మరో భారీ డేటా సెంటర్‌కు రిలయన్స్ రెడీ
ABN , Publish Date - Apr 29 , 2026 | 04:09 AM
దేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్ విశాఖపట్నానికి రాబోతోంది. రూ. 1.60 లక్షల కోట్ల(సుమారు 17 బిలియన్ డాలర్లు) పెట్టుబడితో డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటు చేయడానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ సిద్ధమవుతోంది.
1.6 లక్షల కోట్ల పెట్టుబడితో 1.5 గిగావాట్ క్లస్టర్
దేశంలోనే అతిపెద్ద సెంటర్‌కు ప్రతిపాదన
ఎస్‌ఐపీసీ ఆమోదం.. రేపు క్యాబినెట్‌కు
భోగాపురం సమీపాన 935 ఎకరాల్లో ..
తొలిదశ 2028 అక్టోబరుకు పూర్తి
2030కి పూర్తి సామర్థ్యంతో రెడీ
రిలయన్స్ బాటలో మరిన్ని సంస్థలు
అమరావతి, ఏప్రిల్ 28 (ఆంధ్రజ్యోతి): దేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్ విశాఖపట్నానికి రాబోతోంది. రూ. 1.60 లక్షల కోట్ల(సుమారు 17 బిలియన్ డాలర్లు) పెట్టుబడితో డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటు చేయడానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ సిద్ధమవుతోంది. గూగుల్ డేటా సెంటర్‌ను మించి భోగాపురం ఇంటర్నేషనల్ విమానాశ్రయం సమీపాన 1.5 గిగావాట్ల ఏఐ డేటా సెంటర్ క్లస్టర్ స్థాపించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు ఇచ్చింది. ఇందులో క్యాప్టివ్ సోలార్ బ్యాటరీ స్టోరేజీ వ్యవస్థ కూడా ఉంటుంది. డేటా సెంటర్ క్లస్టర్‌కు రూ. 1.08 లక్షల కోట్లు, పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుకు రూ. 51,300 పెట్టుబడి పెట్టనుంది. ఈ మేరకు రిలయన్స్ చేసిన ప్రతిపాదనలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ అధ్యక్షతన ఇటీవల జరిగిన రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక కమిటీ (ఎస్‌ఐపీసీ) ఆమోదించింది. ఐటీ శాఖ కార్యదర్శి కాటంనేని భాస్కర్, పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్ ఎన్నికల విధుల్లో ఉండటంతో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగే రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్‌ఐపీబీ) ఆమోదం పొందేందుకు వీలు చిక్కలేదు. ఈనెల 30నరాష్ట్ర క్యాబినెట్ భేటీ తర్వాత ఎస్‌ఐపీబీ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో రిలయన్స్ డేటా సెంటర్‌కు ఆమోదముద్ర వేశాక.. ఆ తర్వాత జరిగే మంత్రివర్గ సమావేశంలో రిలయన్స్ డేటా సెంటర్‌కు ఆమోదం లభిస్తుంది.
రెండు దశల్లో నిర్మాణం
గిగావాట్‌కు మించి ఏర్పాటు చేసే ఏఐ డేటా సెంటర్ క్లస్టర్ కోసం రిలయన్స్ సంస్థ 935 ఎకరాలను కోరింది. మొదటి దశలో 300 ఎకరాల్లో 500 మెగావాట్ల డేటా సెంటర్‌ను అక్టోబరు 2028 నాటికి పూర్తి చేస్తుంది. రెండో దశలో 635 ఎకరాల్లో 1 గిగావాట్ డేటా సెంటర్ అందుబాటులోకి వస్తుంది. ఈ మొత్తం ప్రక్రియ 2030 నాటికి పూర్తవుతుంది. రిలయన్స్ దారిలో మరిన్ని డేటా సెంటర్లు విశాఖకు రానున్నాయి. ఇప్పటికే 15 బిలియన్ డాలర్ల పెట్టుబడితో 1 గిగావాట్ గూగుల్ డేటా సెంటర్‌కు మంగళవారం శంకుస్థాపన జరిగింది. 500 మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటుకు సిఫీ సిద్ధంగా ఉంది. 1 గిగావాట్ డేటా సెంటర్ ఏర్పాటుకు డిజిటల్ కనెక్షన్, 300 మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటుకు అనంత్‌రాజ్ క్లౌడ్ సంసిద్ధత వ్యక్తం చేశాయి. అలాగే 1 గిగావాట్ సెంటర్ ఏర్పాటుకు ఆర్‌ఎంజెడ్ సంస్థతో, 300 మెగావాట్ల సామర్థ్యంలో డేటా సెంటర్ ఏర్పాటుకు టిల్‌మ్యాన్ గ్లోబల్ హోల్డింగ్స్‌తో ఇప్పటికే ఒప్పందాలు జరిగాయి. ఏపీలో 6 గిగావాట్ల డేటా సెంటర్ సామర్థ్యాన్ని సాధించడం తమ లక్ష్యమని గతేడాది సెప్టెంబరులో ఐటీ మంత్రి లోకేశ్ చెప్పారు. ఇప్పుడు రిలయన్స్ రాకతో ఆ లక్ష్యానికి చేరువ అవుతున్నారు. ఎంవోయూ చేసుకున్న వాటితో కలిపి 5.6 గిగావాట్ల సామర్థ్యానికి రాష్ట్రం చేరుకుంది.