రిజిస్ర్టేషన్ ఇక సులభం!
ABN , Publish Date - Mar 19 , 2026 | 12:29 AM
ప్రజలను ఎప్పటి నుంచో వేధిస్తున్న గ్రామ కంఠం ఇళ్లస్థలాల సమస్యకు ప్రభుత్వం చెక్ పెట్టింది. రిజిస్ర్టేషన్ ప్రక్రియను సులభతరం చేస్తూ కొత్త విధానం తెచ్చింది. రెవెన్యూ అధికారుల ధ్రువీకరణ పత్రాలతో పనిలేకుండా ఇంటి యజమాని డిక్లరేషన్‌తోనే రిజిస్ర్టేషన్లు జరిగేలా నూతన వ్యవస్థను తెచ్చింది. దీని ద్వారా ప్రభుత్వానికి ఆదాయం పెరగనుంది.
- గ్రామ కంఠం ఇళ్లస్థలాల రిజిస్ర్టేషన్‌లో కొత్త విధానం
- రెవెన్యూ అధికారుల ధ్రువీకరణ పత్రాలతో పనిలేదు
- ఇంటి యజమాని డిక్లరేషన్ ఇస్తే చాలు
- ప్రభుత్వానికి ఆదాయం పెరిగేలా నిర్ణయం
ప్రజలను ఎప్పటి నుంచో వేధిస్తున్న గ్రామ కంఠం ఇళ్లస్థలాల సమస్యకు ప్రభుత్వం చెక్ పెట్టింది. రిజిస్ర్టేషన్ ప్రక్రియను సులభతరం చేస్తూ కొత్త విధానం తెచ్చింది. రెవెన్యూ అధికారుల ధ్రువీకరణ పత్రాలతో పనిలేకుండా ఇంటి యజమాని డిక్లరేషన్‌తోనే రిజిస్ర్టేషన్లు జరిగేలా నూతన వ్యవస్థను తెచ్చింది. దీని ద్వారా ప్రభుత్వానికి ఆదాయం పెరగనుంది.
ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం :
జిల్లాలోని దాదాపు అన్ని గ్రామాలు గ్రామకంఠం భూముల్లోనే ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోని ఇళ్ల స్థలాలకు ఇప్పటికీ సరైన పత్రాలు లేవు. కుటుంబ అవసరాల కోసం లేదా అత్యవసర పరిస్థితిలో ఇంటిస్థలం విక్రయించాలని ప్రయత్నాలు చేస్తే రిజిస్ర్టేషన్ లు ఇటీవల కాలం వరకు అంత సులభంగా అయ్యేవి కాదు. గతంలో రెవెన్యూ అధికారులు ఇచ్చిన ధ్రువీకరణ పత్రాలను ఆధారంగా చేసుకుని ఇళ్ల స్థలాల రిజిస్ర్టేషన్‌లు జరిగేవి. ప్రస్తుతం రెవెన్యూ అధికారులు ధ్రువీకరించకుండానే నేరుగా ఇంటి యజమాని డిక్లరేషన్ ఇస్తే ఇంటి స్థలాన్ని రిజిస్ర్టేషన్ చేసుకునే వెసులుబాటును కూటమి ప్రభుత్వం అమలులోకి తెచ్చింది. దీంతో నివాస గృహాలకు సంబంధించిన స్థలాలు సులభంగా రిజిస్ర్టేషన్ అయితే, సంబంధిత ఇంటి స్థలంపై పూర్తి హక్కులు ఇంటి యజమానులకు రానున్నాయి.
గతంలో అలా.. ఇప్పుడు ఇలా
గతంలో ఇంటి స్థలం విక్రయించాలంటే తొలుత తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాల్సి వచ్చేది. వీఆర్వో, సర్వేయర్, ఆర్‌ఐ, తహసీల్దార్‌లు క్షేత్రస్థాయిలో పరిశీలించి ఫలానా కుటుంబాల వారు ఈ గ్రామాల్లో, ఈ ఇంటి నెంబర్లలో నివాసం ఉంటున్నారని, ధ్రువీకరణ పత్రాలు ఇస్తేనే ఇళ్లస్థలాలు రిజిస్ర్టేషన్‌లు జరిగేవి. ఈ వ్యవహారం అతికష్టంతో కూడుకున్నదిగా ఉండటంతో పాటు, అనధికారికంగా అత్యంత ఖర్చు కూడా అయ్యేది. గృహ యజమానులు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగి, వారిని ప్రసన్నం చేసుకుంటే గాని పనులు అయ్యేవి. గ్రామకంఠంలో ఉన్న ఇంటి స్థలాలకు సరైన పత్రాలు లేకపోవడంతో రెవెన్యూ అధికారులు ధ్రువీకరిస్తూ ఇచ్చిన పత్రాలు ఉంటేనే రిజిస్ర్టార్ కార్యాలయాల్లో ఇంటిస్థలాలు రిజిస్ర్టేషన్‌లను చేసేవారు. ఇంటి స్థలానికి సంబంధించి ధ్రవీకరణ పత్రాల జారీలో పెద్దమొత్తంలో రెవెన్యూ అధికారులు నగదు డిమాండ్ చేస్తుండటంతో కూటమి ప్రభుత్వం రెవెన్యూ అధికారుల నుంచి ఇంటి స్థలాలకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలతో పనిలేకుండా ఇళ్లస్థలాలు రిజిస్ర్టేషన్‌లు జరిగేలా వెసులుబాటును ఇచ్చింది. దీంతో త్వరితగతిన ఇళ్లస్థలాలు రిజిస్ర్టేషన్‌లు జరిగి ప్రభుత్వానికి ఆదాయం సమకూరనుంది.
