Rental Housing: అద్దె ఇల్లు కావలెను!
ABN , Publish Date - Jan 04 , 2026 | 03:57 AM
ఏలూరు జిల్లాలో పోలవరం ప్రాజెక్టు ముంపు మండలాలైన కుక్కునూరు, వేలేరుపాడులో ఉద్యోగులకు అద్దె ఇళ్లు దొరక్క నానా అవస్థలు పడుతున్నారు.
పోలవరం ముంపు భయంతో ఇళ్లు కట్టని స్థానికులు
అద్దె ఇళ్లు దొరక్క ఉద్యోగుల అవస్థ
కుక్కునూరు, వేలేరుపాడులో ఇళ్లకు డిమాండ్
బాధితుల్లో టీచర్లే ఎక్కువ
కుక్కునూరు, జనవరి 3(ఆంధ్రజ్యోతి): ఏలూరు జిల్లాలో పోలవరం ప్రాజెక్టు ముంపు మండలాలైన కుక్కునూరు, వేలేరుపాడులో ఉద్యోగులకు అద్దె ఇళ్లు దొరక్క నానా అవస్థలు పడుతున్నారు. ఉన్నఇళ్లకు అద్దెలు ఆకాశాన్ని అంటుతున్నాయి. శివారు మండలాలు కావడంతో సరైన సదుపాయాలు లేక పలువురు ఉద్యోగులు డిప్యుటేషన్‌పై వెళ్లడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. దీనంతటికీ ప్రధాన కారణం పోలవరం ప్రాజెక్టు ముంపు భయమే!.
పునరావాస ప్రక్రియ వేగవంతం
ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ఇప్పటికే ప్రభుత్వం 41.15 కాంటూరు లెవెల్‌లో ముంపు గ్రామాల ప్రజలను తరలించడానికి పునరావాస ప్రక్రియ వేగవంతం చేసింది. ఈ ప్రక్రియ పూర్తయిన అనంతరం 45.72 కాంటూరు లెవెల్‌లో ముంపునకు గురవుతున్న గ్రామాల్లోని నిర్వాసితులకు పరిహారం అందిస్తామని ప్రభుత్వం ప్రకటనలు చేస్తోంది. ఈ క్రమంలో కొత్త ఇళ్ల నిర్మాణం జరపాలంటేనే నిర్వాసితుల్లో భయం నెలకొంది. 90శాతం వరకు కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో కొత్త ఇళ్ల నిర్మాణాలు ఎవరూ చేపట్టడంలేదు. ఉన్న ఇళ్లకు మరమ్మతులు చేయిస్తూ కొంత సౌకర్యంగా ఏర్పాటు చేసుకుంటున్నారు.
ఇళ్ల కోసం ఉద్యోగులకు తప్పని తిప్పలు
కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో కొత్తగా సచివాలయాలు ఏర్పాటు చేశారు. దాదాపు 80మందికి పైగా ఉద్యోగులు విధుల్లోకి వచ్చారు. డీఎస్సీ ద్వారా దాదాపు 130 మందికి పైగా ఉపాధ్యాయులు పాఠశాలల్లో విధుల్లోకి చేరారు. అయితే ముంపు భయంతో ఇళ్ల నిర్మాణం ఆగిపోవడంతో కొత్తగా వచ్చిన ఉద్యోగులకు ఇళ్లు దొరకని పరిస్థితి ఏర్పడింది. 3గదులున్న డాబా ఇంటికి రూ.8- 10 వేలు అద్దె పలుకుతోంది. రెండు గదులున్న రేకుల షెడ్డు ఇంటి అద్దె రూ.5వేల పైమాటే. దీంతో పలువురు ఉద్యోగులు డిప్యుటేషన్‌పై వెళ్లడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు కుక్కునూరు ప్రభుత్వ ఆసుపత్రిలో రెండు వైద్యుల పోస్టులు ఖాళీ అయ్యాయి. కోయిదా వైద్యాధికారి బదిలీ అయినప్పటికి కొత్తవైద్యాధికారి రాకపోవడంతో ఆయన అక్కడే విధులు నిర్వహించాల్సిన పరిస్థితి.

ఇళ్లు దొరక్క ఇక్కట్లు
ఈ ఏడాది డీఎస్సీ ద్వారా కుక్కునూరు మండలానికి 70మందికి పైగా ఉపాధ్యాయులు పాఠశాలల్లో చేరారు. వారు స్థానికంగా ఉందామనుకున్నా ఇళ్లు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఒక్క గది ఉన్నా అద్దెకు తీసుకునే పరిస్థితి ఏర్పడింది.
- బి.బాలకృష్ణ, ఉపాధ్యాయుడు,