదించారు.
విజయవాడకు మెట్రో రైలు ప్రాజెక్టు వద్దు
- ఎన్‌హెచ్ ప్రాజెక్టులకు విఘాతమంటున్న ప్రజాప్రతినిధులు
విజయవాడ నగరంలో ప్రస్తుత పరిస్థితుల్లో మెట్రో రైలు ప్రాజెక్టు అవసరం లేదని ఉమ్మడి కృష్ణాజిల్లా ప్రజాప్రతినిధులు భావిస్తున్నారు. మెట్రో ప్రాజెక్టు వల్ల అత్యవసరమైన జాతీయ రహదారుల ప్రాజెక్టులకు అవాంతరాలు ఏర్పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొద్ది కాలం కిందట విజయవాడలో జరిగిన ఉమ్మడి కృష్ణాజిల్లా ప్రజాప్రతినిధుల సమావేశంలో ఈ అంశం గురించి ప్రధానంగా చర్చించారు. ఆ తర్వాత సీఎం దృష్టికి కూడా తీసుకువెళ్లారు. మరోమారు ముఖ్యమంత్రి సమక్షంలో మెట్రో గురించి ప్రస్తావించనున్నారు.