Share News

CM Chandrababu: సకాలంలో రుణాలు చెల్లించండి

ABN , Publish Date - Jan 09 , 2026 | 05:47 AM

డ్వాక్రా సంఘాల మహిళలు బ్యాంకు రుణాలను సకాలంలో చెల్లించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.

CM Chandrababu: సకాలంలో రుణాలు చెల్లించండి

  • అప్పుడు బ్యాంకులు ఎక్కువ రుణాలు ఇస్తాయి

  • డ్వాక్రా మహిళలకు చంద్రబాబు సూచన

  • జీవనోపాధి పెంపుపై దృష్టి సారించండి

  • సొంత ఉత్పత్తులకు మార్కెటింగ్‌ పెంచుకోవాలి

  • ‘ఒక కుటుంబం.. ఒక పారిశ్రామికవేత్త’ అంశంపై ఇక ప్రతీ నెలా సమీక్ష

  • పారిశ్రామికవేత్తలుగా చేసేందుకు తోడ్పాటు

  • గుంటూరులో ‘సర్‌స’లో ముఖ్యమంత్రి

గుంటూరు, జనవరి 8(ఆంధ్రజ్యోతి): డ్వాక్రా సంఘాల మహిళలు బ్యాంకు రుణాలను సకాలంలో చెల్లించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సకాలంలో చెల్లిస్తే బ్యాంకులు ఎక్కువ మొత్తంలో రుణాలు ఇచ్చి సహకరిస్తాయని సూచించారు. రుణాలు తీసుకుని ఇంట్లో కూర్చోవద్దని, అలా చేస్తే అవి కచ్చితంగా మిమ్మల్ని మింగేస్తాయని, తర్వాత అప్పులు పాలైపోతారని హెచ్చరించారు. బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పుతో జీవనోపాధి పెంపొందించుకోవడంపై దృష్టి సారించాలని సూచించారు. డ్వాక్రా మహిళలు తయారు చేసిన ఉత్పత్తులకు మార్కెటింగ్‌ను పెంచుకోవాలన్నారు. డ్వాక్రా మహిళల కుటుంబ సభ్యులే రాష్ట్రంలో 3.40 కోట్ల మంది ఉన్నారని, వాళ్లంతా ఆయా ఉత్పత్తులను కొనుగోళ్లు చేసినా చాలన్నారు. గురువారం గుంటూరులో కేంద్ర, రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖలు, సెర్ప్‌, డీఆర్‌డీఏ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఎస్‌ఏఆర్‌ఏఎస్‌ (సేల్‌ ఆఫ్‌ ఆర్టికల్స్‌ ఆఫ్‌ రూరల్‌ ఆర్టీజన్స్‌ సొసైటీ) ప్రదర్శనలో సీఎం ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన డ్వాక్రా మహిళలు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను సందర్శించి వారి బాగోగులు, ఆర్థిక పరిస్థితులు అడిగి తెలుసుకొన్నారు. అనంతరం జరిగిన సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు.


నా మానస పుత్రికలు డ్వాక్రా, మెప్మాలు

‘‘డ్వాక్రా, మెప్మాలు నా మానస పుత్రికలు. నాకు అత్యంత ప్రీతివంతమైనవి. మూడు దశాబ్దాల క్రితం ఏర్పాటు చేసిన సంఘాలు నేడు రూ. లక్ష కోట్ల టర్నోవర్‌కు చేరుకున్నాయి. ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నా.. ఈ రెండు సంస్థలు మాత్రం జీవితంలో శాశ్వతంగా గుర్తుండిపోతాయి. ఆడబిడ్డల సభకు వచ్చినప్పుడు కలిగే ఆనందం నా జీవితంలో ఏ పని చేసినా ఉండదు. డ్వాక్రా సంఘాలను మరో స్థాయికి తీసుకెళ్లడమే నా లక్ష్యం. పొదుపు ఉద్యమాన్ని కాపాడే బాధ్యత మీరు తీసుకోండి. మీ అందరిని బాగు పడేలా చేసే బాధ్యత నేను తీసుకొంటాను. రాష్ట్రంలో ఉండే ఐదు కోట్ల మంది ఆరోగ్యంగా, ఆనందంగా, ఆర్థికంగా బావుండేలా చేయడమే నా కోరిక. అది తప్పక సాధిస్తా’’ అని భరోసా కల్పించారు.

