Share News

గణతంత్ర వేడుకలకు అసెంబ్లీ, సచివాలయం ముస్తాబు

ABN , Publish Date - Jan 24 , 2026 | 06:12 AM

గణతంత్ర వేడుకలకు రాజధాని అమరావతిలో ఏర్పాట్లు దాదాపు పూర్తి కావచ్చాయని అధికారులు తెలిపారు.

గణతంత్ర వేడుకలకు అసెంబ్లీ, సచివాలయం ముస్తాబు

  • ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి నారాయణ

తుళ్లూరు/అమరావతి, జనవరి 23(ఆంధ్రజ్యోతి): గణతంత్ర వేడుకలకు రాజధాని అమరావతిలో ఏర్పాట్లు దాదాపు పూర్తి కావచ్చాయని అధికారులు తెలిపారు. 22 ఎకరాలలో పరేడ్‌ గ్రౌండ్‌, వీవీఐపీ, వీఐపీలకు 15 ఎకరాలలో పార్కింగ్‌, పబ్లిక్‌ పార్కింగ్‌కు 25 ఎకరాలు సిద్ధం చేశారు. అమరావతి రాజధానికి భూములిచ్చిన రైతులకు ప్రత్యేకంగా వీఐపీ గ్యాలరీ ఏర్పాటు చేస్తున్నారు. వేడుకలకు హాజరవ్వాలని ఆహ్వాన పత్రికలను అధికారులు పంపుతున్నారు. ఆన్‌లైన్‌లో రాజధాని రైతులు ఇప్పటికే వేడుకలకు హాజర్వడానికి పేర్లు నమోదు చేసుకున్నారు. మొత్తం 13 వేల మంది కూర్చునేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. వేడుకలకు హాజరమ్యే వీఐపీలు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగిన ఏర్పాట్లు చేయాలని మంత్రి పి.నారాయణ ఆదేశించారు. శుక్రవారం ఆయన రిపబ్లిక్‌ డే వేడుకల ప్రాంగణాన్ని పరిశీలించి అధికారులు తగిన సూచనలు చేశారు. రాయపూడి రెవెన్యూలోని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ భవనాల నుంచి హైకోర్టుకు వెళ్లే మార్గంలో ఈ ఏర్పాట్లు జరుగుతున్నాయి.

మండలి వద్ద చైర్మన్‌... అసెంబ్లీ వద్ద స్పీకర్‌

ఈనెల 26న సోమవారం ఉదయం 8గంటలకు అసెంబ్లీ భవన ప్రాంగణంలోని కౌన్సిల్‌ హాలు వద్ద శాసనమండలి చైర్మన్‌ మోషేన్‌రాజు, ఉదయం 8.15గంటలకు అసెంబ్లీ భవనం ముందు స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. ఉదయం 7గంటలకు సచివాలయం మొదటి బ్లాక్‌ వద్ద ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్‌ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయనున్నారు. ఉదయం 10 గంటలకు నేలపాడులోని రాష్ట్ర హైకోర్టు వద్ద ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్‌ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు.

Updated Date - Jan 24 , 2026 | 06:12 AM