Share News

అసెంబ్లీ, సచివాలయాలకు గణతంత్ర శోభ

ABN , Publish Date - Jan 26 , 2026 | 03:34 AM

77వ భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర అసెంబ్లీ, సచివాలయ భవనాలు విద్యుత్‌ దీపాలతో సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి.

అసెంబ్లీ, సచివాలయాలకు గణతంత్ర శోభ

అమరావతి, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): 77వ భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర అసెంబ్లీ, సచివాలయ భవనాలు విద్యుత్‌ దీపాలతో సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. భవనాలు రాత్రివేళ దేదీప్యమానంగా వెలిగిపోతున్నాయి. వీటితో పాటు ప్రాంగణంలోని రోడ్లు, సెంట్రల్‌ పార్కులో విద్యుత్‌ వెలుగులు మిరుమిట్లు గొలుపుతూ పండుగ వాతావరణం నెలకొంది. సచివాలయంలో ముఖ్యమంత్రి కార్యాలయం ఉండే మొదటి భవనాన్ని ప్రత్యేకంగా త్రివర్ణ పతాక వర్ణం ఉట్టిపడేలా విద్యుత్‌ దీపాలతో అలంకరించారు. సచివాలయ ప్రవేశ మార్గానికి సమీపంలోని ఐదో బ్లాక్‌, అసెంబ్లీ భవనాన్ని కూడా ఇదే రీతిలో తీర్చిదిద్దారు. గణతంత్ర వేడుకలకు విజయవాడలోని లోక్‌ భవన్‌, ఉండవల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయం సహా ప్రకాశం బ్యారేజ్‌, ఇతర చారిత్రక ప్రాముఖ్యమున్న భవనాలను కూడా విద్యుత్‌ దీపాలతో అలంకరించారు. సోమవారం ఉదయం 7.30గంటలకు సచివాలయం మొదటి బ్లాక్‌ వద్ద సీఎస్‌ విజయానంద్‌, 8గంటలకు కౌన్సిల్‌ భవనం వద్ద శాసనమండలి చైర్మన్‌ మోషేన్‌రాజు, 8.15 గంటలకు అసెంబ్లీ భవనం ముందు స్పీకర్‌ అయన్నపాత్రుడు, 10గంటలకు నేలపాడులోని హైకోర్టు వద్ద చీఫ్‌ జస్టిస్‌ ధీరణ్‌సింగ్‌ ఠాకూర్‌ జాతీయ పతాకాలను ఆవిష్కరిస్తారని అధికారులు తెలిపారు.

Updated Date - Jan 26 , 2026 | 03:35 AM