పాత కేసులతో ‘కిరికిరి’
ABN , Publish Date - Aug 05 , 2026 | 03:39 AM
కొలువులో ఉండగానే కూటమి సర్కారుపై కుట్రలు పన్నుతున్న ‘ఆ’ అధికారి వ్యూహాలు మరింతగా విస్తరిస్తున్నాయి. రాష్ట్రస్థాయిలో తన అనుకూల అధికారులతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా లోపాయికారీ వ్యవహారాలు నడుపుతూనే...
బాబుపై కొట్టేసిన కేసులు తిరగదోడే లక్ష్యం
ముఖ్యంగా 3 కేసులపై లోతుగా అధ్యయనం
మళ్లీ లిటిగేషన్లు సృష్టించి.. ఎన్నికల దాకా లైవ్‌లో ఉంచే యోచన
దీనికోసం 16 మందితో ప్రత్యేక బృందం
గతంలో కేసులు పెట్టిన మాజీ ఎమ్మెల్యే కీలకం
ఢిల్లీ స్థాయిలో లోతుగా మంతనాలు
విస్తరిస్తున్న ‘ఆ’ అధికారి కుట్ర కోణం
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
కొలువులో ఉండగానే కూటమి సర్కారుపై కుట్రలు పన్నుతున్న ‘ఆ’ అధికారి వ్యూహాలు మరింతగా విస్తరిస్తున్నాయి. రాష్ట్రస్థాయిలో తన అనుకూల అధికారులతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా లోపాయికారీ వ్యవహారాలు నడుపుతూనే... ఢిల్లీ స్థాయిలోనూ ‘లిటిగేషన్ల’కు వ్యూహం రచిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై కోర్టులు కొట్టివేసిన కేసుల్లో మళ్లీ లిటిగేషన్లు సృష్టించి... వాటిని వచ్చే ఎన్నికల వరకు లాక్కెళ్లడం ఎలా? అనే అంశంపై ప్రణాళికలు రచిస్తున్నారు. సర్వీసులో ఉన్న ‘ఆ’ అధికారి... కొంత మంది తన అనుకూల, పోలీసు, సివిల్ విభాగాల అధికారులతో నిరంతరం టచ్‌లో ఉంటున్నారు. చంద్రబాబుపై జగన్ హయాంలో పెట్టిన కేసులను తిరగదోడటంతోపాటు... ఇప్పుడు కూటమి ప్రభుత్వం పెడుతున్న కేసులను నిర్వీర్యం చేయడంపైనే ఆయన దృష్టి. తాడేపల్లిలోని ఒక అపార్ట్‌మెంట్ వేదికగా ఈ వ్యవహారం మొదలుపెట్టిన విషయాన్ని ‘ఆంధ్రజ్యోతి’ ఇదివరకే బయటపెట్టింది. ఈ ప్రణాళికకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలన్నీ హైదరాబాద్‌లో జరుగుతుండగా.. న్యాయపరమైన అంశాలపై ఢిల్లీలో మంతనాలు సాగిస్తున్నారు. మంగళవారం కూడా ఆ బృందం ఢిల్లీలో మంతనాలు జరిపినట్లు తెలిసింది.
ఏం జరుగుతోందంటే..
చంద్రబాబును, కూటమి ప్రభుత్వాన్ని డ్యామేజ్ చేయడం... జగన్‌కు సహకరించడమే అజెండాగా... ‘ఆ’ అధికారి బృందం పని చేస్తోంది. ఇందులో భాగంగా సోషల్ మీడియాలో ప్రభుత్వ వ్యతిరేక ప్రచారాన్ని తారస్థాయికి తీసుకెళ్తోంది. మరోవైపు లిక్కర్ కేసులో తీవ్ర అభియోగాలు ఎదుర్కొంటున్న కీలక నిందితులను అభియోగాల నుంచి బయటపడేసేందుకు వ్యూహాలు రచిస్తోంది. ఆ అధికారి కుట్రలో ఇదొక కోణం! రెండోది.. చంద్రబాబుపై గతంలో కొట్టేసిన కేసులను తిరగదోడటం! ఇందులో ఓ మాజీ ఎమ్మెల్యే కూడా భాగస్వామిగా ఉన్నారు. ఈయనకు ఒకప్పుడు జగన్ అంటే విపరీతమైన భక్తి. ఎన్నికలప్పుడు విభేదించి అలకపాన్పు ఎక్కారు. ఇప్పుడు ‘ఉమ్మడి లక్ష్యం’ కోసం మళ్లీ ఒక్కటయ్యారు. ఆ మాజీ ఎమ్మెల్యే... జగన్ సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబుపై పెట్టిన కేసులను హైకోర్టు కొట్టివేసింది. ఇప్పుడా కేసులను తిరగదోడేందుకు వీలున్న అంశాలపై దృష్టి సారించారు. ఇందుకోసం 16 మందితో లీగల్ టీమ్‌ను ఏర్పాటుచేసినట్లు తెలిసింది. కోర్టు కొట్టేసిన 3 కీలక కేసుల్లో కొత్తగా లిటిగేషన్‌లు పుట్టించి వాటిని జాతీయ స్థాయిలో తెరపైకి తీసుకురావాలన్నది ఈ బృందం వ్యూహం!. ఇందుకు ఢిల్లీనే వేదికగా ఎంచుకోవడానికి రెండు కారణాలున్నట్లు చెబుతున్నారు. జాతీయ స్థాయిలో ఎన్డీయేలో చంద్రబాబు కీలకంగా ఉన్నారు. కాబట్టి, లిటిగేషన్‌ల లెక్క ఎన్డీయేకు తెలిసేలా, జాతీయ స్థాయిలో ముఖ్యమైన చర్చనీయాంశంగా మార్చేలా వ్యూహర చన చేస్తున్నట్లు తెలిసింది. లీగల్ లిటిగేషన్‌లు 2029 ఎన్నికల దాకా లైవ్‌లో కొనసాగేలా, వాటిని బాబుకు వ్యతిరేకంగా రాజకీయంగా ఉపయోగించుకోవడం ఆ బృందం అజెండాగా ఉన్నట్లు తెలిసింది.