Religious Intolerance: విద్యార్థుల్లో మత విద్వేష బీజాలు నాటితే దేశానికే ప్రమాదకరం
ABN , Publish Date - Jan 11 , 2026 | 03:17 AM
విద్యార్థుల్లో మత విద్వేష బీజాలు నాటితే అది భవిష్యత్తుకే ప్రమాదకరమని.. నైతికత, జాతీయత లేకుండా విద్యార్థులను సత్యశీలురుగా మార్చడం సాధ్యం కాదని...
వైజ్ఞానిక స్పృహ లేకుండా చేస్తారా?: ఆచార్య దేవరాజు మహారాజ్
గుంటూరులో ప్రారంభమైన యుటీఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు
గుంటూరు (విద్య), జనవరి 10 (ఆంధ్రజ్యోతి): విద్యార్థుల్లో మత విద్వేష బీజాలు నాటితే అది భవిష్యత్తుకే ప్రమాదకరమని.. నైతికత, జాతీయత లేకుండా విద్యార్థులను సత్యశీలురుగా మార్చడం సాధ్యం కాదని ఉస్మానియా యూనివర్సిటీ విశ్రాంత ప్రొఫెసర్, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ఆచార్య దేవరాజు మహారాజ్ స్పష్టం చేశారు. శనివారం గుంటూరు ఏసీ కళాశాలలో యూటీఎఫ్ 51వ కౌన్సిల్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. దేవరాజు మహారాజ్ మాట్లాడుతూ పాఠ్యాంశాల్లో హేతుబద్ధమైన అంశాలను తొలగించి, కవులు, రచయితలను నిర్బంధాలకు గురిచేయడం సరికాదన్నారు. విద్యార్థుల్లో వైజ్ఞానిక స్పృహ ఉండకూడదని పాఠ్యాంశాల్లో 1800 అంశాలను మార్చివేశారని ఆందోళన వ్యక్తం చేశారు. పాఠ్యాంశాల్లో చరిత్రకారుల పేర్లు తొలగించినంత మాత్రాన చరిత్రకారుల కట్టడాలు ఆనవాళ్లు చెరిపి వేయలేరని తెలిపారు. దేశంలో ముస్లింలు, క్రైస్తవుల డీఎన్‌ఏలలో ఆయా మతాల మూలాల్లేవని వీళ్లందరూ భారతీయ మూలాలు ఉన్నవారేనని, వాళ్ల స్వీయ రక్షణ కోసం మతం మారారు తప్ప బలంగా మతమార్పిడి చేయలేదని చరిత్ర చెబుతోందన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఊరు బడిని కాపాడుకుంటేనే పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని తెలిపారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఎ్‌స.ఎ్‌స.ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతిలోగా పీఆర్సీ కమిటీ నియమించాలని లేకపోతే జనవరి 20 నుంచి యూటీఎఫ్ ఉద్యమాలకు సిద్ధమవుతుందని స్పష్టం చేశారు. సమావేశాలకు ముందు గుంటూరులో భారీ ర్యాలీ నిర్వహించారు.