Share News

మండలిలో మత రగడ

ABN , Publish Date - Mar 06 , 2026 | 03:45 AM

ముగిసిపోయిన ‘మత’ వివాదాన్ని మరోసారి లేవనెత్తి శాసనమండలిలో వైసీపీ సభ్యులు నానా రగడ సృష్టించారు. మంత్రి అచ్చెన్నాయుడు, చైర్మన్‌ మోషేన్‌రాజు మధ్య బుధవారం జరిగిన ఆ వివాదం మంత్రి క్షమాపణలు...

మండలిలో మత రగడ

  • ముగిసిన ‘క్రిస్టియన్‌’ వివాదాన్ని తిరిగి లేవనెత్తిన వైసీపీ సభ్యులు

  • అచ్చెన్నాయుడి రాజీనామాకు పట్టు

  • ‘లడ్డూ’పై ఆనం ప్రకటనకు అడ్డంకులు

అమరావతి, మార్చి 5(ఆంధ్రజ్యోతి): ముగిసిపోయిన ‘మత’ వివాదాన్ని మరోసారి లేవనెత్తి శాసనమండలిలో వైసీపీ సభ్యులు నానా రగడ సృష్టించారు. మంత్రి అచ్చెన్నాయుడు, చైర్మన్‌ మోషేన్‌రాజు మధ్య బుధవారం జరిగిన ఆ వివాదం మంత్రి క్షమాపణలు, దానికి చైర్మన్‌ సంతృప్తి ప్రకటించడంతో శాంతియుతంగా సమసింది. అయినా, చైర్మన్‌ను ప్రభుత్వం, అధికార పార్టీ అవమానించాయంటూ గురువారం మండలిలో వైసీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. తిరుపతి లడ్డూ కల్తీ అంశంపై దేవదాయ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ప్రకటన చేస్తుండగా, వైసీపీ సభ్యుడు లేళ్ల అప్పిరెడ్డి ‘మత’ వివాదాన్ని తిరిగి ప్రస్తావించారు. అచ్చెన్న స్పందిస్తూ.. జగన్‌ క్రిస్టియన్‌ అన్న మాటకు కట్టుబడి ఉన్నానని స్పష్టంచేశారు. వైసీపీ సభ్యులు పెద్దఎత్తున నిరసన తెలిపారు. మంత్రి పదవికి రాజీనామా చేయాలని, ఆయన్ను బర్తరఫ్‌ చేయాలంటూ పట్టుబట్టడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. దీంతో మండలి వాయిదా పడింది. తిరిగి సమావేశం అయ్యాక కూడా అప్పిరెడ్డి ఇదే అంశం ప్రస్తావించారు. ‘‘చైర్మన్‌ను అవమానిస్తూ విపరీతంగా ట్రోల్‌ చేస్తున్నారు. ఆ పోస్టులు పెట్టేవారికి సీఎం చంద్రబాబు, మంత్రులు లోకేశ్‌, అచ్చెన్నాయుడుతో సంబంధాలున్నాయి’’ అని ఆరోపించారు. చైర్మన్‌ స్పందిస్తూ.. ముగిసిపోయిన సబ్జెక్ట్‌ను వివాదం చేయొద్దని, సోషల్‌ మీడియా పోస్టులపై ఫిర్యాదు చేస్తే, ప్రభుత్వానికి పంపుతానని తెలిపారు.


తన పేరెత్తడంపై అచ్చెన్నాయుడు అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘‘చైర్మన్‌ను క్రిస్టియన్‌ అన్న మాటలకు అప్పుడే చైర్మన్‌ అభ్యంతరం తెలిపి, తాను హిందువునని స్పష్టం చేయడంతో వెంటనే క్షమాపణ చెప్పా. కానీ, జగన్‌ నూటికి వెయ్యి శాతం క్రిస్టియన్‌. ఒకవేళ ఆయన క్రిస్టియన్‌ కాకపోతే 24 గంటల్లో ఎందుకు స్పందించలేదు? కావాలని, కుట్రపూరితంగా టీటీడీ పవిత్రతను జగన్‌ దెబ్బతీశారు. వాస్తవాలన్నీ బయటకు వచ్చాయి. అవన్నీ హిందూ సమాజానికి తెలుస్తాయని. సంబంధం లేని విషయాలు తెచ్చి, లడ్డూప్రసాదం కల్తీ అంశంపై ప్రభుత్వ ప్రకటనకు అడ్డుపడుతున్నారు. సోషల్‌ మీడియాలో ఏవో పెడుతున్నారని వీళ్లా (వైసీపీ నేతలను ఉద్దేశించి) అనేది? తప్పుడు ప్రచారాలు చేసేదే వీళ్లే’’ అంటూ అచ్చెన్న మండిపడ్డారు.


