Share News

ట్రాన్స్‌కోలో రిపీట్‌ దందా!

ABN , Publish Date - Apr 13 , 2026 | 04:30 AM

వందల కోట్ల రూపాయల సామగ్రిని కొనుగోలు చేయాలంటే ఏ సంస్థ అయినా టెండర్లను పిలుస్తుంది. టెండర్లలో తక్కువ ధర కోట్‌ చేసిన వారికి సరఫరా కాంట్రాక్టు ఇస్తుంది.

ట్రాన్స్‌కోలో రిపీట్‌ దందా!

  • టెండర్లు లేకుండా సరఫరా కాంట్రాక్టులు.. అత్యవసర ముసుగులో వ్యవహారం

  • 5 ఏళ్లలో రూ.540 కోట్ల రిపీట్‌ ఆర్డర్లు

  • అస్మదీయులకు కాంట్రాక్టుల అప్పగింత

  • 33 కేవీ ఫీడర్‌ సీఅండ్‌ఆర్‌ ప్యానెల్‌

  • ధరలో రూ.1.93 లక్షలు తేడా

  • రిపీట్‌ ఆర్డర్‌ ధర రూ.8.47 లక్షలు

  • టెండరు ధర రూ.6.54 లక్షలే

  • 33 కేవీ కెపాసిటర్‌ బ్యాంక్‌ సీఅండ్‌ఆర్‌

  • ప్యానెల్‌లోనూ రూ.2.64 లక్షలు తేడా

  • రిపీట్‌ ఆర్డర్‌ ధర రూ.9.01 లక్షలు

  • టెండరు ధర రూ.6.37 లక్షలే

  • వీటిలోనే రూ.కోటిన్నర దోపిడీ

  • ఇలాంటి రిపీట్‌ ఆర్డర్లు ఎన్నో..

ట్రాన్స్‌కోలో అత్యవసర, ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే టెండర్లు పిలవకుండా ‘రిపీట్‌’ ఆర్డర్లు ఇవ్వాలి. అవసరమైన సామగ్రి కొనుగోలుకు సరఫరా కాంట్రాక్టులు ఇవ్వొచ్చు. దీన్ని సాకుగా తీసుకుని వైసీపీ హయాంలో ‘రిపీట్‌’ అవినీతికి తెరదీశారు. అధికారులు తమకు నచ్చినవారికి కాంట్రాక్టులు ఇచ్చేసి ట్రాన్స్‌కోకు కోట్లాది రూపాయలు గండి కొడుతున్నారు.

2020 ముందు ఏడాదికి రూ.10 కోట్లు మాత్రమే ఉండే రిపీట్‌ ఆర్డర్లు.. ఆ తర్వాత జగన్‌ ప్రభుత్వంలో వందల కోట్లకు చేరుకున్నాయి. 2020 నుంచి 2023 వరకు సుమారు రూ.260 కోట్ల విలువైన రిపీట్‌ ఆర్డర్లు ఇచ్చారు.

ఆ తర్వాత కూటమి హయాంలోనూ రిపీట్‌ అవినీతి కొనసాగుతూనే ఉంది. 2024 నుంచి 2025 వరకు సుమారు రూ.280 కోట్ల రిపీట్‌ ఆర్డర్లు ఇచ్చారు. వెరసి.. వైసీపీ హయాంలో, ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో 5 ఏళ్లలో మొత్తం రూ.540 కోట్ల రిపీట్‌ ఆర్డర్లు కట్టబెట్టారు. కేవలం దోపిడీ కోసమే ట్రాన్స్‌కో అధికారులు రిపీట్‌ ఆర్డర్లను ఆశ్రయిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

వందల కోట్ల రూపాయల సామగ్రిని కొనుగోలు చేయాలంటే ఏ సంస్థ అయినా టెండర్లను పిలుస్తుంది. టెండర్లలో తక్కువ ధర కోట్‌ చేసిన వారికి సరఫరా కాంట్రాక్టు ఇస్తుంది. ఇది సహజంగా జరిగే పద్ధతి. కానీ ఏపీ ట్రాన్స్‌కోలో మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహారం నడుస్తోంది. టెండర్ల ఊసే లేకుండా వందల కోట్ల రూపాయల కాంట్రాక్టులను తమకు నచ్చినవారికి కట్టబెట్టేస్తున్నారు. దీనికి ‘అత్యవసర సరఫరా’ ముసుగేస్తున్నారు. ‘రిపీట్‌’ ఆర్డర్ల పేరిట ట్రాన్స్‌కోకు కోట్ల రూపాయలు గండికొడుతున్నారు. గడిచిన ఐదేళ్లలో సుమారు రూ.540 కోట్ల విలువైన రిపీట్‌ ఆర్డర్లను ట్రాన్స్‌కో అధికారులు కట్టబెట్టేశారు. దీని వెనుక అవినీతి ఉన్నట్టు ఆరోపణలు వస్తున్నాయి.