ఈ ప్రక్రియలో మంచి ఇలా..
తాతల నాటి నుంచి అదే గ్రామంలో, అదే ఇంటిలో నివసిస్తున్నా సంబంధిత గృహానికి సంబంధించిన సరైన పత్రాలు లేకపోవడంతో అత్యవసర పరిస్థితుల్లో ఇంటి స్థలం క్రయ, విక్రయాల సమయంలో ఇబ్బందులు ఎదురయ్యేవి. ప్రస్తుతం రిజిస్ర్టేషన్‌లు సులభతరం కావడంతో ఇంటి స్థలంపై యజమానులకు సర్వహక్కులు వస్తాయి. ఎప్పుడైనా విక్రయించుకునేందుకు, బ్యాంకుల్లో రుణాలు పొందేందుకు మార్గం సుగమం అవుతుంది. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లోనూ పట్టణీకరణ పెరుగుతున్న నేపథ్యంలో కుటుంబ యజమానుల పేరున రిజిస్ర్టేషన్ అయి ఉన్న ఇళ్లస్థలాలకు మంచి ధర పలికే అవకాశాలు ఉన్నాయి.
అనర్థాలు ఇలా..
రెవెన్యూ అధికారులు ఇంటి స్థలాలకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు ఇచ్చే సమయంలో సంబంధిత ఇంటి పరిసరాల్లో విచారణతో పాటు సర్వే చేసి, సరిహద్దులు నిర్థారించుకున్న తర్వాతనే పత్రాలు జారీ చేసేవారు. ప్రస్తుతం ఎలాంటి పత్రాలు లేకున్నా నేరుగా ఇంటి యజమాని ఇచ్చిన డిక్లరేషన్ ఆధారంగా ఇంటిస్థలం రిజిస్ర్టేషన్ చేసే అవకాశం ఉండటంతో కొందరు ఉన్న స్థలం కన్నా అధికంగా చూపి రిజిస్ర్టేషన్ చేసుకునేందుకు అవకాశం ఉంటుందని పలువురు అభిప్రాయపడున్నారు. దీంతో పాటు కుటుంబంలోని ముగ్గురు లేదా నలుగురు వారసులకు సంబంధించినదిగా ఇంటిస్థలం ఉంటుంది. ఒకే కుటుంబానికి చెందిన వారసుల్లో కొందరు ఇతర జిల్లాల్లో, ఇతర రాష్ర్టాల్లో, విదేశాల్లో ఉంటారు. ఇదే అదనుగా తీసుకుని వారసులకు తెలియకుండా ఒక్కరే ఈ ఇంటిస్థలం మొత్తం నాదేనంటూ డిక్లరేషన్ ఇచ్చి రిజిస్ర్టేషన్ చేసుకునే వెసులుబాటు ఉండటంతో ఈ ప్రక్రియలో ఎక్కడో ఒకచోట మోసాలు జరగడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరికొందరు ఓ అడుగు ముందుకేసి వేరే వ్యక్తులకు చెందిన స్థలాన్ని కూడా తమదేనంటూ డిక్లరేషన్ ఇచ్చి రిజిస్ర్టేషన్ చేసుకుంటారనే అంశంపైనా చర్చ జరుగుతోంది. ప్రభుత్వం ఇచ్చిన వెసులుబాటును సక్రమంగా వినియోగించుకుంటే ఇబ్బంది లేదని, అక్రమ పద్ధతిలో రిజిస్ర్టేషన్‌లు చేస్తే వివాదాలు మరింతగా అధికమవుతాయనే అభిప్రాయం ప్రజల నుంచి వ్యక్తమవుతోంది. ఇటీవలనే ఈ ప్రక్రియ ప్రారంభకాగా, కొద్దిరోజులు గడిస్తే ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో వేచి చూడాలి.