ఆడబిడ్డలతో అనుబంధం ఇప్పటిది కాదు

‘‘తెలుగుదేశం పార్టీకి ఆడబిడ్డలతో అనుబంధం ఇప్పటిది కాదు. దశాబ్దాలుగా కొనసాగుతోంది. ఆస్తిలో సమాన హక్కు చట్టం తెచ్చిన మహనీయుడు నందమూరి తారక రామారావు. 1990లలో నేను సీఎం అయ్యాక మహిళల ఆర్థిక స్థితిగతుల్లో మార్పు తీసుకురావడానికి డ్వాక్రా సంఘం పెట్టి చైతన్యం తీసుకువచ్చాను. సరస్‌ ఎగ్జిబిషన్‌లు సాధారణంగా ఢిల్లీలో జరుగుతుంటాయి. అలాంటి కార్యక్రమాన్ని ఇక్కడికి తీసుకొచ్చినందుకు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ను అభినందిస్తున్నా’’ అని చంద్రబాబు అన్నారు.


నీతి, నిజాయితీగా ఉండాలి

‘‘గ్రామీణ ప్రాంతాల్లో 89 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో 24 లక్షలు కలిపి మొత్తం 1.13 కోట్ల పొదుపు సంఘాలున్నాయి. ఈ సంఘాలలోని సభ్యులు నీతి, నిజాయితీగా ఉండాలి. బ్యాంకుల నుంచి తీసుకొన్న రుణం ఎగ్గొట్టకుండా సకాలంలో చెల్లిస్తే ఇంకా ఎక్కువ మొత్తంలో రుణాలు ఇచ్చి సహకరిస్తారు. ఈ సంవత్సరం ఇప్పటివరకు రూ.31,175 కోట్ల బ్యాంకు రుణాలను తీసుకొన్నారు. 26 వేల కోట్ల రూపాయల రివాల్వింగ్‌ ఫండ్‌ ఉన్న ఏకైక సంస్థ మీది. ఏమైనా డబ్బు అవసరమైతే 48 గంటల్లో స్త్రీనిధి ఇస్తున్నది. రూ.లక్ష కోట్ల అప్పు కావాలన్నా డ్వాక్రా సంఘాలకు ఇచ్చేందుకు బ్యాంకులు సిద్ధంగా ఉన్నాయి. ఒక కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్త ఉండాలన్నదే నా సంకల్పం. ఈ ఏడాది 94 వేల మంది చిన్న, మధ్యతరహా పరిశ్రమలు నెలకొల్పి పారిశ్రామికవేత్తలయ్యారు. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌, రాష్ట్ర ఎంఎ్‌సఎంఈ మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌, సెర్ప్‌ సీఈవో బీ కరుణకు ఒక కుటుంబం, ఒక పారిశ్రామికవేత్త లక్ష్యాలను నిర్దేశిస్తున్నా. ప్రతీ నెలా సమీక్ష, మూడు నెలలకు ఒకసారి సమావేశం ఏర్పాటు చేస్తాను. 70 శాతం మహిళలను పారిశ్రామికవేత్తలుగా చేయడమే మా లక్ష్యం’’ అని చంద్రబాబు అన్నారు. పెమ్మసాని చంద్రశేఖర్‌ ఇక్కడి నుంచి అమెరికా వెళ్లి చదువుకొని వ్యాపారాలు చేసి బాగా సంపాదించారని, దేశంలోని పార్లమెంట్‌ సభ్యుల్లో ఆయనే అత్యంత సంపన్నుడని అన్నారు. పెమ్మసానిని చూసి గర్వపడుతున్నానన్నారు. ఈ సభలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌, రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 09 , 2026 | 05:49 AM