దోపిడీ ఇలా..: 33 కేవీ ఫీడర్‌ సీ అండ్‌ ఆర్‌ ప్యానెల్‌ (కంట్రోల్‌ అండ్‌ రిలే ప్యానల్‌) ఖరీదు సుమారు రూ.6 లక్షలు. ఇది 33 కేవీ విద్యుత్తు లైన్‌కు సంబంధించిన మెదడు లాంటిది. ఆ విద్యుత్తు లైన్‌లో షార్ట్‌ సర్క్యూట్‌ లేదా ఓవర్‌ లోడ్‌ వంటి లోపాలు తలెత్తితే ఈ ప్యానెల్‌ తక్షణమే గుర్తించి సర్క్యూట్‌ బ్రేకర్‌ను ట్రిప్‌ చేస్తుంది. 2025 మేలో అత్యవసరమంటూ ఓ సంస్థ నుంచి 33 కేవీ సీ అండ్‌ ఆర్‌ ప్యానెళ్లను 42.. 33 కేవీ కెపాసిటర్‌ బ్యాంక్‌ సీ అండ్‌ ఆర్‌ ప్యానెళ్లను 14 కొనుగోలు చేశారు. వీటిని వరుసగా రూ.8.47 లక్షలు, రూ.9.01 లక్షలు ధర చొప్పున కొనుగోలు చేశారు. తాజాగా 2026 మార్చిలో 33 కేవీ సీ అండ్‌ ఆర్‌ ప్యానెళ్లను 51.. 33 కేవీ కెపాసిటర్‌ బ్యాంక్‌ సీ అండ్‌ ఆర్‌ ప్యానెళ్లను 43 కొనుగోలు చేసేందుకు టెండర్లు పిలిచారు. ఈ టెండర్లలో గతంలో రిపీట్‌ ఆర్డర్‌ పొందిన సంస్థే వీటి ధరను వరుసగా రూ.6.54 లక్షలు, రూ.6.37 లక్షలు కోట్‌ చేసి టెండరు దక్కించుకోవడం గమనార్హం. అంటే.. 33 కేవీ సీ అండ్‌ ఆర్‌ ప్యానల్‌ ధరను రూ.1.93 లక్షలు తక్కువకు కోట్‌ చేయగా, 33 కేవీ కెపాసిటర్‌ బ్యాంక్‌ సీ అండ్‌ ఆర్‌ ప్యానెల్‌ను రూ.2.64 లక్షలు తక్కువగా కోట్‌ చేసింది. ఈ ఒక్క రిపీట్‌ ఆర్డర్‌లోనే ట్రాన్స్‌కోకు రూ.కోటిన్నర వరకు గండిపడింది. పోనీ అత్యవసరంగా వాటిని సమకూర్చుకున్నారా అంటే.. అదీ లేదు. టెండరులో కోట్‌ చేసిన గడువు 5 నెలల్లో సరఫరా చేయాల్సి ఉండగా, రిపీట్‌ ఆర్డర్‌లో 4 నెలల సమయం ఇవ్వడం గమనార్హం.


అత్యవసరం కాకున్నా..: ట్రాన్స్‌కోలో అత్యవసర సేవలు అందించాల్సిన పరిస్థితులు వస్తుంటాయి. కానీ అత్యవసరం ముసుగులో అవినీతికి తెరదీయడమే చర్చనీయాంశమవుతోంది. ట్రాన్స్‌కో పర్చేజ్‌ మాన్యువల్‌లో.. అత్యవసర సందర్భాల్లో, ప్రొక్యూర్‌మెంట్‌ లీడ్‌ టైమ్‌ను తగ్గించడం వంటి ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే రిపీట్‌ ఆర్డర్లు ఇవ్వాలని చెబుతోంది. దీన్ని సాకుగా తీసుకుని వైసీపీ హయాంలో ‘రిపీట్‌’ అవినీతి మొదలెట్టారు. 2020 నుంచి 2023 వరకు సుమారు రూ.260 కోట్ల విలువైన రిపీట్‌ ఆర్డర్లు ఇచ్చారు. ఆ తర్వాత కూటమి హయాంలో 2024 నుంచి 2025 వరకు సుమారు రూ.280 కోట్ల రిపీట్‌ ఆర్డర్లు ఇచ్చారు. అంటే.. 5 ఏళ్ల కాలంలో సుమారు రూ.540 కోట్ల విలువైన రిపీట్‌ ఆర్డర్లను కట్టబెట్టేశారు.

ఇవిగో ఉదాహరణలు

  • అవినీతికి ఆస్కారం కలిగించేందుకే రిపీట్‌ ఆర్డర్లను ఆశ్రయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అత్యవసర సందర్భాల్లో మాత్రమే రిపీట్‌ ఆర్డర్లను కట్టబెట్టడం లేదనడానికి... రిపీట్‌ ఆర్డర్లలో సరఫరాకు సగటు గడువు 4 నెలలకుపైగా ఉండటమే నిదర్శనం. ఇవీ ఉదాహరణలు...

  • 2025లో ట్రాన్స్‌కోలో ఉపయోగించే సాఫ్ట్‌వేర్‌ అప్‌గ్రేడేషన్‌ కాంట్రాక్టును రిపీట్‌ ఆర్డర్‌ పేరుతో కట్టబెట్టారు. దీనికి ఇచ్చిన గడువు ఏడాది. కాంట్రాక్టు విలువ రూ.21 లక్షలు.

  • 2025లోనే 500 ఎంవీఏ ట్రాన్స్‌ఫార్మర్ల సరఫరాకు రిపీట్‌ ఆర్డర్‌ను కట్టబెట్టారు. గడువు 21 నెలలు. కాంట్రాక్టు విలువ రూ.28.51 కోట్లు.

  • 2025లోనే 160 ఎంవీఏ ట్రాన్స్‌ఫార్మర్ల సరఫరాకు రిపీట్‌ ఆర్డర్‌ ఇచ్చారు. గడువు 10 నెలలు. కాంట్రాక్టు విలువ రూ.89.81 కోట్లు.

Updated Date - Apr 13 , 2026 | 04:52 AM