ప్రముఖ రంగస్థల నటి రజనీబాయి కన్నుమూత
ABN , Publish Date - Sep 24 , 2026 | 06:47 AM
కర్నూలుకు చెందిన ప్రముఖ రంగస్థల నటీమణి, రాయలసీమ గానమంజరిగా గుర్తింపు పొందిన ఎ.రజనీబాయి (75) బుధవారం తెల్లవారుజామున కన్నుమూశారు.
నంది పురస్కారం సాధించిన తొలి నటిగా గుర్తింపు
20 వేలకు పైగా ప్రదర్శనలు, ఎన్టీఆర్‌తో అనుబంధం
కర్నూలు కల్చరల్, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): కర్నూలుకు చెందిన ప్రముఖ రంగస్థల నటీమణి, రాయలసీమ గానమంజరిగా గుర్తింపు పొందిన ఎ.రజనీబాయి (75) బుధవారం తెల్లవారుజామున కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె తెలంగాణ రాష్ట్రం మహబూబ్‌నగర్‌లోని కుమారుడి స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. 1950లో జన్మించిన ఆమె తన బంధువు, నాటక రంగంలో టెక్నీషియన్ అయిన ఎ.నాగరాజును వివాహం చేసుకున్నారు. ప్రఖ్యాత నాటక సమాజం సురభి సంస్థ నుంచి వచ్చిన ఆమె తన 15వ ఏట పౌరాణిక నాటక రంగంలో ప్రవేశించారు. జీవిత కాలంలో 20 వేలకు పైగా నాటక ప్రదర్శనలు చేశారు. పౌరాణిక నాటక రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రజనీబాయి రాష్ట్రవ్యాప్తంగా ప్రముఖ రంగస్థల నటులతో కలిసి నటించారు. సుప్రసిద్ద నటుడు ఎన్టీఆర్‌తో ఆమెకు మంచి అనుబంధం ఉండేది. 1988లో ముఖ్యమంత్రిగా ఆయన చేతులమీదుగా రజనీబాయి ఉగాది పురస్కారం అందుకున్నారు. 1999లో ప్రవేశ పెట్టిన నంది నాటక పోటీల్లో కర్నూలు టీజీవీ కళాక్షేత్రం కళాకారులు ప్రదర్శించిన ‘నరనారాయణ’ నాటకంలో తొలి నంది అవార్డు సాధించి, మొదటి నంది అవార్డు దక్కించుకున్న నటిగా గుర్తింపు పొందారు. రజనీబాయి రంగస్థల రారాణిగా నిలిచిపోయారని కర్నూలు టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షులు కళారత్న పత్తి ఓబులయ్య కొనియాడారు. టీజీవీ కళాక్షేత్రంలో బుధవారం సాయంత్రం రజనీబాయి చిత్ర పటం వద్ద నివాళులర్పించారు.