ప్రశ్నోత్తరాల్లో వైసీపీ యాగీ

శాసనమండలిలో గురువారం అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం నడిచింది. టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడిని పదవి నుంచి తప్పించాలంటూ వైసీపీ సభ్యులు వాయిదా తీర్మానం ఇచ్చారు. దానిని చైర్మన్‌ తిరస్కరించి, ప్రశ్నోత్తరాలను ప్రారంభించారు. వైసీపీ సభ్యులు పోడియంను చుట్టుముట్టి, నిరసనకు దిగారు. సీఎం చంద్రబాబుకు, బీఆర్‌ నాయుడికి మధ్య ఉన్న సంబంధాలను వెల్లడించాలని డిమాండ్‌ చేశారు. ఈ సమయంలో చైర్మన్‌ అరగంట సభను వాయిదా వేశారు. తిరిగి ప్రారంభం కాగానే, సభ్యుల ప్రశ్నలకు మంత్రులు సమాధానం ఇచ్చారు. విపత్తులకు నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లింపుపై మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. గత ఐదేళ్లూ వైసీపీ రివర్స్‌ పాలన నడిపించిందని అనడంతో, వైసీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అరకు కాఫీకి చంద్రబాబు గ్లోబల్‌ బ్రాండ్‌ తెచ్చారని అచ్చెన్న వ్యాఖ్యానించగా, వైసీపీ సభ్యులు ఆహాఓహో అంటూ ఎద్దేవా చేశారు. రైతు సేవా కేంద్రాల నిర్మాణాలపై వైసీపీ సభ్యుడి ప్రశ్నకు డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ తరఫున మంత్రి మనోహర్‌ సమాధానం చెప్తుండగా, కూటమి ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలను నిర్వీర్యం చేసిందంటూ వైసీపీ సభ్యులు పెద్దగా కేకలు వేశారు. నిరుద్యోగ యువతకు ఆర్థిక సాయంపై వైసీపీ సభ్యుల ప్రశ్నకు మంత్రి రాంప్రసాద్‌రెడ్డి సమాధానం చెప్తుండగా, నిరుద్యోగ భృతి ఎందుకివ్వలేదంటూ ఆయనకు అడ్డుపడ్డారు. ఉన్న కంపెనీలు పారదోలిన మీరు ఒక్క డీఎస్సీ అయినా ఇచ్చారా అని వైసీపీ సభ్యులను ఉద్దేశించి టీడీపీ ఎమ్మెల్సీ శ్రీకాంత్‌ ప్రశ్నించగా, వాళ్ల నాయకుడు(జగన్‌) ఇంట్లోని మనుషులనే వెళ్లగొట్టారని టీడీపీ సభ్యురాలు గ్రీష్మ వ్యాఖ్యానించారు.


మీరంతా తీర్మానిస్తే రాజీనామా చేస్తా

కల్తీ నెయ్యి అంశంపై మంత్రి ఆనం ప్రకటన చేస్తున్నప్పుడు సరదా సన్నివేశం మండలిలో చోటుచేసుకుంది. వైసీపీ సభ్యులు ఆయన ప్రకటనకు అడ్డుపడుతూ ‘చేయాలి.. చేయాలి.. రాజీనామా చేయాలి’ అని కేకలు వేశారు. మంత్రి పార్థసారఽథి జోక్యం చేసుకుంటూ, ‘‘మిమ్మల్ని రాజీనామా చేయమంటున్నారు సార్‌’’ అని చైర్మన్‌నుద్దేశించి సరదాగా అన్నారు. అంతే సరదాగా చైర్మన్‌ ప్రతిస్పందిస్తూ.. ‘‘సభ ఏకగ్రీవంగా తీర్మానిస్తే చేసేస్తా. నాదేముంది! వాళ్లూ, మీరూ చెప్పేస్తే చేసేస్తా. అభ్యంతరం లేదు’’ అని అన్నారు. వైసీపీ సభ్యులు నిరసనలు కొనసాగిస్తుండటంతో సభను శుక్రవారానికి వాయిదా వేశారు.

Updated Date - Mar 06 , 2026 | 03:46 AM