Share News

‘పంచ’ ప్రాతినిధ్యం!

ABN , Publish Date - Mar 26 , 2026 | 12:36 AM

రాజకీయ చైతన్యం..వర్తక, వాణిజ్య రంగాలకు రాజధానిగా ఉన్న విజయవాడ నగరం నియోజకవర్గాల పునర్విభజన నేపథ్యంలో ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలుగా ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం విజయవాడ ఈస్ట్‌, వెస్ట్‌, సెంట్రల్‌ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటికి అదనంగా మరో రెండు నియోజకవర్గాలకు అవకాశం కనిపిస్తోంది. విజయవాడ ఉత్తరం నియోజకవర్గం ఖాయం కాగా, విజయవాడ దక్షిణం నియోజకవర్గానికి కూడా అవకాశం ఉంటుందన్న చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. ఇదే జరిగితే విజయవాడ పంచ అసెంబ్లీ నియోజకవర్గాలతో శక్తివంతంగా ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

‘పంచ’ ప్రాతినిధ్యం!

- విజయవాడలో ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు!

- ప్రస్తుతం తూర్పు, పశ్చిమ, సెంట్రల్‌.. అనదంగా ఉత్తరం, దక్షిణం ఏర్పాటుకు అవకాశం

- 1952లో విజయవాడ పేరుతో ఒకే ఒక్క నియోజకవర్గం

- 1955, 1962 వరకు విజయవాడ ఉత్తర, దక్షిణ నియోజకవర్గాలు

- 1967 నుంచి విజయవాడ తూర్పు, పశ్చిమ

- 2009 నుంచి విజయవాడ తూర్పు, పశ్చిమ, సెంట్రల్‌

- గ్రేటర్‌ సాకారం అయితే బెజవాడకు తొమ్మిది నియోజకవర్గాలు!

- విజయవాడ రూరల్‌, గన్నవరం, మైలవరం, ఇబ్రహీంపట్నంకు అవకాశం

రాజకీయ చైతన్యం..వర్తక, వాణిజ్య రంగాలకు రాజధానిగా ఉన్న విజయవాడ నగరం నియోజకవర్గాల పునర్విభజన నేపథ్యంలో ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలుగా ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం విజయవాడ ఈస్ట్‌, వెస్ట్‌, సెంట్రల్‌ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటికి అదనంగా మరో రెండు నియోజకవర్గాలకు అవకాశం కనిపిస్తోంది. విజయవాడ ఉత్తరం నియోజకవర్గం ఖాయం కాగా, విజయవాడ దక్షిణం నియోజకవర్గానికి కూడా అవకాశం ఉంటుందన్న చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. ఇదే జరిగితే విజయవాడ పంచ అసెంబ్లీ నియోజకవర్గాలతో శక్తివంతంగా ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

(ఆంధ్రజ్యోతి, విజయవాడ):

ప్రస్తుతం భౌగోళిక పరిస్థితుల రీత్యా విజయవాడ నగరం ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలుగా మారటం ఖాయంగా కనిపిస్తోంది. నియోజకవర్గం ఏర్పాటు చేయాలంటే సగటున 1.50 లక్షల మంది ఓటర్లు ఉండాలి. విజయవాడ నగరంలోని మూడు నియోజకవర్గాలలో కలిపి ప్రస్తుతం 7.77 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ రెండున్నర లక్షల వరకు సగటున ఓటర్లు ఉన్నారు. ఈ ప్రాతిపదికన చూస్తే ఖచ్చితంగా విజయవాడ నగరం ఐదు నియోజకవర్గాలుగా ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. విజయవాడ నగరంలో కొత్తగా విజయవాడ ఉత్తరం నియోజకవర్గం ఖాయంగా ఏర్పాటు కానుంది. పాయకాపురం, సింగ్‌నగర్‌, కండ్రిక ప్రాంతాలను కలిపి ఈ నియోజకవర్గం ఏర్పాటు అయ్యే అవకాశం ఉంది. విజయవాడ దక్షిణం నియోజకవర్గానికి కూడా అవకాశం కలగబోతోంది. విజయవాడ దక్షిణం భాగంలో కృష్ణలంక తర్వాత కృష్ణానది ఉండటం వల్ల ప్రస్తుత భౌగోళిక పరిస్థితుల రీత్యా సాధ్యం కాకపోవచ్చని అనుకున్నా.. విజయవాడ దక్షిణం నియోజకవర్గానికి అవకాశం ఉంది. రామలింగేశ్వరనగర్‌, రాణిగారితోట, కృష్ణలంక, లబ్బీపేట ప్రాంతాలను కలిపి విజయవాడ దక్షిణం నియోజకవర్గంగా ఏర్పాటు చేయటానికి అవకాశం కనిపిస్తోంది. పెనమలూరు నియోజకవర్గం రెండు ముక్కలు కావటం ఖాయంగా తెలుస్తోంది. ఈ క్రమంలో విజయవాడను ఆనుకుని ఉన్న గ్రామాలు తూర్పులో కలిసే అవకాశం ఉంది. విజయవాడ గ్రేటర్‌ సమస్యను తీర్చడానికి ఇలా చేయడం అవసరం. కాబట్టి.. విజయవాడ దక్షిణం నియోజకవర్గం ఏర్పాటుకు ఇబ్బంది లేనట్టుగానే భావించాల్సి వస్తోంది.

విజయవాడ నుంచి మొదలై ఉత్తరం, దక్షిణం వరకు

1952లో విజయవాడ నియోజకవర్గం ఒక్కటే ఉండేది. 1955 వచ్చేసరికి విజయవాడ ఉత్తరం, విజయవాడ దక్షిణం నియోజకవర్గాలు ఏర్పడ్డాయి. 1962 వరకు ఈ రెండు నియోజకవర్గాలు ఉన్నాయి. వీటికి 1955, 1962లలో రెండు దఫాలు ఎన్నికలు జరిగాయి. విజయవాడ దక్షిణం నియోజకవర్గానికి 1962లో ఉప ఎన్నిక కూడా జరిగింది. అప్పట్లో విజయవాడ నగరంలో పటమట, గుణదల ప్రాంతాలు లేవు. మొగ ల్రాజపురం, గాంధీనగర్‌, కృష్ణలంక, ప్రస్తుత పశ్చిమ ప్రాంతాలే ఉండేవి. దీంతో అప్పట్లో కేవలం విజయవాడ ఉత్తరం, విజయవాడ దక్షిణం నియోజకవర్గాలు మాత్రమే ఉన్నాయి. విజయవాడ ఉత్తరం పరిధిలో ప్రస్తుత వన్‌టౌన్‌ ప్రాంతం, దక్షిణం నియోజకవర్గంలో ప్రస్తుత టూటౌన్‌ ప్రాంతం ఉండేది. పటమట, గుణదల, కొంత కృష్ణలంక భాగం కంకిపాడు నియోజకవర్గంలో ఉండేవి. అప్పటి పరిస్థితుల రీత్యా ఉత్తర, దక్షిణ నియోజకవర్గాలు మాత్రమే ఉండేవి.

విజయవాడ పేరుతో ఆరు నియోజకవర్గాలు

విజయవాడ నగరంలో ప్రస్తుతం మూడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. రానున్న రోజుల్లో ఐదుకు పెరిగే అవకాశం కనిపిస్తోంది. విజయవాడ ఈస్ట్‌, విజయవాడ వెస్ట్‌, విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గాలతో పాటు కొత్తగా విజయవాడ ఉత్తరం, విజయవాడ దక్షిణం నియోజకవర్గాలు ఏర్పాటు కానున్నాయి. ఈ ఐదు నియోజకవర్గాలతో పాటు విజయవాడను ఆనుకుని విజయవాడ రూరల్‌ నియోజకవర్గం కూడా ఏర్పడబోతోంది. దీంతో విజయవాడ పేరుతో ఆరు నియోజకవర్గాలు ఉంటాయి. విజయవాడ రూరల్‌ మండలంలో ఇప్పటికే 1.50 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. రాజమండ్రి, రాజమండ్రి రూరల్‌, నెల్లూరు, నెల్లూరు రూరల్‌, కాకినాడ, కాకినాడ రూరల్‌, అనంతపురం, అనంతపురం రూరల్‌ నియోజకవర్గాల తరహాలో విజయవాడ రూరల్‌ నియోజకవర్గం కూడా ఏర్పడనుంది.

గ్రేటర్‌ అయితే 9 నియోజకవర్గాలకు అవకాశం

విజయవాడ నగరం గ్రేటర్‌ అయితే మొత్తం తొమ్మిది నియోజకవర్గాలు అవుతాయి. గ్రేటర్‌ విలీన ప్రతిపాదిత ప్రాంతాల్లో విజయవాడ రూరల్‌ ప్రాంతం ఉంది. గన్నవరం, మైలవరం నియోజకవర్గాలు ఉన్నాయి. గ్రేటర్‌ విలీన ప్రాంతంలో కొత్తగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఏర్పడే అవకాశం ఉంది. అప్పుడు విజయవాడ తూర్పు, పశ్చిమ, సెంట్రల్‌, ఉత్తరం, దక్షిణం, రూరల్‌, గన్నవరం, మైలవరం, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాలు ఉంటాయి.

Updated Date - Mar 26 , 2026 | 12:36 AM